మరో ఉద్యమానికి రెడీ అవుతున్న పసుపు రైతులు.. !

Tumeric farmers movement in Telangana, మరో ఉద్యమానికి రెడీ అవుతున్న పసుపు రైతులు.. !

పసుపు రైతులు మరో ఉద్యమానికి రెడీ అవుతున్నారు. పసుపు పంటకు మద్దతు ధర ఇవ్వాలని, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌తో నిజామాబాద్ జిల్లాలో రైతులు మలి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. అయితే ముందుగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను పసుపు రైతులు కలిశారు. ఆయనతో రైతులు వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అయితే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పసుపు రైతుల అభ్యున్నతికి కట్టుబడి ఉందన్నారు ఎంపీ అరవింద్. పసుపు బోర్డు విషయంలో శాఖా పరమైన చర్చలు దాదాపుగా ఓ కొలిక్కి వచ్చాయని.. ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని రైతులకు తెలిపారు.

పసుపు పంటను ఆహార ధాన్యాల పంటగా గుర్తించడంతో పాటు కనీస మద్దతు ధర రూ. 15వేలు ప్రకటించాలని రైతు ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఎర్రజొన్న పంటకు కేసీఆర్ ప్రకటించిన బోనస్ ఇవ్వాలని కోరుతున్నారు. ఎర్రజొన్నలకు రూ. 3500 మద్దతు ధర ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్లతో ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. రైతుల నాలుగు ప్రధాన డిమాండ్లపై ప్రజాప్రతినిధులు ఏవిధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పసుపు బోర్డు కోసం గణేష్ ఉత్సవాల అనంతరం గ్రామస్థాయి నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేసే దిశలో రైతులు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది.

కాగా, పసుపు బోర్డు అంశం మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్తో జాతీయ స్థాయికి చేరింది. పసుపు బోర్డు ఏర్పాటు డిమాండ్‌ను తెలియజేస్తూ.. ఏకంగా ప్రధాని మోదీ పోటీ చేసిన వారణాసి నుంచి పసుపు రైతులు పోటీకి సిద్ధమయ్యారు. అంతేకాదు.. అంతకు ముందు నిజమాబాద్ ఎంపీగా ఉన్న కవిత ఓటమికి కారణం కూడా ఈ పసుపు బోర్డు అంశమే అన్న ప్రచారం ఉంది. పసుపు బోర్డు ఏర్పాటు చేయలేదన్న కోపంతో పదుల సంఖ్యలో రైతులు కవితపై పోటీకి దిగారు. అయితే ఇదే ప్రధాన అంశంగా బీజేపీ వాడుకుంది. బీజేపీ తరఫున పోటీకి దిగిన ధర్మపురి అరవింద్ గెలిచిన వెంటనే పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని.. ఒకవేళ కేంద్ర చేయకపోతే.. తన సొంత డబ్బుతో ఏర్పాటు చేస్తానంటూ ప్రచారం చేశారు. అయితే అనూహ్యంగా నిజామాబాద్ రైతులు ఎన్నికల్లో తీర్పునిచ్చారు. అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నా కేసీఆర్ కుమార్తె కవిత ఓటమిపాలైంది. బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ విజయం సాధించారు. అయితే గెలిచి మూడు నెలలు అయినా.. ఇంకా కేంద్రం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో.. పసుపు రైతులు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. అయితే ఎంపీ అరవింద్ మాత్రం.. శాఖాపరమైన చర్యలు ఓ కొలిక్కి వచ్చాయని.. త్వరలోనే బోర్డు ఏర్పాటవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *