Telugu News Astrology Mercury Transit in Gemini 2026: These Zodiac Signs May Experience Rajyoga and Major Fortune
Money Astrology: హమ్మయ్య.. ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
Budh Gochar 2026: మే 30న బుధుడు తన స్వరాశి అయిన మిథునంలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి అదృష్ట యోగాలు కలగనున్నాయి. జూన్ 22 వరకు కొనసాగే ఈ సంచారం ప్రభావంతో వృషభం, మిథునం, సింహం, కన్య, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి ఆర్థిక లాభాలు, రాజయోగాలు, కుటుంబ సమస్యల పరిష్కారం, మానసిక ప్రశాంతత, సుఖసంతోషాలు పెరిగే అవకాశముందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
తెలివితేటలు, బుధ్ధి, విజ్ఞానం, పరిశోధన, సమస్యల పరిష్కారం, షేర్లు, స్పెక్యులేషన్ల వంటి వాటికి కారకుడైన బుధుడు ఈ నెల(మే) 30న తన స్వక్షేత్రమైన మిథున రాశిలో ప్రవేశించడం జరుగుతోంది. జూన్ 22 వరకు మిథున రాశిలో సంచారం చేసే బుధ గ్రహం వల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో ఏదో ఒక శుభ పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. వృషభం, మిథునం, సింహం, కన్య, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి మహా భాగ్య యోగాలు, రాజయోగాలు పట్టే అవ కాశం ఉంది. ఈ రాశులవారికి వ్యక్తిగత, ఆర్థిక, ఆస్తి, కుటుంబ సమస్యలు చాలావరకు పరిష్కారమై, సుఖ సంతోషాలు, మానసిక ప్రశాంతత వృద్ధి చెందుతాయి.
వృషభం: ఈ రాశికి ధనాధిపతి అయిన బుధుడు ధన స్థానంలో ప్రవేశిఒంచడం వల్ల ఈ రాశివారి ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. ఈ రాశివారి సమర్థత వల్ల, వీరి సలహాలు, సూచనల వల్ల సంస్థ వృద్ధి చెందుతుంది. ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది.
మిథునం: ఈ రాశిలో రాశ్యధిపతి బుధుడి సంచారం వల్ల ఈ రాశివారికి భద్ర మహా పురుష యోగం కలిగింది. దీనివల్ల సమాజంలో ఒక ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. ఈ రాశి వ్యక్తులు తమ తమ రంగాల్లో విశేషంగా రాణించడం జరుగుతుంది. అత్యంత ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం పెరగడం, ఒత్తిడి తగ్గడం వంటివి జరుగుతాయి.
సింహం: ఈ రాశికి లాభ స్థానంలో లాభాధిపతి బుధుడి ప్రవేశం వల్ల ఈ రాశివారికి మహా భాగ్య యోగం కలిగింది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ సక్సెస్ అయి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమై, ఆస్తి కలిసి వస్తుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. కెరీర్ విజయపథంలో పురోగమిస్తుంది. మీ సలహాలు, సూచనలకు బాగా విలువ పెరుగుతుంది.
కన్య: ఈ రాశికి దశమ స్థానంలో రాశ్యధిపతి బుధుడి సంచారం వల్ల ఈ రాశివారికి భద్ర మహా పురుష యోగం కలిగింది. దీనివల్ల వీరు ప్రముఖులయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. భోగభాగ్యాలు అనుభవిస్తారు. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది.
తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో భాగ్యాధిపతి బుధుడు స్వస్థానంలో బలంగా సంచరిస్తున్నందు వల్ల ఈ రాశివారికి విదేశీ సంపాదన యోగం పడుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లుఝ అందుతాయి. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నవారికి స్థిరత్వం లభిస్తుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. అనేక విధాలుగా సంపద వృద్ధి చెందుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ధనుస్సు: ఈ రాశికి సప్తమ స్థానమైన మిథున రాశిలో ఆ రాశి అధిపతి బుధుడి సంచారం వల్ల ఈ రాశి వారికి భద్ర మహా పురుష యోగం కలిగింది. దీనివల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. విపరీత రాజ యోగం పడుతుంది. ఒక ప్రముఖుడుగా గుర్తింపు లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. వీరి సలహాలు, సూచనల వల్ల అధికారులు లబ్ధి పొందుతారు. వ్యక్తిగత, ఆర్థిక, కుటుంబ సమస్యలు దాదాపు పూర్తిగా పరిష్కారమవుతాయి.
కుంభం: ఈ రాశికి పంచమాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో సంచారం చేయడంవల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు విపరీతంగా లాభిస్తాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని అభివృద్ధి ఉంటుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. సోదరులకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తారు.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం, మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)