
నెల్లూరు జిల్లాలో అక్రమ గంజాయి సాగును పోలీసులు వెలుగులోకి తెచ్చారు. బయటకు మొక్కజొన్న పంట కనిపించేలా చేసి, దాని మధ్యలో ఎవరికీ అనుమానం రాకుండా గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించారు. దుత్తలూరు పోలీస్స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి 565 సమీపంలోని పొలంలో సాగు చేస్తున్న ఈ పంటను డ్రోన్ సాయంతో గుర్తించిన పోలీసులు, భారీగా గంజాయి మొక్కలను దహనం చేశారు. ఈ వ్యవహారంలో ఆరుగురిని అరెస్టు చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. దుత్తలూరు-నందివాడ ప్రాంతాల మధ్య గంజాయి సాగు జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో గురువారం సాయంత్రం డ్రోన్ సాయంతో పొలాలను పరిశీలించగా, మొక్కజొన్న పంట మధ్యలో గంజాయి మొక్కలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
శుక్రవారం ఉదయం ఎస్పీ అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో గంజాయి పంటను దహనం చేశారు. మొత్తం 1,731 గంజాయి మొక్కలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మొక్కలకు డ్రిప్ విధానంలో నీటిని అందిస్తూ సాగు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. పోలీసుల విచారణలో నిందితులు గత రెండున్నరేళ్లుగా గంజాయి సాగు చేసి విక్రయిస్తున్నట్లు తేలింది. పంట చేతికొస్తే సుమారు రూ.కోటి ఆదాయం వస్తుందని నిందితులు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో మొత్తం తొమ్మిది మంది ఉన్నట్లు గుర్తించారు. వారిలో ఆరుగురిని అరెస్టు చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్నవారు ఒడిశా రాష్ట్రానికి చెందినవారని, అరెస్టయిన ఆరుగురు దుత్తలూరుకు చెందినవారని పోలీసులు తెలిపారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉప్పలపాటి సుబ్బారెడ్డిని పోలీసులు గుర్తించారు. గతంలో డ్రైవర్గా, కాంట్రాక్టర్గా, వ్యాపారిగా పనిచేసిన ఆయన అప్పుల్లో కూరుకుపోయిన తర్వాత గంజాయి రవాణా చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. అల్లూరి జిల్లా నుంచి గంజాయి విత్తనాలు తీసుకొచ్చి సాగు చేసినట్లు ప్రధాన నిందితుడు విచారణలో చెప్పినట్లు సమాచారం. ఈ సాగుకు గుంటూరు జిల్లాకు చెందిన పవన్రెడ్డి ఆర్థిక సాయం అందించినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన శ్రీకాంత్ గంజాయి కొనుగోలు చేసేందుకు ముందస్తుగా రూ.50 వేలు ఇచ్చినట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు. గంజాయి సాగు, విక్రయాల వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలింపు చేపట్టారు. అక్రమ సాగుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, గంజాయి కొనుగోలు, సరఫరా వ్యవస్థపై మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
Ganja Crop Destroyed