
విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెద్దకాథ గ్రామంలో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్న ప్రజలకు చివరి ప్రయాణంలోనూ కష్టాలు తప్పడం లేదు. దత్తిరాజేరు మండలం పెద్దకాథ గ్రామంలో స్మశానవాటికకు సరైన రహదారి సౌకర్యం లేదు. గ్రామానికి, స్మశానవాటికకు మధ్య ఏడుంపుల గెడ్డ అనే వాగు అడ్డంగా ప్రవహిస్తోంది. మామూలు రోజుల్లో ఎండిపోయి ఉండే ఈ వాగు, వర్షాకాలంలో మాత్రం ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో గ్రామంలో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలు నిర్వహించడానికి మృతదేహాలను ఈ వాగు గుండా మోసుకెళ్లడం గ్రామస్థులకు నిత్య ప్రహసనంగా మారింది.
గత రెండు రోజులుగా ఈ ప్రాంతంలో వరుసగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావంతో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఈ చలిని తట్టుకోలేక గ్రామానికి చెందిన సామిరెడ్డి పరదేశమ్మ (65), నింగిరెడ్డి లక్ష్మునాయుడు (63) అనే ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. ఒకే గ్రామంలో ఒకే రోజు ఇద్దరు వ్యక్తులు చనిపోవడంతో ఊరిలో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి.
వర్షాల వల్ల ఏడుంపుల గెడ్డ వాగు నిండుగా ప్రవహిస్తోంది. వేరే మార్గం లేకపోవడంతో గ్రామస్థులు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని, ఉధృతంగా పారుతున్న వాగు దాటుతూ ఇద్దరి మృతదేహాలను స్మశానవాటికకు తరలించారు. ఈ దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరి హృదయాలు ద్రవించిపోయాయి. బతికినంత కాలం సౌకర్యాలు లేక నరకం చూశామని, కనీసం చనిపోయిన తర్వాతైనా మనశ్శాంతిగా సాగనంపేందుకు సరైన దారి లేకపోవడం దారుణమని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఏళ్లుగా ఈ సమస్య ఎదుర్కొంటున్నా అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, పెద్దకాథ గ్రామంలో స్మశానవాటికకు సరిపడా రహదారి మరియు వాగుపై బ్రిడ్జ్ నిర్మించి తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..