రైతన్నలూ.. నేలను బట్టి పచ్చిరొట్టె పంటగా ఏది మంచిదో తెలుసుకుందాం..

పచ్చిరొట్టె పంటలైన జీలుగా, జనుము, పిల్లి పెసర, అలసంద, పెసర వంటివి భూసారాన్ని గణనీయంగా పెంచుతాయి. ఇవి నేలలో సేంద్రియ పదార్థాన్ని, నత్రజనిని చేర్చి, పంటల దిగుబడిని మెరుగుపరుస్తాయి. ఈ పంటల లక్షణాలు, సాగు విధానం, నేలకి అందించే పోషక విలువలను గురించి తెలుసుకుందాం.

రైతన్నలూ.. నేలను బట్టి  పచ్చిరొట్టె పంటగా  ఏది మంచిదో తెలుసుకుందాం..
Green Manure Crops

Updated on: Jun 16, 2026 | 5:39 PM

ఆధునిక వ్యవసాయంలో భూసారం క్షీణించడం ఒక ప్రధాన సమస్యగా మారింది. దీనికి పరిష్కారంగా పచ్చిరొట్టె పంటల సాగు ఒక సమర్థవంతమైన పద్ధతి. పచ్చిరొట్టె పంటలు నేలలో సేంద్రియ పదార్థాన్ని, నత్రజనిని స్థిరీకరించి, భూమి ఆరోగ్యాన్ని, ఉత్పాదకతను మంచిగా మెరుగుపరుస్తాయి. ఈ పంటలను పూత దశలో భూమిలో కలియదున్నడం ద్వారా నేలకు అవసరమైన పోషకాలు లభించి, తద్వారా అధిక దిగుబడులకు అవకాశం ఏర్పడుతుంది. పలు ప్రముఖ పచ్చిరొట్టె పంటలు, వాటి లక్షణాలను పరిశీలిద్దాం:

1. జీలుగ:

జీలుగ పంట చౌడు పొలాలకు, వరి పండించే పొలాలకు అత్యంత అనుకూలం. తేలికపాటి, ఇసుక నేలల్లో కూడా దీనిని సాగు చేసుకోవచ్చు. ఈ పంట వేరుబుడిపెలను అధికంగా కలిగి ఉండటం వల్ల నత్రజని స్థిరీకరణను సమర్థవంతంగా చేస్తుంది. ఎకరాకు 12 నుంచి 15 కిలోల విత్తనం అవసరం. పూత దశలో దీన్ని భూమిలో కలియదున్నడం వలన ఎకరానికి 8 నుంచి 10 టన్నుల పచ్చిరొట్టె ఎరువు లభిస్తుంది. ఒక టన్ను పచ్చిరొట్టె ఎరువులో సుమారు 6 కిలోల నత్రజని, 1 నుంచి 1.5 కిలోల భాస్వరం,  5 కిలోల పొటాష్ ఉంటాయి.

2. జనుము:

జనుము అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవడానికి అనుకూలమైన పంట. ఇది కేవలం పచ్చిరొట్టె ఎరువుగానే కాకుండా, పశుగ్రాసంగా కూడా ఉపయోగపడుతుంది. ఎకరాకు 12 నుంచి 15 కిలోల విత్తనం సరిపోతుంది. దీన్ని పూత దశలో భూమిలో కలియదున్నుకోవాలి. దీని ద్వారా ఎకరానికి సుమారుగా 4 నుంచి 6 టన్నుల పచ్చిరొట్టె ఎరువు లభిస్తుంది. ఒక టన్ను పచ్చిరొట్టె ఎరువులో 7 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరం (ఫాస్ఫరస్) , 5 కిలోల పొటాష్ ఉంటాయి.

3. పిల్లి పెసర:

పిల్లి పెసర పంట కూడా అన్ని రకాల నేలలకు అనుకూలంగా ఉంటుంది. అయితే, ఇది చౌడు భూముల్లో సాగుకు అనుకూలం కాదు. ఇది పచ్చిరొట్టెగాను, పశుగ్రాసంగాను ఉపయోగపడుతుంది. ఎకరాకు 6 నుంచి 8 కిలోల విత్తనం అవసరం. ఈ పిల్లి పెసరను భూమిలో కలియదున్నడం ద్వారా ఎకరానికి సుమారుగా 4 నుంచి 6 టన్నుల పచ్చిరొట్టె ఎరువు లభిస్తుంది. ఒక టన్ను పచ్చిరొట్టె ఎరువులో 7 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరం, 5 నుంచి 6 కిలోల పొటాష్ ఉంటాయి.

4. అలసంద:

అలసందను పచ్చిరొట్టె ఎరువుగా, పశువుల మేతగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఈ పంట నీటి ఎద్దడిని సమర్థవంతంగా తట్టుకుంటుంది. దీన్ని భూమిలో కలియదున్నడం ద్వారా 4 నుంచి 6 టన్నుల పచ్చిరొట్టె ఎరువు లభిస్తుంది. ఒక టన్ను పచ్చిరొట్టె ఎరువులో సుమారు 4 నుంచి 5 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరం ఉంటాయి.

5. పెసర:

పెసర పంటను తొలకరి వర్షాల్లో చల్లుకొని, కాయలు కోసిన తర్వాత మిగిలిన రొట్టెను భూమిలో కలియదున్నుకోవచ్చు. అవకాశం లేనప్పుడు, కాయలు కోయకుండానే పచ్చిరొట్టె ఎరువుగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది పశువుల గ్రాసంగా కూడా ఉపయోగపడుతుంది. ఎకరాకు 8 కిలోల విత్తనం సరిపోతుంది. ఈ పెసర పంటను భూమిలో కలియదున్నడం ద్వారా ఎకరానికి 3 టన్నుల పచ్చిరొట్టె ఎరువు లభిస్తుంది. ఒక టన్ను పచ్చిరొట్టె ఎరువులో సుమారు 5 కిలోల నత్రజని ఉంటుంది. ఈ పచ్చిరొట్టె పంటలను సాగు చేయడం ద్వారా రైతులు తమ నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడమే కాకుండా, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, పర్యావరణానికి మేలు చేయవచ్చు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us