ఏపీ తీరంవైపు దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాన్ మరింత బలపడుతోంది. గురువారానికి అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. శుక్రవారం నెల్లూరు, తుని మధ్య తీరం దాటే సూచనలున్నాయి. ఏపీ తీరప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోనూ వర్షాలు పడే సూచనలున్నాయి.

ఏపీ తీరంవైపు దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!
Cyclone Aquan Latest Update

Updated on: Nov 17, 2026 | 11:38 AM

ఆంధ్రా తీరంవైపు అక్వాన్‌ తుఫాన్ దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో తుఫాన్ మరికొన్ని గంటల్లో తీవ్ర తుఫాన్‌గా మారనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం సోమవారం తుఫానుగా బలపడిందని.. ఇది గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫానుగా మారిన తర్వాత.. ఇరాన్ సూచించిన పేరు అక్వాన్ గా నామకరణం చేశారు. ఇది మంగళవారం సాయంత్రానికల్లా తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇది చెన్నైకి 610 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 660 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి 670 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 790 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతున్నందున గురువారం ఉదయానికి ఇది అతి తీవ్రమైన తుఫానుగా బలపడే అవకాశం ఉంది. శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు, తుని మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

తుఫాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 120-130 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు, గరిష్టంగా గంటకు 145 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తుఫాను కారణంగా ఇవాల్టి నుంచి ఏపీలోని తీరప్రాంతాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం, శుక్రవారాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

సీఎం చంద్రబాబు సమీక్ష..

తుఫాన్‌ ఎఫెక్ట్‌పై సచివాలయంలోని RTGSలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజల్ని అప్రమత్తం చేయాలని సూచించారు. కేంద్ర బృందం చేసిన సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకుని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు.

అత్యవసర సహాయం కోసం..

తుఫాను సంబంధిత సమస్యల పరిష్కారం కోసం, ‘మన మిత్ర’ వాట్సాప్ నంబర్ 9552300009కు సమాచారం అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. అత్యవసర సహాయం కోసం, 112, 1070, 18004250101 నంబర్లను సంప్రదించాలని సూచించింది. తీరప్రాంత నివాసితులు అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలు, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఎండీ, ఆర్‌టిజిఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ ప్రకటించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us