అప్పులు తీర్చాల్సిన అవసరం ఉండదని కన్నతల్లినే చంపేశాడు.. ఏలూరులో దారుణం!

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు శాంతినగర్‌లో 53 ఏళ్ల కొమ్ము సత్యవతి హత్యకు గురయ్యారు. తల్లి పేరుతో రుణాలు తీసుకుని, వాటి వాయిదాలు చెల్లించలేకపోవడంతో కుమారుడు సురేష్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. కుమార్తె ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన త్రీ టౌన్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

అప్పులు తీర్చాల్సిన అవసరం ఉండదని కన్నతల్లినే చంపేశాడు.. ఏలూరులో దారుణం!
Mother Murder Case

Edited By:

Updated on: Oct 27, 2026 | 11:13 AM

ఏలూరు: అప్పులు వదిలించుకునేందుకు కన్నతల్లినే కడతేర్చిన ఉన్మాద ఘటన ఏలూరులో సంచలనం సృష్టించింది. తల్లి పేరుతో రుణాలు తీసుకుని, ఆమె చనిపోతే ఆ అప్పులు తీరిపోతాయని భావించిన కసాయి కొడుకు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని శాంతినగర్ 14వ రోడ్డులో కొమ్ము సత్యవతి (53) అనే మహిళ ఒంటరిగా నివాసం ఉంటున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రెండవ కుమారుడైన సురేష్ ఏలూరు శ్రీరామ్‌నగర్ రెండో రోడ్డులో ఇద్దరు పిల్లల మహిళతో సహజీవనం చేస్తూ, శాంతినగర్ 14వ రోడ్డులో బజ్జీల బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. అయితే తన తల్లి సత్యవతి హోటళ్లలో కష్టపడి సంపాదించిన సొమ్మంతా తన కుమార్తెకు, మనుమరాలికి ఇస్తోందన్న నెపంతో సురేష్ ఆమెపై తీవ్రమైన కక్ష పెంచుకున్నాడు.

ఈ కక్షతో పాటు ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో సురేష్ ఒక వికృతమైన ప్లాన్ వేసుకున్నాడు. తల్లి పేరు మీద వివిధ ఫైనాన్స్ కంపెనీల ద్వారా పలు ఖరీదైన ఫోన్‌లను కొనుగోలు చేసి, వాటిని వెంటనే తక్కువ ధరకు విక్రయించేవాడు. అంతేకాకుండా ఆమె పేరిట పలు వ్యక్తిగత రుణాలు కూడా భారీగా తీసుకున్నాడు. అలా తీసుకున్న అప్పులకు వాయిదాలు చెల్లించలేక సతమతమవుతున్న అతనికి ఒక దుర్బుద్ధి పుట్టింది. ఒకవేళ తల్లి కనుక మరణిస్తే, ఆమె పేరిట ఉన్న ఆ రుణాలు అన్నీ రద్దయిపోతాయని, తాను ఎవరికీ బాకీ ఉండాల్సిన అవసరం ఉండదని ఒక భయానకమైన ఆలోచనకు వచ్చాడు.

పథకం ప్రకారం ఈ నెల 24న మధ్యాహ్నం తల్లి వద్దకు వెళ్లిన సురేష్ ఆమెతో గొడవకు దిగాడు. క్షణికావేశంలోనూ, దురాశతోనూ అకస్మాత్తుగా ఆమె మెడనొక్కి, నోట్లో గుడ్డలు కుక్కి కిరాతకంగా హతమార్చాడు. అంతటితో ఆగకుండా, తన వేలిముద్రలు మృతదేహంపై ఎక్కడైనా ఉండిపోతాయేమోనన్న అనుమానంతో మృతదేహంపై పౌడర్ చల్లి అక్కడి నుంచి పరారయ్యాడు. మృతురాలి కుమార్తె షేక్ నజీనా (నాగలక్ష్మి) ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ సీఐ వి.కోటేశ్వరరావు వెంటనే స్పందించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సురేష్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, తానే స్వయంగా ఈ హత్య చేసినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. అప్పులు వదిలించుకోవడానికి కన్నతల్లినే కడతేర్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా అందరినీ కలచివేసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us