ప్రస్తుతం యావత్ ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గుప్పిట్లో ఉందంటే అతిశయోక్తి కాదు. అన్ని రంగాల్లో ఏఐ టెక్నాలజీని వినియోగించేస్తున్నాం. అయితే ఇది భవిష్యత్తులో కోట్లాది మంది ఉద్యోగాలను తీసివేస్తుందా? అనే భయం ఎంప్లియిస్ కంటి మీద కునుకులేకుండా చేస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం దేశంలోనే అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ TV9 నిర్వహిస్తున్న న్యూస్9 గ్లోబల్ సమ్మిట్‌లో దొరికింది. నేడు జరిగిన ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: అడ్వాంటేజ్ ఇండియా?’ సెషన్‌లో ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఈ ప్రశ్న చుట్టూ అల్లుకున్న సందేహాలను నివృతి చేశారు. ఏఐ వల్ల ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున లేఆఫ్‌లు ఉండబోవని అంటే ‘మాస్ లేఆఫ్‌లు’ ఉండవని స్పష్టం చేశారు. కానీ మన నైపుణ్యాల అభివృద్ధికి ఇదెంతో ఉపయోగపడుతుందని వివరించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: అడ్వాంటేజ్ ఇండియా? ఈ సెషన్‌లో టెక్ మహీంద్రా యూరప్ ప్రెసిడెంట్ హర్షుల్ అస్నానీ, మైక్రోన్ ఇండియా MD ఆనంద్ రామమూర్తి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంత్రోపోమెట్రిక్‌లో లాంగ్వేజ్ టెక్ ఫర్ AI హెడ్ డాక్టర్ జాన్ నీహ్యూస్‌తోపాటు పలువురు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ప్రసంగించారు. ఈ సెషన్‌లో AI గురించి పలు విషయాలు చర్చించారు.
ఇంటర్నెట్ తర్వాత AI ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మార్పు అని హర్షుల్ అస్నానీ అన్నారు. ఏఐ మార్పు తీసుకువస్తుందో లేదో ఇప్పుడు తెలియాల్సిన అవసరం లేదన్నారు. బదులుగా, ఇది ఎప్పుడు జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది, దీని వల్ల ఏమి మారుతుంది? అనే దానిపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ప్రస్తుత కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని, దాని ఉపయోగం ఏమిటన్నది చెప్పారు. దానిని పరిగణనలోకి తీసుకోకపోతే జరిగే నష్టం అంచనా వేయలేం. AIపై పెట్టుబడి పెడితే, దాని రాబడి ఎలా ఉంటుందో చూస్తారు అని హర్షుల్ అస్నానీ తెలిపారు.
పారిశ్రామిక వేత్త ఆనంద్ రామ్మూర్తి.. AI పై ఖర్చు గురించి మాట్లాడారు. ఎప్పుడు ఏ టెక్నాలజీ వచ్చినా దాని మీద చాలా పెట్టుబడి పెట్టవల్సి వస్తుంది. దీంతో ఎక్కువ ఖర్చవుతుంది. అయితే ఏఐతో ఖర్చు కూడా కాలక్రమేణా తగ్గుతుందని ఆయన అన్నారు. పరిశోధన ద్వారా భవిష్యత్తులో AI, దాని డేటా ఇన్‌పుట్ సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ జాన్ నీహుస్ పేర్కొన్నారు. AI గురించి స్టీఫెన్ బేర్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో AI రూపం ఎలా ఉంటుందో, రాబోయే కాలంలో మరింత స్పష్టంగా తెలుస్తుందని ఓ కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు.
AI గురించిన అతి పెద్ద భయం ఏమిటంటే.. చాలా మంది తమ ఉద్యోగాలు కోల్పోతారేమోనని. దీనిపై హర్షుల్ అస్నానీ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో భారీగా ఉద్యోగుల తొలగింపుకు ఏఐ ఎట్టిపరిస్థితుల్లోనూ కారణం కాదన్నారు. కోడింగ్ వంటి కొన్ని రంగాలు, ఇతర రకాల ఉద్యోగాలు కనుమరుగవుతున్నప్పటికీ.. ఇండస్ట్రీస్ కూడా ఎంప్లయిస్ నైపుణ్యాలను మెరుగుపరచడంపై దృష్టి పెడుతున్నాయి. గతేడాది కాలంలో టెక్ మహీంద్రా దాదాపు 40 వేల మంది నైపుణ్యాన్ని మెరుగుపరిచింది. హర్షుల్ అస్నానీ అభిప్రాయాన్ని మైక్రోన్ ఇండియా MD కూడా సమర్థించారు. ఏఐ సవాళ్లను ఎదుర్కోవాలంటే జనం నైపుణ్యాభివృద్ధిని పెద్దఎత్తున చేపట్టాల్సి ఉంటుందన్నారు. కాగా భారత్- జర్మనీ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతంగా చేయడమే లక్ష్యంగా జర్మనీ వేదికగా న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేదికపై పలువురు ప్రముఖులు తమ ప్రసంగాలను వినిపిస్తున్నారు.