అమెరికాలో హిందూ ఆలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడు అరెస్ట్.. ఇంట్లో ఆయుధాలు స్వాధీనం

US Hindu Temple Attack Plot: అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలో హిందూ ప్రార్థనా మందిరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నివాసంలో రైఫిల్, మందుగుండు సామగ్రి, ఇతర టాక్టికల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఎఫ్‌బీఐతో కలిసి దర్యాప్తు కొనసాగుతోంది.

అమెరికాలో హిందూ ఆలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడు అరెస్ట్.. ఇంట్లో ఆయుధాలు స్వాధీనం
Us Hindu Temple Attack Plot

Updated on: Oct 15, 2026 | 9:29 AM

Hindu Temple in Illinois: అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలో హిందూ ప్రార్థనా మందిరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాలటైన్‌కు చెందిన అలెగ్జాండ్రోస్ పాపోరాకిస్‌ను అక్టోబర్ 11న అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద లభించిన పత్రాల్లో శ్వేతజాతి ఆధిపత్య భావజాలానికి సంబంధించిన అంశాలతో పాటు భారతీయ సంతతికి చెందిన వ్యక్తులపై హింసకు సంబంధించిన ప్రస్తావనలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటన అమెరికాలో హిందువుల ప్రధాన పండుగలైన నవరాత్రి వేడుకలు ప్రారంభమైన సమయంలో వెలుగుచూడటం ఆందోళనకు గురిచేస్తోంది. రెండు వారాల క్రితం ఓహియోలోని రిచ్‌మండ్ హైట్స్‌లో ఉన్న శ్రీ స్వామినారాయణ వడ్తాల్ ధామ్ హిందూ మందిర్ ధ్వంసానికి గురైన ఘటన కూడా చోటుచేసుకుంది.

ఎలా వెలుగులోకి వచ్చింది?

పాపోరాకిస్‌పై సామూహిక కాల్పులకు కుట్ర పన్నుతున్నాడంటూ మరో వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు ప్రారంభమైంది. నిందితుడు సామూహిక కాల్పుల ప్రణాళికకు సంబంధించిన ఓ పత్రంతో పాటు రైఫిల్, మ్యాగజైన్లు, బాడీ ఆర్మర్, ఇతర టాక్టికల్ పరికరాల చిత్రాలను తనకు పంపినట్లు సమాచారమిచ్చిన వ్యక్తి పోలీసులకు తెలిపాడు. దర్యాప్తులో భాగంగా పోలీసులు పాపోరాకిస్ అక్టోబర్ 11న ఆదివారం దాడికి పాల్పడే అవకాశం ఉందని గుర్తించారు. ముఖ్యంగా అరోరా ప్రాంతంలోని ఓ హిందూ ప్రార్థనా మందిరాన్ని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని అధికారులు భావించారు. అయితే ఏ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్నాడనే విషయం ఇంకా దర్యాప్తులోనే ఉంది.

పాపోరాకిస్ తనతో పనిచేసే వారికి ఆదివారం “ప్రత్యేకమైన రోజు” అని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అదే రోజు ఓ సహోద్యోగికి ఫోన్ చేసి తన తుపాకీ జామ్ అయిందని, అక్కడి నుంచి త్వరగా వెళ్లిపోయానని చెప్పినట్లు వెల్లడించారు.

ఇంట్లో ఆయుధాలు స్వాధీనం

పాలటైన్ పోలీసులు నిందితుడి నివాసంలో సోదాలు నిర్వహించగా ఓ రైఫిల్, లోడ్ చేసిన రైఫిల్ మ్యాగజైన్లు, వందలాది రౌండ్ల అదనపు మందుగుండు సామగ్రి, టాక్టికల్ పరికరాలు, బాడీ ఆర్మర్ ఉన్న వెస్ట్ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ వెస్ట్‌పై శ్వేతజాతి ఆధిపత్య తీవ్రవాదానికి సంబంధించిన గుర్తు ఉన్న ప్యాచ్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

పాపోరాకిస్‌పై ఉగ్రవాద బెదిరింపులకు పాల్పడినట్లు, అలాగే 16 అంగుళాల కంటే తక్కువ బ్యారెల్ ఉన్న రైఫిల్‌ను అక్రమంగా కలిగి ఉన్నట్లు రెండు అభియోగాలు నమోదయ్యాయి. కేసుపై ఎఫ్‌బీఐతో కలిసి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. అక్టోబర్ 30న తదుపరి కోర్టు విచారణ జరగనుంది.

ఈ ఘటనపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ స్పందిస్తూ, పోలీసులు వేగంగా స్పందించినందుకు అభినందించింది. హిందూ సమాజం అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద బెదిరింపులు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించింది. ప్రజలకు ప్రస్తుతం ఎలాంటి కొనసాగుతున్న ముప్పు లేదని అధికారులు తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us