రాత్రిళ్లు హడలెత్తిస్తున్న బ్లేడ్‌బ్యాచ్‌..!

బ్లేడ్‌బ్యాచ్‌.. ఇప్పుడు ఈ పేరు వింటేనే బెజవాడ వాసులు వణికిపోతున్నారు. రాత్రయితే చాలు.. విజయవాడలోని కొన్ని ప్రాంతాల్లో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు.

  • Balaraju Goud
  • Publish Date - 6:20 pm, Mon, 9 November 20
రాత్రిళ్లు హడలెత్తిస్తున్న బ్లేడ్‌బ్యాచ్‌..!

బ్లేడ్‌బ్యాచ్‌.. ఇప్పుడు ఈ పేరు వింటేనే బెజవాడ వాసులు వణికిపోతున్నారు. రాత్రయితే చాలు.. విజయవాడలోని కొన్ని ప్రాంతాల్లో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మత్తుకు బానిసైన కొందరు యువకులు.. సైకోలుగా మారి విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. డబ్బులు ఇవ్వనివారిని గాయపరుస్తున్నారు. అంతలోనే అక్కడి నుంచి జారుకుంటున్నారు. నిత్యం వెలుగుచేస్తున్న కేసులతో బెజవాడ పోలీసులకు ఇప్పుడు సవాల్ గా మారింది.

దాడులకు పాల్పడుతున్న బ్లేడ్‌బ్యాచ్‌తో ఎక్కువగా యువకులు, మైనర్లే అధికంగా ఉన్నట్లు సమాచారం. పుస్తకాలు పట్టాల్సిన వయసులో వ్యసనాలకు బానిసయ్యారు. పెన్నులు పట్టుకోవాల్సిన చేత్తో బ్లేడ్లు, కత్తులు పట్టుకుంటున్నారు. అవసరాలకు డబ్బులు లేక.. కనిపించిన వారిపై దాడులకు తెగబడుతూ నేర ప్రవృత్తికి పాల్పడుతున్నారు. మత్తులో విచక్షణ కోల్పోయి వింతగా ప్రవరిస్తున్నారు. దాడుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుండటం విజయవాడ పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. అడపాదడపా పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నప్పటికీ బ్లేడ్‌బ్యాచ్‌ రెచ్చిపోతూనే ఉంది.

ప్రధానంగా కుటుంబ పరిస్థితుల కారణంగానే యువకులు పెడదారి పడుతున్నారు. ఎక్కువగా 15 ఏళ్ల నుంచి 25 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. తల్లిదండ్రులు విడిపోవడం, వారి మధ్య సఖ్యత లేకపోవడంతో ఇటువైపు త్వరగా ఆకర్షితులవుతున్నారు. తల్లిదండ్రులు లేక అనాథలుగా తిరుగుతున్న వారే ఎక్కువగా ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. దీంతో పాటు చదువుకు దూరంకావడం, బాల్యం నుంచే చెడు సహవాసాలకు గురవుతుండడమూ కారణమే. పరిసర ప్రాంతాల్లోని పరిస్థితులు వీరిని పెడదారినపట్టిస్తున్నాయి. వ్యసనాలకు బానిసై ప్రాణహానికి సైతం వెనుకాడటంలేదు. కేవలం గంజాయి, వైట్నర్‌, మద్యానికి డబ్బు కోసమే దాడి చేస్తున్నారు. తమకు అవసరమైనంత వరకు డబ్బు తీసుకుంటారు. దీని కోసం కనిపించిన వారిపై దాడులు చేస్తుంటారు. నిత్యం మత్తులో ఉండి విచక్షణ కోల్పోయి బ్లేడ్‌తో దాడులకు తెగబడుతున్నారు. గత నెలలో సింగ్‌నగర్‌లో బహిర్భూమికి వచ్చిన వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. వీరు కేవలం డబ్బుకోసమే దాడి చేసినట్లు గుర్తించారు.

బ్లేడ్‌బ్యాచ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుంటే తమకు తాము తీవ్రంగా గాయం చేసుకుంటారు. గొంతు కూడా కోసుకుంటారు. పోలీస్‌స్టేషన్‌లోని విద్యుత్తు వైర్లను కూడా తాకుతూ ఆత్మహత్యకు యత్నిస్తున్నారు. కొన్నిసార్లు వాళ్లు ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనని పోలీసులు వెనుకంజ వేస్తున్నారు. కొన్ని సందర్భాలు చూసి చూడనట్లు వ్యవహారిస్తున్నారు. మరోవైపు సమస్య పరిష్కారానికి గత ఏడాది విజయవాడ పోలీసులు దృష్టి సారించారు. సామాజిక కోణంలో పరిశీలించి వారిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. జనజీవన స్రవంతిలో కలిపేందుకు వీరితో యూత్‌ క్లబ్‌లు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. అంతవరకు బాగానే ఉంటున్నారు. పోలీసుల నుంచి చేజారిన మరుక్షణమే పెడదారినపడుతున్నారు. అయితే, బ్లేడ్‌, గంజాయి బ్యాచ్‌లపై నిరంతరం నిఘా ఏర్పాటు చేశామని విజయవాడ పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వీరిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు 40 మందిని గుర్తించి వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించామని తెలిపారు. వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు. ఇప్పటికే గతంతో పోలీస్తే పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చిందన్నారు పోలీసు కమిషనర్.

విజయవాడ నగరంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 30 మంది వరకు బ్లేడ్‌ బ్యాచ్‌ సభ్యులు ఉంటారని పోలీసులు తేల్చారు. వీరిలో 10 మంది వరకు చురుగ్గా ఉంటున్నారు. 20 మంది అడపాదడపా తమ ఉనికిని చాటుకున్నారు. నగరంలోని పెజ్జోనిపేట, లంబాడీపేట, ఎర్రకట్ట, గుణదల, కేదారేశ్వరిపేట, కృష్ణలంక, మధురానగర్‌, గాంధీనగర్‌, ఆయోధ్యనగర్‌, వాంబేకాలనీ, పాలఫ్యాక్టరీ, కొత్తపేట, పాతబస్తీ, కేఎల్‌రావు నగర్‌, పాత ప్రభుత్వాసుపత్రి, తదితర ప్రారతాలలో వీరి ఉనికి అధికంగా ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. బస్టాండు, పరిసర ప్రాంతాలు, రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న వారిని ఎక్కువగా లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు.

also read: లేడీ కానిస్టేబుల్ మృతి కేసులో కొత్త ట్విస్ట్..