అక్షరం ముక్క రాకపోయినా.. సోలార్ ఇంజినీర్లుగా 75 వేల ఇళ్లకు వెలుగులు!

చీకటి పడితే చాలు.. ఆ గ్రామాల్లో బతుకు భారంగా మారేది. పిల్లలు చదువుకోవాలంటే కిరోసిన్ దీపాలే దిక్కు. వంట చేసుకోవాలన్నా, ఇంట్లో పనులు చేసుకోవాలన్నా కొవ్వొత్తులు, లాంతర్ల పైనే ఆధారపడాల్సిన పరిస్థితి. చీకట్లో పాములు, ఎలుకలు, పురుగుల భయం మరోవైపు. కానీ ఇప్పుడు ఆ గ్రామాల్లో పరిస్థితి పూర్తిగా మారుతోంది. ఒకప్పుడు చదవడం, రాయడం కూడా తెలియని మహిళలు.. ఇప్పుడు సోలార్ విద్యుత్ ఇంజినీర్లుగా మారారు. తమ చేతులతోనే సోలార్ ప్యానెళ్లు అమర్చుతున్నారు. పాడైన లైట్లకు మరమ్మతులు చేస్తున్నారు. వందలాది కుటుంబాల ఇళ్లలో వెలుగులు నింపుతున్నారు.

అక్షరం ముక్క రాకపోయినా.. సోలార్ ఇంజినీర్లుగా 75 వేల ఇళ్లకు వెలుగులు!
These African Women Are Solar Engineers Bringing Electricity To Homes

Updated on: Nov 07, 2026 | 1:12 AM

మరి వీళ్లకు ఇంజినీరింగ్ నేర్పించింది ఎవరు? ఎక్కడ శిక్షణ పొందారు? అసలు చదువులేని మహిళలు సోలార్ టెక్నాలజీని ఎలా నేర్చుకున్నారు? ఈ అద్భుతమైన మార్పు వెనుక ఉన్నది భారతదేశానికి చెందిన ఓ సంస్థ. రాజస్థాన్‌లోని బేర్‌ఫుట్ కాలేజీ (Barefoot College) చేపట్టిన ‘సోలార్ మమాస్’ కార్యక్రమం ద్వారా ఆఫ్రికాతో పాటు పలు దేశాల గ్రామీణ మహిళలు సౌర విద్యుత్ నిపుణులుగా మారుతున్నారు.

96 దేశాలు.. 1,708 మంది మహిళలు.. 75 వేల ఇళ్లలో వెలుగులు!

బేర్‌ఫుట్ కాలేజీలో 96 దేశాలకు చెందిన 1,708 మంది గ్రామీణ మహిళలు  శిక్షణ పొందారు. వీరి కృషితో ప్రపంచవ్యాప్తంగా 75 వేలకుపైగా ఇళ్లకు సోలార్ విద్యుత్ అందింది. 4.5 కోట్ల లీటర్ల కిరోసిన్ వినియోగం తగ్గింది. బేర్ ఫుట్ కాలేజీలో మహిళల విద్యార్హతకు ప్రాధాన్యం ఇవ్వరు. చదువు రాకపోయినా, శిక్షణ పొందే అవకాశం కల్పిస్తారు. సాంకేతిక నైపుణ్యం నేర్చుకోవడానికి డిగ్రీ ఉండాల్సిన అవసరం లేదని నిరూపించారు.

పుస్తకాలు లేవు.. చేతి పనులతోనే సోలార్ విద్యుత్ పాఠాలు!

సాధారణంగా ఇంజినీరింగ్ అంటే క్లిష్టమైన పాఠాలు, లెక్కలు గుర్తుకొస్తాయి. కానీ ఈ మహిళలకు శిక్షణ ఇచ్చే విధానం భిన్నంగా ఉంటుంది. రాజస్థాన్‌లోని తిలొనియాలో ఉన్న బేర్‌ఫుట్ కాలేజీ కేంద్రంలో ఆరు నెలలు శిక్షణ ఇస్తారు. ప్రతి పనినీ స్వయంగా చేయిస్తూ నేర్పిస్తారు.

సోలార్ ప్యానెళ్లను ఎలా అమర్చాలి? విద్యుత్ సర్క్యూట్లను ఎలా అనుసంధానించాలి? బ్యాటరీలను ఎలా ఏర్పాటు చేయాలి? లైట్లు పనిచేయకపోతే ఎలా మరమ్మతు చేయాలి? ఈ విషయాలను ప్రాక్టికల్‌గా నేర్పిస్తారు. శిక్షణ పూర్తయ్యాక మహిళలు తమ గ్రామాలకు తిరిగి వెళ్తారు. అక్కడ ఇళ్లకు సోలార్ లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు, వాటి నిర్వహణ బాధ్యత కూడా తీసుకుంటారు. ఏదైనా లైట్ పాడైతే బయట నుంచి టెక్నీషియన్ వచ్చే వరకు ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. తమ గ్రామంలోనే ఆ సమస్యను పరిష్కరించగల మహిళలు అందుబాటులో ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే.. ప్రతి గ్రామంలో స్థానికంగానే సోలార్ టెక్నాలజీ నిపుణులు తయారవుతున్నారు.

భారత్‌కు వచ్చి.. 1,500 ఇళ్లకు వెలుగులు తీసుకెళ్లారు!

2011లో ‘ది గార్డియన్’ కథనం ఈ కార్యక్రమం గురించి ప్రపంచానికి తెలియజేసింది. సియెర్రా లియోన్‌కు చెందిన 12 మంది మహిళలు సోలార్ ఇంజినీరింగ్ నేర్చుకోవడానికి భారత్‌కు వచ్చారు. వీరిలో చాలామందికి చదవడం, రాయడం రాదు. కొందరు తమ గ్రామాల్లో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవించేవారు. భారత్‌లో ఆరు నెలలు శిక్షణ తీసుకున్న తర్వాత వారు స్వగ్రామాలకు తిరిగి వెళ్లారు. అక్కడ సుమారు 1,500 ఇళ్లకు సోలార్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.

ఆరు నెలల్లో శిక్షణ.. స్వగ్రామానికి వెళ్లగానే సేవలు!

టాంజానియాలోనూ ఈ కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చింది. అక్కడి మ్ట్వారా, లిండి జిల్లాల్లోని మారుమూల గ్రామాలకు చెందిన ఆరుగురు మహిళలు భారత్‌లోని బేర్‌ఫుట్ కాలేజీలో ఆరు నెలల పాటు శిక్షణ పొందారు. యూఎన్ ఉమెన్ (UN Women) మద్దతుతో చేపట్టిన ‘రూరల్ ఉమెన్ లైట్ అప్ ఆఫ్రికా’ కార్యక్రమంలో భాగంగా వీరు సోలార్ ఇంజినీర్లుగా తయారయ్యారు.

శిక్షణ పూర్తిచేసుకుని గ్రామాలకు తిరిగి వెళ్లిన తర్వాత సోలార్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసారు. ప్రతి ఇంటికి ఒక సోలార్ ప్యానెల్, బ్యాటరీ, ఛార్జర్, మూడు లైట్లు అందించారు. ఈ పరికరాల కోసం కుటుంబాలు ఐదేళ్ల పాటు విడతలవారీగా డబ్బులు చెల్లించే అవకాశం కల్పించారు. మహిళల వేతనాలు, పరికరాల నిర్వహణ ఖర్చుల కోసం గ్రామస్థులు పొదుపు విధానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. లైట్లు ఏర్పాటు చేయడమే కాకుండా.. అవి పాడైతే మరమ్మతులు చేయడం, సక్రమంగా పనిచేసేలా చూసుకోవడం కూడా ఈ మహిళల బాధ్యతగా నిర్ణయించారు.

సోలార్ ఇంజినీర్‌గా ఎదిగిన నాన్సీ కాను!

సియెర్రా లియోన్‌కు చెందిన నాన్సీ కాను ఈ కార్యక్రమం ద్వారా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బేర్‌ఫుట్ కాలేజీలో శిక్షణ పొందిన ఆమె చీఫ్ సోలార్ ఇంజినీర్‌గా ఎదిగింది. ఇతర మహిళలకు కూడా సోలార్ టెక్నాలజీలో శిక్షణ ఇస్తోంది. గ్రామాల్లో సోలార్ లైట్లు పాడైతే బాగు చేయడం, బల్బులు మార్చడం, మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్ సదుపాయం కల్పించడం వంటి పనులు చేస్తోంది. అంటే ఒకప్పుడు సాంకేతిక పరిజ్ఞానం కోసం ఇతరులపై ఆధారపడిన గ్రామాలు.. ఇప్పుడు తమ సమస్యలను తామే పరిష్కరించుకునే స్థాయికి చేరుతున్నాయి.

మహిళలే ఇంజినీర్లు.. మారుతున్న పాత ఆలోచనలు!

ఈ కార్యక్రమం ప్రాధాన్యాన్ని 2024 మేలో ‘నేచర్ ఎనర్జీ’ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన కూడా వివరించింది. జాంజిబార్‌లో సోలార్ మామాస్ కార్యక్రమంపై అధ్యయనం చేసిన పరిశోధకులు.. మహిళలకు సాంకేతిక శిక్షణ ఇవ్వడం ద్వారా ఇంజినీరింగ్, విద్యుత్ రంగాలు పురుషులకే పరిమితమనే పాత భావన మారిందని తెలిపారు.

అయితే ఈ మార్పు అంత సులభంగా జరగడం లేదనీ కొన్ని ప్రాంతాల్లో సంప్రదాయాలు, పురుషాధిక్య భావజాలం కారణంగా మహిళలు శిక్షణ తీసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పరిశోధన గుర్తించింది. అయినప్పటికీ శిక్షణ పూర్తి చేసిన మహిళలకు తమ గ్రామాల్లో కొత్త గుర్తింపు లభిస్తోంది. వారు కేవలం ఇంటి బాధ్యతలు చూసుకునే మహిళలుగా కాకుండా.. సాంకేతిక సమస్యలను పరిష్కరించే నిపుణులుగా, ఇతరులకు శిక్షణ ఇచ్చే గురువులుగా ఎదుగుతున్నారు.

ప్రస్తుతం ఆఫ్రికాలో మరిన్ని ప్రాంతాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరించేందుకు బేర్‌ఫుట్ కాలేజీ ప్రయత్నిస్తోంది. సెనెగల్, బుర్కినా ఫాసో, లైబీరియా, టాంజానియా వంటి దేశాల్లో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

ఒకప్పుడు చీకట్లో బతికిన ఈ మహిళలు ఇప్పుడు వేలాది ఇళ్లకు వెలుగులు పంచుతున్నారు. చదువు లేకపోతే ఏమీ సాధించలేమనే ఆలోచనను చెరిపేస్తున్నారు. నేర్చుకోవాలనే ఆసక్తి, అవకాశం, పట్టుదల ఉంటే జీవితాన్ని మార్చుకోవచ్చని నిరూపిస్తున్నారు. నిజంగా వీరి కథలో వెలుగులు నింపింది కేవలం సౌర విద్యుత్ మాత్రమే కాదు ఆత్మవిశ్వాసం, స్వావలంబన, సాధించాలనే సంకల్పం కూడా!

Loading...
Unable to load recommendations.
Follow Us