జనసేనకు దారేది?.. ఇప్పుడు ఏపీలో హాట్ డిస్కషన్ ఇదే. ప్రధాని మోదీతో భేటీ అయిన పవన్ కల్యాణ్ ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. అసలు భేటీలో ఏం మాట్లాడారో కూడా మీడియా ముందు చెప్పడానికి ఇంట్రస్ట్ చూపించలేదు. దీంతో అసలు ఆ భేటీ ఫలవంతంగా ముగిసిందా లేక అసంతృప్తిగా ముగిసిందా అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. నిన్నటి వరకూ టీడీపీతో జనసేన పొత్తు దాదాపు ఖరారైనట్టేనని.. రెండు పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాయని విపరీతంగా చర్చ నడిచింది. విజయవాడలో పవన్, చంద్రబాబు భేటీ తర్వాత రెండు పార్టీల్లో కార్యకర్తలు పొత్తు విషయంలో పూర్తిస్థాయి నిర్ణయానికి వచ్చేశారు. అప్పుడే ఫలానా నియోజకవర్గాలు జనసేనకు ఇస్తారు.. ఫలనా నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తుందంటూ లెక్కలు కూడా మొదలైపోయాయి. బీజేపీ- జనసేన మధ్య బంధం దాదాపు ముగిసిపోయినట్టేనని అంతా బావించారు. దానికి తోడు విశాఖలో పవన్ కల్యాణ్ ను అడ్డుకున్న తర్వాత బీజేపీ నుంచి అంతంతమాత్రంగానే స్పందన ఉండడంతో జనసేన నేతలు కూడా చాలా గుర్రుగా ఉన్నారు. అత్యంత పటిష్టంగా ఉన్న వైసీపీని ఎదుర్కోవాలంటే టీడీపీతో కలవాల్సిందేనని జనసేన పార్టీ నేతలు కూడా చెప్పుకుంటున్నారు.
ఇలాంటి తరుణంలో ఏపీ రాజకీయల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఖాయమంటూ జరుగుతున్న చర్చకు సడెన్ గా బీజేపీ షాక్ ఇచ్చింది. విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఊహించని విధంగా పవన్ కల్యాణ్ ను విశాఖ రావాలని పిలుపునివ్వడంతో ఇప్పటివరకూ జరుగుతున్న చర్చకు, కార్యకర్తల్లో గుసగుసలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు జనసేన కార్యకర్తల్లో గందరగోళం మొదలైంది. ఎందుకంటే పవన్ కల్యాణ్ ఇప్పుడు…. ఆ గట్టునుంటారా..లేక ఈ గట్టునుంటారో అర్థంగాక తలలు పట్టుకుంటున్నారు.
కమల వ్యూహంలో పవన్ కల్యాణ్..
టీడీపీతో పొత్తు ఇక ఖాయమని చర్చ జరుగుతున్న సమయంలో సరిగ్గా పవన్ కు ప్రధాని నుంచి పిలుపు రావడంతో ఇటు తెలుగుదేశం వర్గాల్లోనూ ఇది ఊహించని పరిణామమే.. ఇక్కడే బీజేపీ ఏపీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఏకంగా ప్రధాని మోదీని రంగంలోకి దింపి బీజేపీ గూటి నుంచి జారిపోతున్న పవన్‌ను కమల వ్యూహంలో బంధించినట్టుగా చర్చ సాగుతోంది. పవన్ కల్యాణ్ తో పొత్తు కోసం కోటి ఆశలు పెట్టుకున్న బీజేపీ ఏపీ నేతలు..అనూహ్యంగా ఆయన టీడీపీ వైపు ఆసక్తి చూపుతుండడంతో…. ఏం చేయాలో అర్థంగాని స్థితిలో పడిపోయారు. అయితే ఏపీలో మోదీ పర్యటన వారికి వరంలా మారింది. పీఎంవోతో చర్చించిన ఏపీ బీజేపీ నేతలు ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ తో మోదీ భేటీ అయ్యేలా అపాయింట్ మెంట్ ఖరారు చేయించారు. జారిపోతున్న పవన్ ను మోదీ చేత చెప్పించి తిరిగి తమ పార్టీతో బంధాన్ని పవన్ కొనసాగించేలా చేయాలని బావించారు. అందుకే విశాఖ పర్యటనకు అరగంట ఆలస్యంగా చేరుకున్న మోదీ.. షెడ్యూల్ ప్రకారం మొదట బీజేపీ కోర్ కమిటీతో భేటీ కావాల్సి ఉన్నప్పటికీ.. అది కాదని మొదట పవన్ తోనే సమావేశం ఏర్పాటు చేయించారు. ఈ పవన్‌తో భేటీకి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా.. అటు బీజేపీ కేడర్ లో ఇటు జనసేన కేడర్ లో పాజిటివ్ సిగ్నల్ పోవాలనేది వారి ఆలోచనగా తెలుస్తోంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ప్రధాని మోదీతో పవన్ భేటీ కావడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఆ గట్టునుంటాడా…ఈ గట్టునుంటాడా..
2014 ఎన్నికల కు ముందు జనసేన పార్టీని ప్రారంభించిన పవన్ కల్యాణ్ అప్పట్లో అటు బీజేపీ,ఇటు టీడీపీ పొత్తుతో పోటీ చేసిన కూటమికి మద్దతుగా రాష్ట్రంలో ప్రచారం చేశారు. తన పార్టీ డైరెక్ట్ గా పోటీ చేయకపోయినప్పటికీ.. టీడీపీ, బీజేపీ కూటమి గెలుపు కోసం కష్టపడ్డారు. 2019 ఎన్నికలకు ముందు అనూహ్యంగా అటు టీడీపీతోనూ,ఇటు బీజేపీతోనూ విబేధించి సొంతకుంపటి పెట్టుకున్న పవన్ ఆ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు, బీఎస్పీతో కలిసి పోటీ చేసి ఒకే ఒక స్థానం నుంచి మాత్రమే గెలవగలిగారు. అయితే 2019 ఎన్నికల తర్వాత మళ్లీ లెఫ్ట్ పార్టీలకు రాంరాం చెప్పేసిన పవన్..మళ్లీ బీజేపీకి దగ్గరయ్యారు. ఒకప్పుడు తిరుపతి వేదికగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పాచిపోయిన లడ్డూలు మాకు ఇస్తారా అంటూ బీజేపీని హేళన చేసిన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత ఆదే తిరుపతి వేదికగానే..తిరిగి బీజేపీతో కలుస్తున్నట్టుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అప్పట్లో బీజేపీకి ఎందుకు దూరమయ్యారో..ఆ తర్వాతో అదే బీజేపీతో తిరిగి ఎందుకు కలిశారో తలలు పండిన రాజకీయనాయకులకు కూడా అర్థం కాలేదు. అంతవరకూ బాగానే ఉంది. వాస్తవానికి ఆరుశాతం ఓటు బ్యాంక్ ఉన్న జససేన వల్ల బీజేపీకి లాభం ఉండదని.. అలాగే ఏపీలో కేవలం రెండు శాతం ఓటు బ్యాంక్ కూడా లేని బీజేపీ వల్ల జనసేనకు ఎలాంటి ఉపయోగం ఉండదన్న అభిప్రాయం కూడా ఉంది. క్రౌడ్ పుల్లర్ గా పేరున్న పవన్ కల్యాణ్ సమావేశం ఏర్పాటు చేస్తే పిలవకుండానే వేలమంది జనం వస్తారు. అలాంటి పాపులారిటీ ఉన్న పవన్ కల్యాణ్ ను వదులుకోవడం ఏపీ బీజేపీ నేతలకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ , జనసేన కలిసి పోటీ చేయాలనేది వారి ప్రయత్నం.. అలాంటి పరిస్థితుల్లో పవన్ కమలం వదిలి సైకిల్ ఎక్కే సూచనలు కనిపిస్తుండడంతో అకస్మాత్తుగా మోదీతో సమావేశం ఏర్పాటు చేశారు బీజేపీనేతలు. అయితే నిజానికి మోదీతో జరిగిన సమావేశంలో ఏకంతంగా జరిగింది. సమావేశంలో ఏమి చర్చించారన్నది ఇంతవరకూ బయటకు లీక్ కాలేదు.
అచ్చేదిన్ ఆయేగా..
భవిష్యత్తులో రాష్ట్రానికి మంచిరోజులు రాబోతున్నాయి అని భేటీ అనంతరం మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ చెప్పారు. మంచిరోజులు అంటే ఏ విధంగా రాబోతున్నాయి అనేది ఇప్పటికీ ఎవరికీ అర్థం కాలేదు.. అచ్చే దిన్ ఆయేగా అనే బ జేపీ హిందీలో ఉన్న నినాదాన్ని తెలుగులోకి తర్జుమా చేశారు తప్ప.. అసలు విషయం మాత్రం బయటకు చెప్పలేదని స్వయంగా జనసేన కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ఇటు బీజేపీ నేతలు కూడా సమావేశం వివరాలు బయటకు చెప్పడం లేదు. అసలు పవన్ కల్యాణ్ తిరిగి బీజేపీతోనే ఉండడానికి ఒప్పుకున్నారా ..లేక టీడీపీని కూడా బీజేపీవైపు తీసుకురావడానికి ఒప్పుకున్నారా…అనేది కూడా క్లారిటీ లేదు. అటు బీజేపీ నేతలు మాత్రం మమ్మల్ని ఏపీలో సింగల్ గానే పార్టీ బలోపేతం చేసుకోవడానికి కష్టపడండి అని మోదీ సూచించారని చెబుతున్నారు. ఎవరి సపోర్ట్ లేకుండానే సింగిల్ గా బీజేపీ ఏపీలో ఎదగాలని మోదీ ఆశిస్తున్నారు అంటే పవన్ సహకారం అవసరం లేదని సిగ్నల్ ఇచ్చారా అనే చర్చ కూడా నడుస్తోంది. మరి టీడీపీ సంగతేంటనేది ఊహకి కూడా అందడం లేదు.
పవన్ కల్యాణ్ మూడు ఆప్షన్లు..
గతంలో పవన్ ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి మూడు ఆప్షన్లు ప్రకటించారు. అందులో ఒకటి – బీజేపీ , జనసేన కలిసి పోటీ చేయడం, రెండు-బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయడం, మూడు-జనసేన మాత్రమే సింగిల్ గా పోటీ చేయడం.. ఇందులో మూడో ఆప్షన్ జోలికి ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ వెళ్లే అవకాశం లేదు. ఎందుకంటే సింగిల్ గా వెళ్తే.. 2019లో కేవలం ఒకేఒక సీటు సాధించారు. అలాంటి తప్పు మరోసారి జనసేన అధినేత చేసే అవకాశం లేదు. కాబట్టి ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకుంటారు.. అలాంటి సందర్భంలో 2014 కాంబినేషన్ రిపీట్ చేస్తారని అందరూ భావించారు. అందులో భాగంగానే రెండో ఆప్షన్ ను పవన్ ఎంచుకుంటారనే చర్చ సాగింది. అయితే బీజేపీతో ఈ మధ్యకాలంలో గ్యాప్ రావడంతో టీడీపీతో కలిసి చేస్తారని ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లోనే మళ్లీ మోదీని కలిసి బయటకు వచ్చాక రాష్ట్రానికి మంచిరోజులు వస్తున్నాయని చెప్పడంతో మరోసారి కార్యకర్తల్ని గందరగోళంలోకి నెట్టారు పవన్ కల్యాణ్. దీంతో తమ పార్టీ అధినేత అటు బీజేపీతో ఉంటాడా…లేక టీడీపీతో కలుస్తాడా..లేక మూడుు పార్టీలు కలిసి పోటీ చేస్తాయో అర్థంగాక జనసేన కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.
– అశోక్ వేములపల్లి, అసోసియేట్ ఎడిటర్, టీవీ9
మరిన్ని ఏపీ వార్తలు చదవండి