అమెరికాలో మళ్ళీ అదే సీన్ ! నల్లజాతీయుడి మెడను కాలితో నొక్కిన పోలీస్

అమెరికాలో మే 25 నాటి సీన్ రిపీటయ్యింది. ఆ రోజున నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మెడను తన మోకాలితో గట్టిగా తొమ్మిది నిముషాలపాటు నొక్కి అతని మరణానికి కారకుడయ్యాడు మినియాపొలీస్ కి చెందిన  ఓ పోలీసు అధికారి. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా నిరసనలు..

  • Umakanth Rao
  • Publish Date - 11:34 am, Tue, 23 June 20
అమెరికాలో మళ్ళీ అదే సీన్ ! నల్లజాతీయుడి మెడను కాలితో నొక్కిన పోలీస్

అమెరికాలో మే 25 నాటి సీన్ రిపీటయ్యింది. ఆ రోజున నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మెడను తన మోకాలితో గట్టిగా తొమ్మిది నిముషాలపాటు నొక్కి అతని మరణానికి కారకుడయ్యాడు మినియాపొలీస్ కి చెందిన  ఓ పోలీసు అధికారి. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కాగా న్యూయార్క్ సిటీలో తిరిగి తాజాగా ఇలాంటి సంఘటనే జరిగింది. తమను దుర్భాషలాడాడంటూ ఓ నల్లజాతీయుడిని అరెస్టు చేస్తున్న సందర్భంగా నలుగురైదుగురు పోలీసులు అతని పట్ల కిరాతకులే అయ్యారు. ఒకరు అతని కడుపుపై తన బలమంతా అదిమిపట్టి కూర్చున్నంత పని చేశాడు.  మరొకడు అతని మెడపై తన మోకాలిని అదిమిపట్టి ఉంచాడు. ఇంకొకడు అతని చేతులను వెనక్కి విరిచి పట్టుకున్నాడు.  ఈ అమానుషమంతా  వీడియోకెక్కడంతో సిటీ పోలీసు కమిషనర్ డెర్మాట్ షియా తీవ్రంగా స్పందించారు. ఇందుకు ప్రధాన బాధ్యుడైన పోలీసు అధికారిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతుందన్నారు. ఆటు- పోలీసుల చర్యతో బాధితుడు స్పృహ కోల్పోగా.. అతని సహచరులు హాస్పిటల్ కి తరలించారు. తమ క్లయింటుపై హత్యాయత్నానికి పాల్పడిన పోలీసు అధికారిని ప్రాసిక్యూట్ చేసేలా కోర్టుకెక్కుతామని ఆ నల్లజాతీయుని తరఫు లాయర్ ప్రకటించారు. మరోవైపు నగర మేయర్ బిల్ డీ బ్లాసియా కూడా ఈ ఘటనను ఖండించడం విశేషం.