
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతూ తీవ్ర తుఫాన్‌గా మారే దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అక్టోబర్ 28న బాపట్ల-విశాఖపట్నం మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశముండటంతో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
వేగంగా మారుతున్న పరిస్థితులు
అక్టోబర్ 25, 2026 ఉదయం 8:30 గంటల సమయానికి తూర్పు మధ్య, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది అండమాన్ దీవుల్లోని శ్రీ విజయపురానికి ఉత్తర వాయవ్యంగా 440 కిలోమీటర్లు, విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా సుమారు 880 కిలోమీటర్లు, కాకినాడకు 980 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1,080 కిలోమీటర్లు, బాపట్లకు 1,150 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
ప్రస్తుతం వాయుగుండం దిశ, తీవ్రతలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. అక్టోబర్ 26 ఉదయానికి ఇది తుఫాన్‌గా, 27వ తేదీ ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా బలపడవచ్చని అంచనా. అనంతరం మరింత తీవ్రరూపం దాల్చి వెరీ సివియర్ సైక్లోనిక్ స్టార్మ్‌గా మారే అవకాశముంది. తుఫాన్‌గా బలపడిన తర్వాత దీనికి ‘అర్నాబ్’ అనే పేరు పెట్టిన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
గంటకు 125 కి.మీ. వేగంతో గాలులు
అక్టోబర్ 28 ఉదయానికి తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉంది. అదే రోజు మధ్యాహ్నం బాపట్ల, విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్-యానాం తీరాలను దాటే సూచనలు ఉన్నాయి. తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, గరిష్ఠంగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని అంచనా వేస్తున్నారు.
ఈ తుఫాన్ ప్రభావంతో అక్టోబర్ 27 నుంచి మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరప్రాంతాల్లో బలమైన గాలులు, సముద్రం అల్లకల్లోలంగా మారే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే విషయంలో అధికారుల సూచనలు పాటించాలి.
తెలంగాణలోనూ వర్ష సూచన
తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోనూ వాతావరణంలో మార్పులు కనిపించే అవకాశం ఉంది. అక్టోబర్ 25, 26 తేదీల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురవవచ్చు. అక్టోబర్ 27న కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు వాతావరణ శాఖ తాజా బులెటిన్లను గమనిస్తూ, అధికారుల సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకోవాలి. తుఫాన్ దిశ, తీవ్రత, తీరం దాటే ప్రాంతంలో మార్పులు ఉండే అవకాశం ఉన్నందున తాజా అధికారిక హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..