
ఖరీదైన కార్లు ఉన్నాయన్న పొగరు.. వేగంగా కారు నడపాలన్న సరదా.. ఇద్దరు వ్యక్తులను రేసింగ్‌కు ఉసిగొల్పింది. వారి నిర్లక్ష్యం ఓ తల్లీకూతుళ్ల ప్రాణాలను బలిగొంది. ఇద్దరూ ఒకరికొకరు అంతకు ముందు పరిచయం లేనివారే. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పక్కపక్కనే ఆగిన సమయంలో కిటికీల నుంచి మాట్లాడుకున్నారు. తమ కార్ల సామర్థ్యం గురించి గొప్పలు చెప్పుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ రోడ్డుపైనే పోటీగా కార్ల రేసింగ్ ప్రారంభించారు. స్కూల్‌కు వెళ్తున్న తల్లీకూతురిని కారు ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు బ్రిటన్ కోర్టు మొత్తం 28 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
2023 జనవరిలో ఉత్తర ఇంగ్లండ్‌లోని లీడ్స్‌లో జస్టినా హుల్‌బోజ్ (27), ఆమె నాలుగేళ్ల కుమార్తె లెనా చెప్‌చోర్ స్కూల్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జస్కమల్ రియాత్ అనే కార్ల విక్రయదారుడు బీఎండబ్ల్యూ కారును నడుపుతుండగా.. హర్‌దీప్ భాచు ఆడి కారులో వెళ్తున్నాడు. ఇద్దరూ ఒకరికొకరు అంతకు ముందు పరిచయం లేనివారే. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పక్కపక్కనే ఆగిన సమయంలో కిటికీల నుంచి మాట్లాడుకున్నారు. తమ కార్ల సామర్థ్యం గురించి గొప్పలు చెప్పుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ రోడ్డుపైనే పోటీగా కార్లను నడపడం ప్రారంభించారు. తొలుత రియాత్ తన బీఎండబ్ల్యూ కారుతో వేగంగా ముందుకు వెళ్లాడు. అతడిని అనుసరిస్తూ భాచు కూడా ఆడి కారును వేగంగా నడిపాడు.
స్కాట్ హాల్ రోడ్డుపై గంటకు 40 మైళ్ల (64 కిలోమీటర్ల) వేగంతో మాత్రమే వెళ్లాలి. అయితే, భాచు తన ఆడి కారును గంటకు దాదాపు 90 మైళ్ల (145 కిలోమీటర్ల) వేగంతో నడిపినట్లు విచారణలో వెల్లడైంది. కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న కాలిబాటపైకి దూసుకెళ్లింది. అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న జస్టినా, ఆమె కుమార్తె లెనాను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తల్లీకూతురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
కేసు విచారణలో కీలక ఆధారాలు లభించాయి. భాచు కారులోని డ్యాష్‌క్యామ్ ఫుటేజీతో పాటు రియాత్ ఫోన్‌లోని వీడియో రికార్డింగ్‌ను కూడా పరిశీలించారు. ప్రమాదానికి ముందు ఇద్దరూ తమ కార్ల గురించి మాట్లాడుకున్నారని, ఒకరినొకరు వేగంగా నడిపేలా ప్రోత్సహించుకున్నారని తెలిసింది. రియాత్ తనపై వచ్చిన ఆరోపణలను ఒప్పుకోలేదు. అతడు భాచుతో కలిసి కార్ల రేసింగ్‌లో పాల్గొన్నట్లు సీసీటీవీ దృశ్యాలు, ఇతర ఆధారాలను నిర్ధారించుకున్న కోర్టు అతడిని దోషిగా తేల్చింది.
ప్రమాదకరంగా కారు నడిపి ఇద్దరి మరణాలకు కారణమైనట్లు 2024 జూన్‌లో భాచు నేరాన్ని అంగీకరించాడు. దాంతో అతడికి 12 ఏళ్ల జైలు రియాత్ కు 16 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఇద్దరికీ ఆరేళ్లు డ్రైవింగ్ నిషేధించారు. గడువు ముగిసిన తర్వాత తిరిగి డ్రైవ్ చేయాలంటే కఠినమైన పరీక్షలను దాటాలి. ఈ కేసులో తీర్పు వెలువరిస్తూ న్యాయమూర్తి రే సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘శక్తివంతమైన కారు ఉందని రోడ్డుపై వేగాన్ని పరీక్షించాలనుకోవడం , రోడ్డు రేసింగ్ ట్రాక్ కాదనీ ‘ స్పష్టం చేశారు. ఈ తీర్పుతో బాధిత కుటుంబం కొనసాగించిన సుదీర్ఘ న్యాయపోరాటం ముగిసింది. క్షణం సరదా కోసం రేసింగ్ రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.