
ఏపీలో కరెంట్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల వరకు కరెంట్ ఛార్జీలను పెంచేది లేదని స్పష్టం చేశారు. ఒక్క రూపాయి కూడా ఛార్జీలను పెంచబోమని ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న ధరలు అలాగే వచ్చే ఎన్నికల వరకు కొనసాగుతాయని, ప్రజలకు భారం వేసేందుకు తాము సిద్దంగా లేమని వెల్లడించారు. కృష్ణా జిల్లా పమిడిముక్కలో పేదల సేవలో కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కరెంట్ బిల్లును తగ్గించి ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించామని, రానున్న రోజుల్లో మరింత తగ్గించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
గత ఎన్నికల సమయంలో కరెంట్ బిల్లును పెంచబోమని మామీ ఇచ్చామని, ఆ హామీని ఇప్పుడు తాము నిలబెట్టుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రజలపై అదనపు భారం పడకుండా చేస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని, వాటి ఫలితంగా చార్జీలు తగ్గిస్తున్నామన్నారు. వైసీపీ హయంలో 9సార్లు కరెంట్ ఛార్జీలు పెంచరాని, ట్రూఅప్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం వేశారని విమర్శించారు. తాము ట్రూడౌన్ విధానంలో విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తున్నామన్నారు. కరెంట్ ఛార్జీల విషయంలో ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఒక్క రూపాయి కూడా పెంచమని హామీ ఇచ్చారు. అయితే ప్రతీ నెల 1వ తేదీన పేదల సేవలో కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటున్నారు. ఈ సందర్బంగా ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. అనంతరం సభలో మాట్లాడుతన్నారు.
ఇప్పటివరకు యూనిట్‌పై 13 పైసలు వరకు కరెంట్ ఛార్జీలను కూటమి ప్రభుత్వం తగ్గించింది. రానున్న రోజుల్లో ఛార్జీలు మరింతగా తగ్గనున్నాయి. విడతల వారీగా ఛార్జీలను తగ్గించాలని ప్రభుత్వం చూస్తోంది. అలాగే వైసీపీ హయంలో విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టాల్లో కూరుకుపోగా.. తాము అధికారంలోకి వచ్చాక నష్టాల నుంచి గట్టెక్కించామని చంద్రబాబు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో రూ.18 వేల కోట్ల ట్రూఅప్ చార్జీలు విధించి ప్రజలపై భారం వేశారని విమర్శించారు. కాాగా ఇటీవల మీడియాతో మాట్లాడిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్.. రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలను మరింత తగ్గిస్తామని తెలిపారు. దీని వల్ల ప్రజలపై ఆర్ధిక భారం తగ్గుతుందని వివరించారు. విద్యుత్ సరఫరాను మరింత మెరుగుపరుస్తామని, కొత్త సబ్‌స్టేషన్లను నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు.