
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన ఓ వ్యాపారికి బ్యాంకు ఖాతా పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. ఉన్నట్టుండి ఆయన ఖాతాలో రూ.వెయ్యి కోట్లు జమ అయినట్లు కనిపించడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇంత భారీ మొత్తం తన ఖాతాలోకి ఎలా వచ్చిందో అర్థంకాక తల పట్టుకున్నారు. అయితే ఆ ఆనందం, ఆశ్చర్యం ఎంతోసేపు నిలవలేదు. కేవలం అరగంటలోనే ఖాతాలోని మొత్తం డబ్బు మాయమైపోయింది. చివరకు తనకు రావాల్సిన సొంత డబ్బులు కూడా కనిపించకపోవడంతో బ్యాంకు అధికారులను, పోలీసులను ఆశ్రయించారు.
హిందూపురంలోని సదాశివనగర్‌కు చెందిన తోట ఆనంద్ రవాణా వ్యాపారం నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఓ ప్రైవేటు బ్యాంకులో ఆయనకు ఖాతా ఉంది. మంగళవారం మధ్యాహ్నం ఆయన మొబైల్‌కు బ్యాంకు నుంచి మెసేజ్ రావడంతో తెరిచి చూశారు. ఖాతాలో భారీ మొత్తంలో నగదు జమ అయినట్లు అందులో కనిపించింది. వెంటనే బ్యాంకు వివరాలను పరిశీలించగా.. అప్పటివరకు సుమారు రూ.32 వేలుగా ఉన్న నిల్వ ఒక్కసారిగా రూ.వెయ్యి కోట్లకు చేరినట్లు గుర్తించారు.
అంత పెద్ద మొత్తంలో డబ్బు తన ఖాతాలోకి రావడంతో ఆనంద్ విస్తుపోయారు. విషయం నిజమేనా అని నిర్ధారించుకునేందుకు తన స్నేహితులకు కూడా ఖాతా వివరాలను చూపించారు. అయితే ఈ వ్యవహారం వెనుక అసలు కారణం ఏమిటో తెలుసుకునేలోపే మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మొదట వెయ్యి కోట్లు కనిపించిన ఖాతాలో.. అరగంట తిరగకముందే నిల్వ సున్నాకు చేరింది. దీంతో ఆనంద్ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెయ్యి కోట్ల సంగతి అటుంచితే.. అంతకుముందు తన ఖాతాలో ఉన్న రూ.32 వేలకు పైగా నగదు కూడా కనిపించకపోవడంతో ఏం జరిగిందో తెలియక అయోమయానికి గురయ్యారు.
వెంటనే బ్యాంకుకు వెళ్లి సిబ్బందిని వివరణ కోరారు. కానీ అక్కడి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో హిందూపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సైబర్ నేర విభాగానికి కూడా ఫిర్యాదు చేసినట్లు ఆనంద్ తెలిపారు.
తన ఖాతాలోకి అంత భారీ మొత్తం ఎలా వచ్చిందో.. ఆ తర్వాత ఉన్నట్టుండి మొత్తం నిల్వ ఎందుకు మాయమైందో తేల్చాలని ఆయన కోరుతున్నారు. రూ.వెయ్యి కోట్లు తనకు అవసరం లేదని, కనీసం తన ఖాతాలో ఉన్న సొంత డబ్బులైనా తిరిగి ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం హిందూపురంలో ఈ వింత బ్యాంకు లావాదేవీల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.