AP News: ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి..

|

Feb 23, 2024 | 11:01 PM

కమ్యూనిస్టులు ఫుల్ క్లారిటీతో ఉన్నారా.. ఈ డౌట్ ఎందుకొచ్చిందంటే.. కాంగ్రెస్ తో కలిసి ముందుకు వెళ్లాలని కమ్యూనిస్టులకు ఇప్పుడే అనిపించింది. అలా ఎందుకు అనిపించిందా అని అందరిలో ఇదే సందేహం నెలకొంది. దీనికి కారణం బీజేపీతో టీడీపీ-జనసేన పొత్తుకు వెళ్తుండటమేనా.. అందుకే ఇప్పుడు కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో చేతులు కలిపారా.. కాంగ్రెస్‌తో కలవడానికి ఇదే కారణం అయితే గనక.. వినడానికి చాలా బాగోదు. 2019లో ఓడిపోయినప్పటి నుంచి బీజేపీతో స్నేహం కోసమే ప్రయత్నించింది టీడీపీ. ఏనాడు, ఏ విషయంలోనూ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించింది లేదు.

AP News: ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి..
Ap Congress
Follow us on

కమ్యూనిస్టులు ఫుల్ క్లారిటీతో ఉన్నారా.. ఈ డౌట్ ఎందుకొచ్చిందంటే.. కాంగ్రెస్ తో కలిసి ముందుకు వెళ్లాలని కమ్యూనిస్టులకు ఇప్పుడే అనిపించింది. అలా ఎందుకు అనిపించిందా అని అందరిలో ఇదే సందేహం నెలకొంది. దీనికి కారణం బీజేపీతో టీడీపీ-జనసేన పొత్తుకు వెళ్తుండటమేనా.. అందుకే ఇప్పుడు కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో చేతులు కలిపారా.. కాంగ్రెస్‌తో కలవడానికి ఇదే కారణం అయితే గనక.. వినడానికి చాలా బాగోదు. 2019లో ఓడిపోయినప్పటి నుంచి బీజేపీతో స్నేహం కోసమే ప్రయత్నించింది టీడీపీ. ఏనాడు, ఏ విషయంలోనూ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించింది లేదు. బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్న విషయం చాలా క్లియర్‌గా కనిపిస్తూనే ఉంది. అయినా సరే టీడీపీతోనే వెళ్లారు. ఇక జనసేన.. ఏకంగా ఎన్డీయేలో భాగస్వామి. పవన్‌ కల్యాణ్ మూడు ఆప్షన్లు ఇచ్చారు. అందులో బీజేపీని కలుపుతూనే వెళ్లారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో మీటింగ్‌కు పవన్‌ కల్యాణ్‌ అటెండ్‌ అయి.. ఫొటో కూడా దిగారు. అయినా సరే.. నిన్నటి వరకు ఈ రెండు పార్టీలతో కలిసే ప్రయాణించారు కమ్యూనిస్టులు. ఏదో సడెన్‌గా బీజేపీ లైన్‌లోకి వచ్చిందని, తమ జట్టును విడదీసింది అనుకుంటే పొరపాటే. బీజేపీ కూడా తమతో కలిసి రావాలని బహిరంగంగా చెబుతున్నా సరే.. టీడీపీ-జనసేనతో కలిసి పోరాటం చేసిన కమ్యూనిస్టులకు ఇప్పుడే ఎందుకని కాంగ్రెస్‌ గుర్తొచ్చింది. ఓటు బ్యాంక్‌ లేదేమో గానీ ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ ఉంది. ఎప్పటి నుంచో జనంలోనే ఉంది. ఓవైపు దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి పెట్టి కాంగ్రెస్‌తో కమ్యూనిస్టులు కలిసి వెళ్తుంటే.. ఏపీలో మాత్రం అలా వెళ్లిన దాఖలాలు కనిపించలేదు. ఏపీ పీసీసీ చీఫ్‌తో ఏనాడు భేటీ అవలేదు. మరి సడెన్‌గా కమ్యూనిస్టులకు కాంగ్రెస్‌ ఎందుకు గుర్తొచ్చినట్టు.? వైఎస్ షర్మిల కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ అయినందుకా? షర్మిల కాంగ్రెస్‌లోకి వచ్చిన తరువాత ఏపీలో పార్టీకి ఊపు వచ్చినందుకా? ఒకవేళ ఇదే కారణం అయితే గనక.. వినడానికి ఇది కూడా చాలా బాగోలేదు.

ఇక్కడ టీడీపీ-జనసేనను కూడా తప్పుపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచిందంటే కారణం కచ్చితంగా కమ్యూనిస్టుల మద్దతేనని పొలిటికల్‌ అనలిస్టులు చెబుతుంటారు. 151 మంది ఎమ్మెల్యేలతో ఫుల్‌ సాలిడ్‌గా కనిపిస్తున్న వైసీపీని ఎలా ఫేస్ చేయాలా అనుకుంటున్న సమయంలో.. టీడీపీకి ఊపిరినిచ్చింది అమరావతి ఉద్యమం. ఆ ఉద్యమంలో టీడీపీతో పాటు కలిసి నడిచింది ఎర్రజెండాలే. అదొక్కటే కాదు.. జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై టీడీపీతో కలిసి పోరాడింది లెఫ్ట్ పార్టీలే. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న టీడీపీ-జనసేనతో కలిసి నడిచిందీ కమ్యూనిస్టులే. ఏపీలో ఉపాధ్యాయులు పిలుపునిచ్చిన ఛలో విజయవాడ అనూహ్యంగా సక్సెస్‌ అయిందంటే కారణం కూడా లెఫ్ట్‌ అనుబంధ సంఘాల వల్లే. కమ్యూనిస్టులు లేకుండా టీడీపీ పోరాడలేదని కాదు గానీ.. 23 మంది మాత్రమే గెలిచి కొంత నైరాశ్యంలో ఉన్న పార్టీకి ఏ ఒక్కరు కలిసొచ్చినా అది ఏనుగంత బలంతో సమానం. అలాంటి బలాన్నే ఇచ్చారు కమ్యూనిస్టులు. అంతెందుకు.. చంద్రబాబును అరెస్ట్‌ చేసి, రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు, అది అక్రమ అరెస్ట్‌ అంటూ టీడీపీతో కలిసి పోరాటం కూడా చేశారు. ఆనాడు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ టీడీపీకి ఎంత సపోర్ట్‌ ఇచ్చారో.. కమ్యూనిస్టులు కూడా అంతే సపోర్ట్‌ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమైనప్పుడు.. ఆయనకు అండగా నిలిచింది కమ్యూనిస్టు పార్టీలే. పొత్తులో భాగంగా కలిసి వెళ్లారు కూడా. ఆ తరువాత కమ్యూనిస్టులు, జనసేన విడిపోయినప్పటికీ.. ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత ఘటనలో పవన్ కల్యాణ్‌ను సీపీఎం నేత మధు కలిశారు. పార్టీ పరంగా మద్దతు ప్రకటించారు. అలాంటిది, బీజేపీతో పొత్తుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ నిన్నటి వరకు అండగా ఉన్న కమ్యూనిస్టులను వదులుకున్నారు.

ఏపీలో కాంగ్రెస్‌, బీజేపీకి బలమే లేదు. టీడీపీ-జనసే.. బీజేపీ వెంట పడడానికి కమలదళానికున్న ఓటు బ్యాంక్‌ కారణమే కాదు. ఎట్‌ ద సేమ్‌ టైమ్.. కమ్యూనిస్టులకు తక్కువ ఓటు బ్యాంక్ ఉంది కదా అని వదిలేయలేదు. గత ఎన్నికల్లో బీజేపీకి 0.84 శాతం ఓట్లు వస్తే.. సీపీఐకి 0.11 శాతం, సీపీఎంకు 0.32 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. అందులోనూ, జనసేనతో పొత్తు ఉన్నా సరే.. కమ్యూనిస్ట్ పార్టీలు సాధించిన ఓటు షేర్‌ అరశాతం కూడా లేదు. ఇక కాంగ్రెస్‌ పార్టీకి కేవలం 1.17 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. మొత్తానికి ఎవరి అవసరాలరీత్యా వాళ్లు పొత్తులకు వెళ్తున్నారనేది సుస్పష్టం. ఇక్కడ రాజకీయ విలువల గురించి మాట్లాడుకోవడం అనవసరం. కాకపోతే, కాంగ్రెస్‌తో కలిసి నడిచినంత మాత్రాన కమ్యూనిస్ట్‌ పార్టీలకు టికెట్లు ఇస్తారా? కచ్చితంగా డౌటే. ఎందుకంటే, వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లు, 25 ఎంపీ సీట్లలో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు పీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిల. బహుశా మున్ముందు జరిగే చర్చల్లో సీట్ల పంపకాలు ఉంటాయేమో చూడాలి. విడిగా పోటీ చేస్తే కాంగ్రెస్‌కు గానీ, కమ్యూనిస్ట్ పార్టీలకు గానీ సొంతంగా సీట్లు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే, కలిసి పోటీ చేస్తేనైనా.. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ ఓటు బ్యాంకుల్ని ఐక్యం చేసి పరస్పర ఓట్లు బదిలీ చేసుకోవచ్చని నమ్ముతున్నారు వైఎస్ షర్మిల. ఈ నేపథ్యంలోనే సీపీఐ, సీపీఎంతో చర్చలు జరిపారు. ఈ భేటీలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలతో పొత్తు ఖరారైంది. కూటమిగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. సీట్ల పంకాలపై ఈ నెల 26న అనంతపురం సభ తరువాత సమావేశాలు నిర్వహించనున్నాయి కూడా. ఈ కూటమిలో సీబీఐ మాజీ జేడీ పార్టీ కలుస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..