Somu Veerraju on Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ ముఖ్యనేతలను కలవడంలో తప్పేమి లేదని, అనవసరంగా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీనియర్ నాయకుడని.. అమిత్ షాను కలిస్తే తప్పేంటి అంటూ పేర్కొన్నారు. అయితే, చంద్రబాబు, అమిత్ షా భేటీపై రాష్ట్ర నేతలకు సమాచారం లేదని.. ఆ భేటీలో తాను లేనని స్పష్టంచేశారు. చంద్రబాబు, బీజేపీ నేతలను కలవడం వెనుక నెగిటివ్‌గా మాట్లాడాల్సిన అవసరం లేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏమైన తెలుసుకోదలిస్తే నేరుగా చంద్రబాబుతోనే మాట్లాడటం బెటరని వీర్రాజు సూచించారు. తమది జాతీయ పార్టీ అని, తమ వాళ్లను ఎవరినైనా కలుస్తారంటూ సోము వీర్రాజు పేర్కొన్నారు.
ఒకప్పుడు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన సోము వీర్రాజు.. తాజాగా ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో, బీజేపీ నాయకుల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, టీడీపీతో పొత్తు ఉండదని గతంలో సోము వీర్రాజు, GVL నర్సింహరావు, సునీల్ దేవధర్ లాంటి కీలక నాయకులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో గత వారం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. అమిత్ షా, నడ్డాను కలిశారు. అయితే, ఎందుకు కలిశారన్నది బయటకు రాకపోయినప్పటికీ.. తెలంగాణ, ఏపీ ఎన్నికల గురించే చర్చ జరిగినట్లు ప్రచారం జరిగింది. ఓ వైపు తెలంగాణ నేతలు టీడీపీ తో పొత్తు ఉండదంటూ పేర్కొంటున్న నేపథ్యంలో.. ఏపీ నేత సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలతో రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇదిలాఉంటే.. ఏపీలో పొత్తులపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే 10 నెలల్లో ఏపీ రాజకీయాల్లో భారీ మార్పులు వస్తాయని అన్నారు. చంద్రబాబు, అమిత్ షా సమావేశం పొత్తుల గురించని కొందరు మాట్లాడుతున్నారని, కాని అది సరి కాదని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..