అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్ధులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది అక్కడి ప్రభుత్వం. ఇకపై కోర్సు ప్రారంభానికి ఒక ఏడాది ముందే వీసాకి దరఖాస్తు చేసుకునేలా నిబంధనలు సవరించింది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల్లో అనేక మార్పులు చేసింది. కొత్త విధానం ప్రకారం అకడమిక్ టర్మ్ ప్రారంభం కావడానికి 365 రోజుల ముందుగానే వీసా జారీ చేయనుంది అమెరికా. యూఎస్‌లో చదువుకోవాలనుకునే విద్యార్ధులకు నిజంగానే ఇదొక వరమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఒకవైపు కోర్సు ప్రారంభమైపోయినా… అమెరికా వీసా దొరకక ఇబ్బందులు పడుతోన్న విద్యార్ధులకు కొత్త విధానం ఊరటనివ్వబోతోంది. సవరించిన రూల్స్ ప్రకారం ఎఫ్-1 లేదా ఎం కేటగిరి స్టూడెంట్ వీసాలను 365 రోజుల ముందే జారీ చేయనుంది అమెరికా. అంతేకాదు, వీసా ఇంటర్వ్యూలను 120రోజులు ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు. కొత్త విధానంతో వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్ధులకు ఎక్కువ సమయం లభిస్తుందని అంటోంది అమెరికన్ కాన్సులేట్.
అంతేకాదు ఈ ఏడాది ఇండియన్ స్టూడెంట్స్ నుంచి రికార్డుస్థాయిలో వీసా దరఖాస్తులు ఆశిస్తున్నట్లు చెప్పింది. అదే సమయంలో వీసా అపాయింట్‌మెంట్ల బ్యాక్‌లాగ్‌ను తగ్గించేందుకు కసరత్తుచేస్తున్నట్లు ప్రకటించింది. వీసా ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు మొదటిసారి దరఖాస్తు చేసుకునే వారికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలను నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించింది. మొత్తానికి అమెరికా తీసుకొచ్చిన మార్పులతో భారతీయు విద్యార్ధులకు భారీ మేలు జరగనుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..