AP News: అల్లదిగో లచ్చిందేవి.. తొలకరి జల్లుల్లో వజ్రాల వేట.. దొరికినోడికి దొరికినంత

తొలకరి జల్లులు పడగానే.. చద్ది మూట కట్టుకుని రెడీ అవుతారు. కొండలు గుట్టలను జల్లెడ పడతారు. వర్షం పడితే తమ అదృష్టం పరీక్షించుకునేందుకు బయలుదేరతారు. యస్‌..స్వయం ఉపాధి జాబితాలో ఇప్పుడు వజ్రాల వేట కూడా చేరింది. రాయలసీమలో మొదలైన వజ్రాల వేట..

AP News: అల్లదిగో లచ్చిందేవి.. తొలకరి జల్లుల్లో వజ్రాల వేట.. దొరికినోడికి దొరికినంత
Diamond (Representative image)
Follow us

|

Updated on: Jul 01, 2024 | 6:45 PM

తొలకరి జల్లులు పడగానే.. చద్ది మూట కట్టుకుని రెడీ అవుతారు. కొండలు గుట్టలను జల్లెడ పడతారు. వర్షం పడితే తమ అదృష్టం పరీక్షించుకునేందుకు బయలుదేరతారు. యస్‌..స్వయం ఉపాధి జాబితాలో ఇప్పుడు వజ్రాల వేట కూడా చేరింది. రాయలసీమలో మొదలైన వజ్రాల వేట.. కోస్తా ఆంధ్రాను కూడా పలకరిస్తోంది. నైరుతి మబ్బులు రాష్ట్రమంతటా విస్తరించినట్లు…వజ్రాల వేట జ్వరం కూడా అన్ని ప్రాంతాలకు వైరల్‌ ఫీవర్‌లా వ్యాపిస్తోంది. కోహినూర్‌ వజ్రం దొరక్కపోయినా, చిన్నదో పెద్దదో విలువైన రాయి దొరికితే, లైఫ్‌ సెటిల్‌ అయిపోతుందనుకుంటున్నారు. అలాంటివాళ్లకు ఇప్పుడు కోహినూర్‌ పుట్టినిల్లు అయిన ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొత్త డెస్టినేషన్‌ దొరికింది. నాలుగు రాళ్లు వెనకేసుకోవడానికి పలుగు పార పట్టుకుని బయలుదేరారు. టైమ్‌ బాగుంటే నాలుగు వజ్రాలు వెనకేసుకుందాం రా అంటున్నారు. శ్రీరాంపురం కొండపై తిరునాళ్లను తలపిస్తోందీ వజ్రాల వేట.

అదేమీ కృష్ణా తీర ప్రాంతమేమీ కాదు. కోహినూర్ వజ్రం దొరికిన చోటు అంతకంటే కాదు. అయినా ఆ కొండను స్థానికులతో పాటు దూర ప్రాంతాలకు చెందినవాళ్లు జల్లెడ పడుతున్నారు. అది పల్నాడు జిల్లా నకరికల్లు మండలం శ్రీరాంపురం కొండ. పొద్దున్నే క్యారేజ్ లో అన్నం తీసుకొని మరీ మహిళలు ఆ కొండ ఎక్కుతున్నారు. ఉదయాన్నే ప్రారంభమయ్యే వజ్రాల వేట సూర్యుడు అస్తమించే వరకూ కొనసాగుతోంది. ఇక్కడ కొండల్లో వజ్రాలు దొరుకుతున్నాయన్న వార్తలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. దీంతో స్థానికులు అనేక మంది ఆటోలు, బైకుల్లో వచ్చి కొండపై వెదుకులాట ప్రారంభిస్తున్నారు. కొంతమందికి వజ్రాలు దొరికాయన్న పుకార్లు షికారు చేస్తుండడంతో ఈ కొండకు వస్తున్న వారి సంఖ్య పెరిగిపోయింది. గంటల కొద్దీ తవ్వకాలు జరిపి రాళ్లను ఏరుకుంటున్నారు. వాటిల్లో వజ్రాలు ఏమైనా ఉంటాయేమో అనే ఆశతో వేట సాగిస్తున్నారు. ఈ వజ్రాల వేటకు పురుషుల కంటే మహిళలు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ మండలం కోళ్లూరులో కోహినూర్ వజ్రం దొరికిందని చరిత్ర చెబుతోంది. నిజాం నవాబు కోహినూర్ వజ్రాన్ని చూసి కోయి నహీ నూర్ అన్నాడని అదే కోహినూర్ గా మారిందని చరిత్రకారులు పుస్తకాల్లో రాశారు. అయితే ప్రస్తుతం ఆ ప్రాంతమంతా పులిచింతల ముంపులో మునిగిపోయింది. కోళ్లూరు తర్వాత అచ్చంపేట మండలం పుట్లగూడెంకు ఎక్కువ మంది వజ్రాల వేట కోసం వెళతారు. ఇక క్రిష్ణా జిల్లాలోని తీర ప్రాంతాల్లోనూ వేట సాగిస్తుంటారు.

గత సీజన్‌లో మాత్రం ఇవేమీ కాకుండా శ్రీరాంపురం దగ్గర ఉన్న కొండ పైకి వజ్రాల వేట కోసం కొందరు వచ్చారు. దానికి కొనసాగింపుగా ఈ ఏడాది కూడా ఈ కొండ మీద సంఖ్యలో వజ్రాల వేట కొనసాగిస్తున్నారు. వజ్రాలతో పాటు రంగురాళ్లు కూడా దొరుకుతున్నాయన్న ప్రచారంతో ఇక్కడికి వచ్చే వారి సంఖ్య పెరిగిపోతోంది. తొలకరి జల్లులతో ప్రారంభమయ్యే ఈ వేట మరో పది పదిహేను రోజుల పాటు కొనసాగనుంది.