వైద్యరంగంలో ఏపీ సర్కార్ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఈ కాన్సెప్ట్ ఏమిటి? దాని ప్రత్యేకత ఏమిటి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోలేదంటేనే ఎంతో హైరానాపడతాం. ఇక నడవలేని స్థితిలో ఉంటే ఆ బాధ వర్ణనాతీతం. ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నా.. ఇంటికి తీసుకురావాలన్నా ఆ అవస్థేంటో పడేవారికే తెలుస్తుంది. ధనికులైతే ఏదోలా మేనేజ్ చేస్తారు. మరి మధ్యతరగతి, పేదవారి సంగతేంటి? అలాంటివారి కోసమే ఏపీ సర్కారు సరికొత్త కాన్సెప్ట్‌ను ఇంట్రడ్యూస్ చేసింది. అదే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్.
ఈ కాన్సెప్ట్ ద్వారా ఫిజియోథెరపిస్టులే ఇంటికి వచ్చి వైద్య సేవలు అందిస్తారు. ఈ కాన్సెప్ట్‌ను ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది ప్రభుత్వం. ఒక్కో గ్రామ సచివాలయం పరిధిలో ఇద్దరు వైద్యులను నియమించింది. ఓ డాక్టర్ 104 వాహనంలో ఉంటే.. మరో డాక్టర్ గ్రామంలో పర్యటిస్తారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓపీ చూస్తారు. సాయంత్రం వైద్యసేవలు పొందేందుకు రాలేనివారికి ఇంటికెళ్లి వైద్యం అందజేస్తారు.
అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 10వేల 32 గ్రామ సచివాలయాల్లో వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేసింది సర్కారు. ఇంటికే వైద్యులు వచ్చి పరీక్షలు చేస్తుండడంతో రోగుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రతి 2500 మంది జనాభాకు ఒక సీహెచ్‌వో, ఏఎన్‌ఎం, ముగ్గురు నర్సులతో ప్రత్యేక సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఏపీ వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..