Dog Bite: కుక్క కరిచిన వెనువెంటనే చేయాల్సిన పనులు ఇవే..

కుక్క కరిస్తే వెంటనే గాయాన్ని సబ్బుతో, పారే నీటిలో 10-15 నిమిషాలు శుభ్రం చేయాలి. యాంటీసెప్టిక్ లోషన్ రాసి, కుట్లు వేయకుండా జాగ్రత్తపడాలి. అనంతరం తప్పనిసరిగా ధనుర్వాతం టీకా, యాంటీబయాటిక్స్, రేబిస్ టీకాలను డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలి. సరైన ప్రథమ చికిత్స రేబిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Dog Bite: కుక్క కరిచిన వెనువెంటనే చేయాల్సిన పనులు ఇవే..
Dog Bite

Updated on: Jun 28, 2026 | 10:26 AM

కుక్కలు ఎంత విశ్వాసవంతమైన జంతువులైనప్పటికీ, కొన్ని సందర్భాలలో ప్రమాదవశాత్తు కరిచే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు రేబిస్ భయం వెంటాడుతుంది. కుక్క కరిస్తే వెంటనే ఏం చేయాలి, ప్రథమ చికిత్సగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

కుక్క కాటు తీవ్రతను గుర్తించడం:

కుక్క కాటు తీవ్రతను బట్టి గాయాలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.

1. తక్కువ ప్రమాదం: చర్మంపై పుండు లేదా గాయం లేకుండా కుక్క నాలుకతో నాకుకోవడం లేదా రక్తం రాకుండా గీరడం. ఇటువంటి సందర్భాలలో రేబిస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ.

2. మధ్యస్థ ప్రమాదం: గాయం లేదా పుండు ఉన్నచోట కుక్క నాకుకోవడం, లేదా రక్తం వచ్చేలా గాయపరచడం. ఇక్కడ రేబిస్ అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి.

3. అధిక ప్రమాదం: మెడ, ముఖం, తల, అరచేతులు, చేతివేళ్ల మీద కుక్క కరవడం, పెద్ద గాయం అవ్వడం, లేదా ఒకేచోట ఐదు కంటే ఎక్కువ గాయాలు అవ్వడం. ఈ పరిస్థితుల్లో రేబిస్ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

వెంటనే చేయాల్సిన ప్రథమ చికిత్స:

రేబిస్ వైరస్ గాయం ద్వారానే శరీరంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి, కరిచిన లేదా గీరిన గాయాన్ని వెంటనే శుభ్రం చేయడం అత్యవసరం.

గాయాన్ని శుభ్రం చేయడం: కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు దారగా పడుతున్న స్వచ్ఛమైన నీటిలో సబ్బుతో గాయాన్ని బాగా కడగాలి. ఇది కుక్క లాలాజలాన్ని, తద్వారా వైరస్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.

పరిశుభ్రత: గాయాన్ని నేరుగా చేతులతో ముట్టుకోకూడదు. చేతులకు గ్లౌజులు ధరించడం శ్రేయస్కరం.

యాంటీసెప్టిక్ లోషన్: గాయాన్ని పొడిగా తుడిచిన తర్వాత, బిటడిన్, డెటాల్ లేదా శావలాన్ వంటి యాంటీసెప్టిక్ లోషన్‌ను రాయాలి. ఇది ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.

కుట్లు వేయవద్దు: గాయం పెద్దగా ఉన్నప్పటికీ, సాధ్యమైనంత వరకు కుట్లు వేయకూడదు. తప్పనిసరిగా వేయాల్సి వస్తే, వదులుగా వేయాలి.

వైద్య చికిత్స, టీకాలు: ప్రథమ చికిత్స తర్వాత వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

డాక్టర్ సలహా మేరకు తీసుకోవాల్సిన టీకాలు:

ధనుర్వాతం (టిటి) ఇంజెక్షన్: ధనుర్వాతం రాకుండా దీనిని ఇస్తారు.

యాంటీబయాటిక్స్: గాయం త్వరగా మానడానికి, ఇన్ఫెక్షన్లను నివారించడానికి యాంటీబయాటిక్స్ అవసరం.

యాంటీ-రేబిస్ టీకా: గాయం తీవ్రతను బట్టి, అవసరాన్ని బట్టి 3 లేదా 5 మోతాదుల్లో యాంటీ-రేబిస్ టీకాలను ఇప్పించాలి. బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు వేయించుకోవాలనే పాత పద్ధతికి బదులుగా, ఇప్పుడు చేతికి టీకాలు ఇస్తారు. సరైన, సకాలంలో తీసుకునే జాగ్రత్తలు,  వైద్య సహాయం ద్వారా కుక్క కాటు వల్ల కలిగే తీవ్రమైన పరిణామాలను సమర్థవంతంగా నివారించవచ్చు.

Follow Us