
తూర్పుగోదావరి, నవంబర్ 7: ఎన్నికల ఫలితాలు వెలువడనున్న వేళ తూర్పుగోదావరి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. దేవరపల్లి మండలం ధుమంతునిగూడెం గ్రామానికి చెందిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి గారపాటి దివ్య (28) శుక్రవారం ఆకస్మికంగా మృతి చెందారు. ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్న నేపథ్యంలో, ఫలితాలకు ఒక్కరోజు ముందే ఆమె మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే..
శుక్రవారం దివ్య అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గుండెపోటుతో ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, జనసేన పార్టీ నాయకులు వెల్లడించారు. కూటమి తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగిన దివ్య.. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎంతో కష్టపడ్డారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎన్నికల కోసం ఎంతో శ్రమించిన ఆమె.. ఫలితం చూసుకోకుండానే కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆమె మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఈ విషయం తెలుసుకున్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు దివ్య మృతదేహం వద్ద నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తక్షణ సాయంగా దివ్య కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో అభ్యర్థి దివ్య మృతి చెందడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.