
భారతదేశంలో అల్పాహారంగా అత్యంత ప్రజాదరణ పొందిన వంటకాల్లో దోశ ఒకటి. మసాలా దోశ, ఆనియన్ దోశ, రవ్వ దోశ, ప్లెయిన్ దోశ వంటి అనేక రకాలు ఉన్నప్పటికీ, కొద్దిగా కారంగా తినడానికి ఇష్టపడేవారికి నెల్లూరు కారం దోశ ఒక ప్రత్యేక ఎంపిక. నెల్లూరులో ఈ ప్రత్యేక దోశ తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసకుందాం.
నెల్లూరు కారం దోశకు ప్రత్యేకమైన రుచిని ఇచ్చేది అందులో వాడే కారం. ఇది ఎండు మిరపకాయలు, ఉప్పు, వెల్లుల్లి (స్థానికంగా తెల్లగడ్డ అంటారు), జీలకర్ర, ఉల్లిపాయ (స్థానికంగా ఎర్రగడ్డ అంటారు), టమాటా కలిపి మిక్సీకి వేసుకుంటారు. ఆ తర్వాత ఆవాలు, కరివేపాకు వేసి తిరగమాత పెట్టి, ఈ మిశ్రమాన్ని వేసి కొద్దిసేపు ఉడకనిచ్చి పక్కన పెట్టుకుంటారు. ఈ కారం ఎక్కువగా ఘాటుగా ఉండదు. ఇది నెల్లూరు కారం దోశలో ప్రధానంగా వాడే కారం.
కొందరు మరింత ఘాటుగా తినడానికి ఇష్టపడేవారి కోసం మరో రకం కారం కూడా తయారుచేస్తారు. దీనిని సాధారణంగా గుడ్డు దోశకు వాడతారు, కస్టమర్ల అభ్యర్థన మేరకు ఇస్తారు. ఈ కారంలో ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు మాత్రమే వాడతారు. టమాటా, ఉల్లిపాయలు దీనిలో ఉండవు. ఇది మొదటి కారం కంటే మరింత ఘాటుగా ఉంటుంది.
దోశ పిండిని సిద్ధం చేయడానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది. పిండి నానబెట్టిన తర్వాత, రాత్రంతా పులియబెట్టి, ఉదయం దోశలు చేయడానికి సిద్ధం చేస్తారు.
కారం దోశ ధర 15 రూపాయలు. సాదా దోశ 10 రూపాయలకు లభిస్తుంది. గుడ్డు దోశ ధర గతంలో 25 రూపాయలు ఉండగా, గుడ్లు, ఇతర సరుకుల ధరలు పెరగడం వల్ల ప్రస్తుతం 30 రూపాయలకు పెరిగింది. కస్టమర్లలో కారం దోశ, గుడ్డు దోశలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. గుడ్డు దోశ తయారీ విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ముందుగా నూనె పూసి దోశ వేసిన తర్వాత, దానిపై కారం, నూనె వేసి, గుడ్డు కొట్టి పోస్తారు. మరింత నూనె కావాలనుకునే వారికి అదనంగా వేస్తారు. నెల్లూరు కారం దోశ కేవలం ఒక వంటకం కాదు, అది ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం. ఈ ప్రత్యేకమైన రుచిని ఆస్వాదించడానికి, నెల్లూరు వెళ్ళినప్పుడు కారం దోశను రుచి చూడటం మర్చిపోవద్దు.