చంద్రబాబు, రేవంత్ రెడ్డి కుట్రలో తన సోదరి వైఎస్ షర్మిల భాగస్వామ్యం అయ్యారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సోదరి వైఎస్ షర్మిలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై అక్రమ కేసులు పెట్టిన వాళ్ళలో చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ అందని.. అదే పార్టీలో వైఎస్ షర్మిల చేరడం, పోటీ చేయడం తనకు బాధ కలిగించదన్నారు. షర్మిల పోటీ చేసినా డిపాజిట్లు కూడా దక్కవని షర్మిల ఎలాగు ఓడిపోతుందన్నారు. కాంగ్రెస్‌లో ఉన్న తన సోదరి వైఎస్ షర్మిలను చంద్రబాబు, రేవంత్ రెడ్డి వెనకుండి నడిపిస్తున్నారని.. వైఎస్ షర్మిల వెళ్తున్న దారి సరైనది కాదన్నారు. తనపై అక్రమ కేసులు పెట్టి వేధించి, తన తండ్రి వైఎస్ఆర్ పేరును ఛార్జ్ షీట్లో చేర్చిన కాంగ్రెస్ పార్టీతో కలిసి వైఎస్ షర్మిల కలిసి నడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన చెల్లిని కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ దాని వెనుక ఉన్నది చంద్రబాబు అన్నారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ అనే రిమోట్‌ను చంద్రబాబు తన చేతుల్లో పెట్టుకొని ఎపిలో నడిపిస్తున్నారన్నారు. తన సోదరి షర్మిలను అడ్డం పెట్టుకొని చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల ఏపిలో వైఎస్ షర్మిల తన ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్‌పై కీలక ఆరోపణలు చేస్తున్నారు. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పరిపాలన అంశాలపై కాకుండా ఎక్కువగా వ్యక్తిగతంగా సీఎం జగన్‌ని టార్గెట్ చేస్తున్నారు. అయినప్పటికీ షర్మిల వ్యాఖ్యలపై గత కొంత కాలంగా మౌనంగా ఉన్న సిఎం జగన్ పులివెందుల సభలో పరోక్షంగా షర్మిలపై వ్యాఖ్యలు చేశారు. పులివెందుల వేదికగా నామినేషన్ వేసే ముందు బహిరంగ సభలో కేవలం తన బాబాయ్ వివేకా హత్యపై మాత్రమే మాట్లాడినప్పటికీ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్నికల వేళ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కారేపుతున్నాయి. అనూహ్యగా వైఎస్ షర్మిలపై చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో చర్చకు కారణం అయ్యాయి. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు షర్మిలను వెనకుండి నడిపిస్తూన్నారని వైసిపి నేతలు ఆరోపిస్తున్న వేళ.. తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి నేరుగా ఆరోపణలు చేయడంతో ఇప్పుడు కొత్త చర్చ తెరపైకి వచ్చింది. తన సోదరిని చంద్రబాబు, సీఎం రేవంత్ నడిపిస్తున్నారని కుట్రలో భాగంగానే అందరూ కలిసి ఇదంతా చేస్తున్నారని జగన్ అన్నారు. ఎన్నికలకు ముందు తనను ఓడించడానికి అందరూ ఏకమయ్యారని అందరి లక్ష్యం తనను ఓడించడమేనని.. ఎవ్వరూ ఏకమైనా ప్రజలు అన్ని అంశాలను గమనిస్తున్నారన్నారు. మొత్తానికి వైఎస్ జగన్ షర్మిలపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. మరిప్పుడు అన్న జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై షర్మిల ఎలా రెస్పాండ్ అవుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..