Sunita Williams: దివి నుంచి భువికి.. సేఫ్‌గా ల్యాండయిన సునీతా విలియమ్స్.. అద్భుతమైన వీడియో

|

Mar 19, 2025 | 6:47 AM

వ్యోమనౌక మొరాయించడంతో తొమ్మిది నెలలుగా అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు భువిపై సురక్షితంగా అడుగుపెట్టారు.. ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ నుంచి మంగళవారం తిరుగుప్రయాణం అయిన సునీతా విలియమ్స్, విల్మోర్ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27కి ఫ్లోరిడా తీరంలో సేఫ్ గా ల్యాండ్ అయ్యారు.

Sunita Williams: దివి నుంచి భువికి.. సేఫ్‌గా ల్యాండయిన సునీతా విలియమ్స్.. అద్భుతమైన వీడియో
Sunita Williams
Follow us on

వ్యోమనౌక మొరాయించడంతో తొమ్మిది నెలలుగా అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు భువిపై సురక్షితంగా అడుగుపెట్టారు.. ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ నుంచి మంగళవారం తిరుగుప్రయాణం అయిన సునీతా విలియమ్స్, విల్మోర్ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27కి ఫ్లోరిడా తీరంలో సేఫ్ గా ల్యాండ్ అయ్యారు.. డ్రాగన్‌ వ్యోమనౌక సముద్ర తీరంలో ల్యాండ్ అవ్వగానే.. సహాయ బృందాలు రంగంలోకి దిగి.. క్రూ డ్రాగన్‌ను వెలికితీస్తాయి. ఆ తర్వాత ఆస్ట్రోనాట్‌లను స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ ‘ఫ్రీడమ్’ క్యాప్సూల్‌ నుంచి బయటకు తీసుకొచ్చారు.. ఊహించని సవాళ్లు, చారిత్రాత్మక క్షణాలతో నిండిన ఈ మిషన్ సేఫ్ గా ముగియడంతో ఆనందం వెల్లివిరిసింది. 286 రోజుల తర్వాత సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ మరో ఇద్దరు ఆస్ట్రోనాట్‌లు సురక్షితంగా పుడమిని చేరినట్లు నాసా ప్రకటించింది..

ఫ్లోరిడా తీరంలో స్పేస్‌ఎక్స్ క్రూ-9 మిషన్ భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిన క్షణాలను నాసా X, యూట్యూబ్, NASA+లో లైవ్ ప్రసారం చేసింది.. దివి నుంచి భువికి చేరిన వారిలో సునీతా విలియమ్స్, విల్మోర్‌తో పాటు స్పేస్‌ఎక్స్ క్రూ-9 వ్యోమగామి నిక్ హేగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ ఉన్నారు.

వీడియో చూడండి..

డ్రాగన్ వ్యోమనౌక భూమికి చేరుకుని పారాచూట్‌లను ఓపెన్ చేసింది.. తిరిగి ప్రవేశించిన తర్వాత వ్యోమనౌకను స్థిరీకరించడానికి రెండు డ్రోగ్ పారాచూట్‌లు, ల్యాండింగ్‌కు ముందు వ్యోమనౌక వేగాన్ని మరింత తగ్గించడానికి నాలుగు ప్రధాన పారాచూట్‌లను డ్రాగన్ ‘ఫ్రీడమ్’ క్యాప్సూల్‌ కు అమర్చారు.

ల్యాండింగ్‌ తర్వాత వ్యోమగాములను హ్యూస్టన్‌లోని జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌కు తరలించారు.. అక్కడ వారికి వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి.. దీర్ఘకాల అంతరిక్షయాత్ర తర్వాత వారి శారీరక స్థితిని పరిశీలిస్తారు. భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందించనున్నారు.

అంబరాన్నంటిన సంబారాలు..

స్పేస్‌ క్యాప్స్యూల్‌ నుంచి బయటికి వస్తూ సునీత నవ్వుతూ అభివాదం చేశారు. కాగా… వ్యోమనౌక సేఫ్‌ ల్యాండింగ్‌తో నాసా, స్పేస్‌-ఎక్స్‌లో సంబరాలు అంబరాన్నంటాయి.. 288రోజులపాటు విలియమ్స్‌, విల్మోర్‌ అంతరిక్షంలో ఉన్నారు. మూడో అంతరిక్ష యాత్రను సునీత విజయవంతంగా ముగించారు.. కాగా.. సునీత క్షేమంగా భూమిపైకి రావడంతో భారత్‌లోనూ సంబరాలు అంబరాన్నంటాయి.. గుజరాత్‌లో టపాసులు కాల్చి సునీత బంధువర్గం ఆనందం వ్యక్తంచేసింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..