బంగారం ధరిస్తే వీరికి అదృష్టం..! మరి ఎయే రాశుల వారు ధరించకూడదు?
బంగారం అంటే చాలామందికి ఇష్టం. మహిళలు మాత్రమే కాకుండా పురుషులు కూడా బంగారు ఆభరణాలు ధరించడానికి ఆసక్తి చూపిస్తారు. భారతీయ సంప్రదాయంలో బంగారాన్ని ఐశ్వర్యానికి, శుభానికి, లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు. అయితే జ్యోతిషశాస్త్రం ప్రకారం ప్రతి రాశి వారికి బంగారం ధరించడం అనుకూలంగా ఉండదట. కొన్ని రాశుల వారు బంగారం ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందితే, మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య నమ్మకాలు చెబుతున్నాయి.

బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు.. హిందూ సంప్రదాయంలో దీనిని లక్ష్మీదేవి స్వరూపంగా, సంపదకు, ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం బంగారానికి దేవగురువు బృహస్పతితో పాటు సూర్యుడితో కూడా సంబంధం ఉంది. అయితే అన్ని రాశుల వారికి బంగారం ధరించడం అనుకూలంగా ఉండదని జ్యోతిష్య నమ్మకాలు చెబుతున్నాయి. కొన్ని రాశుల వారు బంగారం ధరించడం వల్ల అదృష్టం, గౌరవ మర్యాదలు, ఆర్థిక స్థిరత్వం, వృత్తి, ఉద్యోగ, ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతాయని భావిస్తారు. అలాగే సమాజంలో గౌరవం, హోదా పెరుగుతాయని విశ్వసిస్తారు. మరికొన్ని రాశుల వారు మాత్రం జాతకంలోని గ్రహస్థితులను పరిశీలించిన తర్వాతే బంగారం ధరించాలని సూచిస్తున్నారు.
ఈ రాశుల వారు బంగారం ధరిస్తే శుభం
జ్యోతిష్య అంచనాల ప్రకారం మేషం, కర్కాటకం, సింహం, ధనుస్సు, మీన రాశుల వారికి బంగారం ధరించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రాశుల వారు బంగారు ఆభరణాలు ధరించడం వల్ల అదృష్టం, ఆర్థిక పురోగతి, సమాజంలో గౌరవం పెరుగుతాయని నమ్ముతారు. ముఖ్యంగా గురు గ్రహ అనుకూలత ఉన్నవారికి బంగారం మరింత శుభఫలితాలను అందిస్తుందని జ్యోతిష్య నమ్మకం.
ఈ మూడు రాశుల వారు బంగారం ధరించకపోవడమే మంచిదట!
1. వృషభ రాశి: ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు, గురువు మధ్య అనుకూల సంబంధం ఉండదని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. అందువల్ల వృషభ రాశి వారు ఎక్కువగా బంగారం ధరించడం వల్ల సుఖసంతోషాలు తగ్గడం, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని నమ్ముతారు.
2. మిథున రాశి: ఈ రాశికి బుధుడు అధిపతి. బుధుడు, గురువు మధ్య స్నేహపూర్వక సంబంధం ఉండదని జ్యోతిష్య నమ్మకం. ఈ రాశి వారు బంగారం ధరించడం వల్ల ఏకాగ్రత తగ్గడం, ఆర్థిక వ్యవహారాల్లో నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతారు.
3. మకర రాశి: మకర రాశికి శని అధిపతి. శని, గురువుల స్వభావాలు భిన్నంగా ఉంటాయని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారు బంగారం ధరించడం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు, వ్యాపార నష్టాలు, మానసిక ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉందని భావిస్తారు.
బంగారం ధరించడానికి కొన్ని ప్రత్యేక నియమాలు
- విద్యా, పరిపాలనా, మేధోపరమైన రంగాల్లో అభివృద్ధి కోరుకునేవారు చూపుడు వేలికి బంగారు ఉంగరం ధరించడం శుభప్రదంగా భావిస్తారు.
- వైవాహిక జీవితంలో సంతోషం, సమాజంలో గౌరవం పెరగాలని కోరుకునేవారు మెడలో బంగారు గొలుసు ధరించడం మంచిదని నమ్ముతారు.
- బంగారాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే బంగారు ఆభరణాలను కాళ్లకు ధరించడం అశుభంగా పరిగణిస్తారు.
- మొత్తంగా బంగారం ధరించే ముందు తమ రాశి, జాతకంలోని గ్రహస్థితులను పరిశీలించుకోవాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.
(ముఖ్య గమనిక: ఈ కథనంలోని అంశాలు జ్యోతిషశాస్త్రం, సంప్రదాయ విశ్వాసాల ఆధారంగా చెప్పే విషయాలు మాత్రమే. బంగారం ధరించడం వల్ల అదృష్టం లేదా ఆర్థిక పరిస్థితులు మారుతాయని శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదు. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాలు మారుతాయని జ్యోతిష్యులు భావిస్తారు)




