
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై అవగాహన కల్పించినా..జరిమానాలు విధించినా.. జైలు శిక్షలు వేయించినా..కొంతమంది తాగుబోతుల్లో మార్పు కూడా రావడం లేదు. మత్తు తలకెక్కి..వేగం అదుపుతప్పి.. అమాయకుల ప్రాణాల మీదకు తెస్తున్నారు. టెర్రరిస్టుల కంటే ప్రమాదకరంగా మారుతున్నారు. లేటెస్ట్‌గా రాజమండ్రిలో ఓ ‘మత్తో’న్మాది..వైద్య విద్యార్థిని బలి తీసుకున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వైద్య విద్యార్థిని ప్రియాంక ప్రమాద ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.. దీనికి సంబంధించి లభ్యమైన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తే ఇది ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగా చేసినదేనని స్పష్టమవుతోందని పలువురు పేర్కొంటున్నారు. హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నార. అయితే.. ఇది మద్యం మత్తులో జరిగిన ఘటన అని పోలీసులు స్పష్టంచేస్తున్నారు.
మద్యం మత్తు, దానికి తోడు తలకెక్కిన అహంకారం వెరసి ఎంతటి అనర్థాలకు దారితీస్తాయో రాజమండ్రిలో జరిగిన ఈ ఘటనే సాక్ష్యం.. రాజమండ్రిలోని ప్రసాద్ ఆదిత్య మాల్‌కు ఫుల్లుగా మద్యం తాగి వెళ్లారు ఇద్దరు యువకులు. వీరి పరిస్థితిని చూసిన మాల్ సిబ్బంది.. బ్రీత్ ఎనలైజర్ తో పరిశీలించి.. వారిని లోపలికి అనుమతించలేదు. ఆ కోపంతో బయటకు వచ్చిన తాగుబోతులు.. కారుతో దారుణంగా ప్రవర్తించారు.
సెక్యూరిటీపై ఉన్న కోపంతో రగిలిపోయిన ఈ ఉన్మాదులు కారును జెట్ స్పీడ్‌తో పోనిచ్చారు. సరిగ్గా అదే టైంలో గేటు ముందు నుంచి వెళ్తున్న స్కూటీని బలంగా ఢీ కొట్టారు. ఓవర్‌స్పీడ్‌తో కారును మళ్లీ రెండోసారి కూడా అదే స్కూటీని బలంగా ఢీకొట్టాడు. దీంతో స్కూటీ వెనక కూర్చున్న మెడికల్ స్టూడెంట్‌కి గట్టిగా దెబ్బలు తాకాయి. ఆమె కింద పడిపోయింది. అక్కడితో ఆగకుండా మూడో సారి కూడా.. అదే స్పీడ్‌తో ఆమె తలపై నుంచి కారు తొక్కిస్తూ రాక్షసంగా ముందుకెళ్లారు.
వీళ్ల ‘మత్తో’న్మాదానికి జీఎస్ఎల్ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న ప్రియాంక అనే విద్యార్థిని తలకు బలమైన గాయమైంది. ప్రస్తుతం ఆమె ICUలో బ్రెయిన్‌డెడ్ కండిషన్‌లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.మరోవైపు బైక్ నడిపిన ఆమె స్నేహితుడు తీవ్రగాయాలపాలయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసిన ప్రకాష్‌నగర్ పోలీసులు.. నిందితులను నామవరానికి దస్వంత్, జోసఫ్‌గా గుర్తించారు.
మద్యం మత్తులో ఈ దుర్మార్గులు చేసిన యాక్సిడెంట్ నిండు ప్రాణాన్ని చావు బతుకుల మధ్యకు నెట్టేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు చేస్తున్నా..కేసులు పెట్టి జైల్లో వేస్తున్నా కూడా ఈ తాగుబోతుల్లో మార్పు రావడం లేదు.
పీకలదాకా తాగి ఓ చోట కూర్చొని చావక..మత్తులో కారు డ్రైవ్ చేసి ఇలా ఎదుటి వాళ్ల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. అటు డబ్బుల మత్తు..ఇటు మద్యం మత్తులో కార్లలో బలాదూర్‌గా షికారు చేస్తూ మత్తులో తూలుతున్నారు. ఆ మైకమే అమాయకుల ప్రాణాల మీదకు తెస్తుంది. ఇలాంటి మత్తుగాళ్లను ఊరి వేసినా తప్పులేదని చెబుతున్నారు బాధితులు..