Andhra Pradesh: ఏపీలో ఫించన్‌ లబ్ధిదారులకు డబుల్‌ ధమాకా

ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త చరిత్రను లిఖించబోతున్నది. దేశ చరిత్రలోనే తొలిసారి ఏ ముఖ్యమంత్రి చేయని పనిని చంద్రబాబు చేయబోతున్నారు. ఇందుకోసం గ్రామ సచివాలయ సిబ్బందిని పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నారు. దీనికి ముహూర్తం కూడా ఖరారైంది. వేదిక నిర్ణయమైంది. ఇంతకీ చంద్రబాబు ఏం చేయబోతున్నారో తెలుసా..?

Andhra Pradesh: ఏపీలో ఫించన్‌ లబ్ధిదారులకు డబుల్‌ ధమాకా
CM Chandrababu
Follow us

|

Updated on: Jun 29, 2024 | 6:42 PM

ఈ నిబద్ధతతే చంద్రబాబును విజయతీరాలకు నడిపించింది అంటున్నారు ఏపీ జనాలు. ఎన్నికల ప్రచారంలో ఫించన్లను 3వేల నుంచి 4వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. చెప్పిన విధంగానే ప్రభుత్వంలోకి రాగానే తొలి సంతకం పెంచిన ఫించన్లపై పెట్టారు. ఇకపై నెలనెల ఫించన్లు అందుకునే వారికి ఒక వెయ్యి అదనంగా వస్తుంది. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు ఫించన్‌ దారులకు బహిరంగ లేఖ రాశారు. మీకు అండగా నిలుస్తూ.. సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటైందని అందులో పేర్కొన్నారు. జూలై 1 నుంచే పెంచిన ఫించన్లను ఇంటివద్దే అందిస్తామని, ఆర్థిక సమస్యలున్నా.. ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. దేశంలో ఇప్పటి వరకూ ఏ సీఎం చేయని విధంగా చంద్రబాబు నాయుడు జూలై 1న స్వయంగా లబ్దిదారుల ఇంటికి వెళ్లి ఫించన్‌ ఇవ్వబోతున్నారు. ఈ చారిత్రక ఘట్టానికి తాడేపల్లిలోని పెనుమాక గ్రామం వేదిక కానున్నది.

ఏపీలో ఫించన్‌దారులకు డబుల్‌ ధమాకా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. జూలై 1న ఇంటింటికి ఫించన్‌ పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. పెరిగిన ఫించన్‌తో పాటు గత మూడు నెలలుగా ఇవ్వాల్సిన అరియర్స్‌ 3వేలు కలిపి మొత్తం 7వేల రూపాయలను ప్రతి లబ్ధిదారుకు అందించనున్నారు. గత ప్రభుత్వం లాగే కొత్త ప్రభుత్వం కూడా ఫించన్ల దారులకు ఇంటి వద్దకే వచ్చి డబ్బు ఇవ్వనున్నది. ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పథకం అమల్లో భాగంగా కూటమి ప్రభుత్వం పెంచిన సామాజిక భద్రతా పింఛన్లను జూలై 1న లబ్ధిదారుల ఇంటి వద్దే పంపిణీకి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 65,18,496 మంది ఫించనుదారులందరికీ పెంచిన ఫించన్లను ఒక్క రోజులోనే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించాలన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్పరెన్సు నిర్వహించి పింఛన్ల పంపిణీ విషయంలో అనుసరించాల్సిన విధి విధానాలను వివరించారు…

ఒక్కొక్క ఉద్యోగి 50 గృహాల్లో ఫించన్లు పంపిణీ చేసేలా క్లస్టర్ల వారీగా మ్యాపింగ్‌ చేసుకోవాలని ఆదేశించారు. సాధ్యమైనంత మేర ఒకే రోజు ఫించన్ల పంపిణీ పూర్తి చేయాలని కోరారు. అనివార్య కారణాల వల్ల ఎవరైనా లబ్దిదారులు మిగిలిపోతే మరుసటి రోజు కూడా పంపిణీ చేయాలన్నారు. ఆధార్‌, బయోమెట్రిక్‌, ఫేషియల్‌, ఐరిష్‌, ఆర్బీఐఎస్‌ ఆథంటికేషన్‌ ఆధారంగానే ఫించన్లు పంపిణీ చేయాలని, ఫించన్‌ డిస్ట్రిబ్యూషన్‌ సర్టిఫికెట్‌ను కూడా జారీ చేయాలని ఆదేశించారు. ఫించన్ల పంపిణీలో ప్రభుత్వానికి ఎలాంటి మాట రాకుండా పనిచేయాలని సూచించారు.

ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఒకటవ కేటగిరీలోని వృద్ధులు, వితంతువులు తదితర 11 ఉప కేటగిరీలకు చెందిన వారి పింఛను సొమ్మును రూ.3 వేల నుండి రూ.4 వేలకు చంద్రబాబు ప్రభుత్వం పెంచింది. జూలై 1 న రూ.4 వేలతో పాటు ఏప్రిల్‌, మే, జూన్‌ మాసాలకు సంబంధించి పెరిగి పింఛను సొమ్ము నెలకు రూ.1,000 చొప్పున మూడు మాసాల బకాయిలు కలుపుకుని మొత్తం రూ.7,000ను పంపిణీ చేయాలని ఆదేశించారు. రెండో కేటగిరీలోని పాక్షిక దివ్యాంగులకు రూ.3 వేల నుండి రూ.6 వేలకు, మూడో కేటగిరీలోని పూర్తి స్థాయి దివ్యాంగులకు రూ.5 వేల నుండి రూ.15 వేలకు మరియు నాలుగో కేటగిరీలోని కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి రూ.5 వేల నుండి 10 వేలకు పెంచిన పింఛన్‌ సొమ్ము పంపిణీ చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సిఎస్ నీరభ్‌ కుమార్ సూచించారు..

జులై ఒకటో తేదీ నుంచి ఇంటింటికి పెన్షన్లు పంపిణీ కార్యక్రమం నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు.. ఇంటికే వచ్చి పెన్షన్ సొమ్ము అందిస్తామని చెప్తున్నారు.. గ్రామ సచివాలయాలకు , బ్యాంకుల వద్దకు ఎవ్వరు వెళ్ళవద్దని పెన్షనర్లకు అధికారులు, సచివాలయం సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు.. పెన్షనర్లు సచివాలయాలకు రావద్దని, ఒకటవ, రెండవ తారీఖుల్లో పింఛన్ దారులు ఇంటి వద్దనే ఉండాలని సచివాలయాల ముందు సిబ్బంది పోస్టర్లు ఏర్పాటు చేశారు. కొత్త ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నా.. ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమానికి చంద్రబాబు పెద్ద పీట వేస్తున్నారు. ఇందుకోసం ఎంత రిస్క్‌ అయినా భరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సీఎం చంద్రబాబు సంకేతాలిచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..