విడాకుల ఖరారుతో ఇంట్లోకి పంది పిల్ల.. మాజీ భర్తకు మహిళ కౌంటర్!

Adopt a piglet: పెళ్లయిన పదేళ్ల తర్వాత భర్తతో విడిపోయింది. విడాకులు ఖరారు కాగానే ఎంతోకాలంగా ఉన్న కోరికను తీర్చుకునే క్రమంలో ఓ పంది పిల్లను ఇంటికి తెచ్చుకుంది. ఇన్నాళ్లూ పెంపుడు పందిని తెచ్చుకోవద్దని అడ్డుకున్న మాజీ భర్తకు ఇదే తన సమాధానం అంటూ సరదాగా కామెంట్ చేసింది.  ఆమె చేసిన మరో వ్యాఖ్య అందరినీ నవ్విస్తోంది. ఈ మహిళ కథేంటో తెలుసుకుందాం.   

విడాకుల ఖరారుతో ఇంట్లోకి పంది పిల్ల.. మాజీ భర్తకు మహిళ కౌంటర్!
Divorce Finalised Piglet Adopted Nashville Woman Takes A Cheeky Dig At Ex Husband

Updated on: Nov 18, 2026 | 5:01 PM

Adopt a piglet: పెళ్లయిన పదేళ్ల తర్వాత భర్తతో విడిపోయింది. విడాకులు ఖరారు కాగానే ఎంతోకాలంగా ఉన్న కోరికను తీర్చుకునే క్రమంలో ఓ పంది పిల్లను ఇంటికి తెచ్చుకుంది. ఇన్నాళ్లూ పెంపుడు పందిని తెచ్చుకోవద్దని అడ్డుకున్న మాజీ భర్తకు ఇదే తన సమాధానం అంటూ సరదాగా కామెంట్ చేసింది.  ఆమె చేసిన మరో వ్యాఖ్య అందరినీ నవ్విస్తోంది. ఈ మహిళ కథేంటో తెలుసుకుందాం.

విడాకుల తర్వాత కొందరు కొత్త ఉద్యోగంలో చేరుతారు.. మరికొందరు కొత్త ప్రదేశాలకు వెళ్లి తమ జీవితాన్ని కొత్తగా ప్రారంభిస్తారు. ఇంకొందరు తమకు నచ్చిన పనులు చేస్తూ స్వేచ్ఛగా జీవించాలనుకుంటారు. కానీ అమెరికాకు చెందిన ఓ మహిళ మాత్రం తన కొత్త జీవితాన్ని ఓ పంది పిల్లతో ప్రారంభించింది. ఇన్నాళ్లూ తన కోరికకు అడ్డుపడిన మాజీ భర్తతో విడిపోయిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన కలను నిజం చేసుకుంది.

అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రం నాష్‌విల్లేకు చెందిన 33 ఏళ్ల గయాలా థాంప్సన్‌కు చిన్నప్పటి నుంచే జంతువులంటే ఎంతో ఇష్టం. వాటిని రక్షించడం, సంరక్షించడం ఆమెకు అలవాటు. ముఖ్యంగా ఇంట్లో ఓ పెంపుడు పందిని పెంచుకోవాలన్నది ఆమె చిరకాల కోరిక. అయితే పదేళ్ల వైవాహిక జీవితంలో ఆమె ఆశ నెరవేరలేదు. ఇంట్లో పందిని పెంచుకోవడానికి తన మాజీ భర్త అస్సలు అంగీకరించేవాడు కాదట. ‘నువ్వు ఇంట్లో పందిని పెంచుకోవడానికి వీల్లేదు’ అంటూ పదేపదే చెప్పేవాడని గయాలా వెల్లడించింది.

చివరకు పదేళ్ల బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకుంది. విడాకులు ఖరారైన వెంటనే తన మనసులోని కోరికను నెరవేర్చుకోవాలని నిర్ణయించుకుంది. 2025 నవంబర్‌లో డైసీ అనే ఎనిమిది వారాల పంది పిల్లను దత్తత తీసుకుంది. అప్పటికి దాని బరువు 9 పౌండ్లు (సుమారు 4 కిలోలు) మాత్రమే.

తన మాజీ భర్తకు సంబంధించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ గయాలా చేసిన వ్యాఖ్య ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘నా మాజీ భర్త ఎప్పుడూ పెంపుడు పందిని తెచ్చుకోవడానికి ఒప్పుకోలేదు. విడాకులు ఖరారైన వెంటనే నా కలల పందిని ఇంటికి తెచ్చుకున్నా. నా కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఇంతకంటే మంచి మార్గం ఏముంటుంది? ఒక పందిని వదిలి మరో పందిని తెచ్చుకున్నా అంటూ సరదాగా వ్యాఖ్యానించింది. ఆమె మాటల్లోని చమత్కారాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

చిన్నగా వచ్చిన డైసీ.. ఇప్పుడు 50 పౌండ్లు!

గయాలా ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు చిన్నగా ఉన్న డైసీ ఇప్పుడు విపరీతంగా బరువు పెరిగింది. ప్రస్తుతం దాని బరువు 50 పౌండ్లు (22.7 కిలోలు). ఇంట్లో ప్రత్యేకంగా బెడ్, బొమ్మలు, లిట్టర్ బాక్స్ ఏర్పాటు చేసింది. డైసీకి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ కుటుంబ సభ్యురాలిలాగే చూసుకుంటోంది.  ఎక్కడకు వెళ్లినా డైసీని గయాలా వెంటే తీసుకెళుతుంది.  సమీపంలోని పెట్ స్టోర్ సిబ్బందికి డైసీ బాగా అలవాటైంది. అక్కడికి వెళ్లినప్పుడల్లా దానికి ప్రత్యేకంగా ట్రీట్‌లు ఇస్తుంటారు.

అల్మారాలు తెరిచి మరీ అల్లరి!

డైసీని పెంచుకోవడం అనుకున్నంత కష్టంగా లేదని గయాలా చెబుతోంది. అయితే ఇంట్లో అల్లరి పనులు మొదలుపెట్టిందట. అల్మారా తలుపులు తెరవడం చేస్తుండటంతో కొన్ని వస్తువులను భద్రంగా ఉంచేందుకు ఇంట్లో మార్పులు చేయాల్సి వచ్చిందని గయాలా తెలిపింది. శీతాకాలంలో డైసీ ఆహారం, సంరక్షణ కోసం నెలకు సుమారు 50 డాలర్లు (రూ.4,500 వరకు) ఖర్చవుతోందట. త్వరలో ఇంటి బయట ప్రత్యేకంగా నిర్మిస్తున్న పెన్‌లోకి దానిని మారుస్తాననీ ఇన్ స్టాగ్రామ్ పోస్టులో తెలిపింది.

మరో పంది కూడా.. త్వరలో హాబీ ఫామ్!

ప్రస్తుతం ఆమెతో ఉన్న ఓ వ్యక్తి  డైసీని ఎంతో ఇష్టంగా చూసుకుంటున్నాడట. అప్పుడప్పుడు తన ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి అక్కడ స్వేచ్ఛగా తిరగనిస్తాడట. ఈ జంట డ్యూడ్ అనే మరో పంది పిల్లను దత్తత తీసుకున్నారు. ఇద్దరూ కలిసి చిన్నపాటి హాబీ ఫామ్ ను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అందులో పందులతో పాటు కోళ్లను పెంచుకోవాలని, వీలైతే ఓ గాడిదను కూడా తెచ్చుకోవాలని అనుకుంటున్నారట.

మొత్తానికి పదేళ్ల వివాహ బంధం ముగిసిన తర్వాత గయాలా తనకు నచ్చిన జీవితాన్ని ఎంచుకుంది. ఒకప్పుడు భర్త వద్దని చెప్పిన కోరికే ఇప్పుడు ఆమె జీవితంలో ఆనందానికి కారణమైంది. డైసీ, డ్యూడ్‌తో కలిసి కొత్త ప్రపంచాన్ని నిర్మించుకుంది. విడాకుల తర్వాత తన కలను నిజం చేసుకున్న ఈ మహిళ కథ ఇప్పుడు నెట్టింట ఆసక్తికరంగా మారింది.

 

Loading...
Unable to load recommendations.
Follow Us