
కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలోని ప్రముఖ ప్రైవేట్ వైద్యశాల ‘అమ్మా ఆసుపత్రి’పై బుధవారం (జూన్ 03) వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ అధికారులు ఉమ్మడిగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలో చట్టవిరుద్ధంగా గర్భస్థ శిశు లింగనిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయనే పక్కా సమాచారంతో అధికారులు ఈ దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షలకు సంబంధించిన యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
అమ్మా ఆసుపత్రిలో ఎలాంటి అనుమతులు లేకుండా, రహస్యంగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కొందరు వ్యక్తుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపై తక్షణమే స్పందించిన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సత్యవతి, స్థానిక తహశీల్దార్ శోభాసువర్ణమ్మ తమ సిబ్బందితో కలిసి ఆసుపత్రిని అప్రమత్తంగా తనిఖీ చేశారు.
తనిఖీల్లో భాగంగా ఆసుపత్రిలో నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణకు ఉపయోగిస్తున్న అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరికరాలను, దానికి సంబంధించిన కీలక రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకుని, సీజ్ చేశారు. పీసీపీఎన్‌డీటీ (PCPNDT) చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఈ తరహా స్కానింగ్ పరీక్షలు నిర్వహించడం తీవ్ర నేరమని అధికారులు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సత్యవతి, ఎంఆర్‌ఓ శోభాసువర్ణమ్మ మాట్లాడుతూ.. నిబంధనలు ఉల్లంఘించిన అమ్మా ఆసుపత్రి యాజమాన్యంపై, ఇందుకు సహకరించిన వైద్యులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలూరు డివిజన్ పరిధిలో ఎక్కడైనా లింగనిర్ధారణ పరీక్షలు జరిపితే సహించేది లేదని, అలాంటి ఆసుపత్రుల లైసెన్సులను రద్దు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ ఆకస్మిక తనిఖీతో ఆలూరు ప్రాంతంలోని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.