తిరుమలలో మోసం గుట్టురట్టు: మహిళా జర్నలిస్టు ఫిర్యాదుతో దళారీ చిక్కాడు

Tirupati news: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రత్యేక దర్శనం, గదులు ఇప్పిస్తానని చెప్పి భక్తులను మోసం చేసిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పల్నాడు జిల్లా పెద్దకూరపాడు మండలం లింగంగుంటకు చెందిన బోడపాటి నవీన్ చౌదరి టీటీడీ ఉద్యోగినని చెప్పుకుని సోషల్ మీడియా ద్వారా భక్తులతో పరిచయం పెంచుకుని మోసాలు చేసినట్లు గుర్తించారు. గత కొన్నేళ్లుగా ఈ దందా కొనసాగించినట్లు పోలీసులు తెలిపారు.

తిరుమలలో మోసం గుట్టురట్టు: మహిళా జర్నలిస్టు ఫిర్యాదుతో దళారీ చిక్కాడు
Fraud Case Tirumala

Edited By:

Updated on: May 15, 2026 | 12:29 PM

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం పేరుతో బురిడీ కొట్టించిన మరో మోసగాడి బండారం బయట పడింది. టీటీడీ ఉద్యోగిని అంటూ బురిడీ కొట్టించాడు కేటుగాడు. శ్రీవారి దర్శనంతో పాటు గదులు ఇప్పిస్తానని భక్తులను మోసం చేసినట్లు తేలింది. పల్నాడు జిల్లా పెద్దకూరపాడు మండలం లింగంగుంట‌కు చెందిన బోడపాటి నవీన్ చౌదరిని అరెస్టు చేసిన పోలీసులు.. టీటీడీ ఉద్యోగి అంటూ భక్తులను మోసగిస్తున్న వ్యవహారాన్ని బయటపెట్టారు. గత కొన్నేళ్లుగా ఈ దందా కొనసాగుతున్నట్లు గుర్తించారు. సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకుంటూ టిటిడి ఉద్యోగిగా చలామణి అయిన నవీన్ చౌదరి.. శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పిస్తామంటూ భక్తులను మోసం చేస్తూ ఉన్నాడు.

ఫోన్ పే ద్వారా డబ్బు లాగేస్తూ మోసాలకు పాల్పడ్డ నవీన్ చౌదరి.. తాజాగా హైదరాబాద్‌కు చెందిన జర్నలిస్ట్ సూర్యకళ కుటుంబాన్ని మోసగించాడు. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో నవీన్ మోసాలు వెలుగు చూశాయి. గత మార్చిలో ఆరుగురికి శ్రీవారి దర్శనం చేయిస్తానని నమ్మ బలికిన నవీన్ చౌదరి యూపీఐ ద్వారా రూ. 47 వేలు పొందాడు. ఆ తర్వాత తిరుమలకు వచ్చిన సూర్య కళ ఫ్యామిలీ నుంచి దర్శనం, వసతి పేరుతో మరో రూ. 18 వేలు నగదు తీసుకొని అదృశ్యం అయ్యాడు. దీంతో మోసపోయానని గుర్తించిన సూర్య కళ విజిలెన్స్ అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేశారు.

టిటిడి విజిలెన్స్.. సూర్యకళ చేత తిరుమల వన్ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేయించడంతో రంగంలోకి దిగారు తిరుమల పోలీసులు. నిందితుడు నవీన్ చౌదరిని అదుపులోకి తీసుకున్నారు. పల్నాడు జిల్లాలో
నవీన్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. నవీన్ బ్యాంక్ లావాదేవీలను పరిశీలించారు. దాదాపు రూ.10 లక్షలకు పైగా లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.

2021 నుంచి ఇప్పటి దాకా నవీన్‌పై గుంటూరు, ప్రకాశం జిల్లాలో 4 చీటింగ్ కేసులు ఉన్నట్లు గుర్తించారు. నవీన్‌ను కోర్టులో హాజరుపర్చిన అనంతరం 15 రోజుల రిమాండ్‌కు తరలించారు.

Follow Us