భార్యాపిల్లలు ఇంట్లో ఉండగానే.. జేసీబీతో వచ్చి.. ఇంటిని కూల్చేసిన భర్త
అమెరికాలోని పెన్సిల్వేనియాలో భార్య విడాకులు కావాలని చెప్పడంతో ఆగ్రహించిన ఓ వ్యక్తి జేసీబీతో తన సొంత ఇంటినే ధ్వంసం చేశాడు. ఘటన సమయంలో భార్య, ఇద్దరు కుమార్తెలు ఇంట్లోనే ఉండటం తీవ్ర కలకలం రేపింది. అదృష్టవశాత్తూ వారికి ఎలాంటి గాయాలు కాలేదు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి, పలువురు ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిన కేసులతో జైలుకు తరలించారు.
భార్యతో గొడవల కారణంగా ఓ వ్యక్తి ఉన్మాదిలా మారాడు. అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన 48 ఏళ్ల ఎరిక్ పియెర్వ్స్జాకు, అతని భార్యకు మధ్య కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. మే 26న భార్య అతనితో.. “నాకు నీతో కలిసి జీవించడం ఇష్టం లేదు.. మనం విడాకులు తీసుకుందాం” అని చెప్పింది. ఆ మాట వినగానే ఎరిక్‌కు విపరీతమైన కోపం వచ్చింది. ఆగ్రహంతో ఊగిపోయిన అతడు.. “మన బంధం ముగిసిపోతే.. ఇక ఈ ఇల్లు కూడా ఉండటానికి వీల్లేదు. వెంటనే దీన్ని నేను కూల్చేస్తాను” అంటూ భార్యను హెచ్చరించాడు. హెచ్చరించిన కొద్ది నిమిషాల్లోనే ఎరిక్ ఉన్మాదిలా ప్రవర్తించాడు. బయట ఉన్న ఒక భారీ జేసీబీ యంత్రంలోకి ఎక్కి, తన సొంత నివాస గృహాన్ని ధ్వంసం చేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో అతని భార్య, భయంతో వణికిపోతున్న ఇద్దరు కుమార్తెలు ఇంట్లోనే చిక్కుకుపోయారు. భార్య వెంటనే హెల్ప్‌లైన్ ‘911’కు ఫోన్ చేసి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫోన్ మాట్లాడే సమయంలో వెనుక నుంచి భయంకరమైన కేకలు, ఇల్లు కూలిపోతున్న శబ్దాలు, యంత్రాల గర్జనలు స్పష్టంగా వినబడ్డాయని ఎమర్జెన్సీ ఆపరేటర్లు తెలిపారు. ఎరిక్ కాసేపటికి శాంతించి యంత్రాన్ని ఆపాడు. వెంటనే ఇంటి లోపలికి పరిగెత్తి, ఒక డఫిల్ బ్యాగ్ తీసుకుని వేరే నగరానికి పారిపోయాడు. సమాచారం అందుకున్న బఫెలో టౌన్‌షిప్ పోలీసులు రంగంలోకి దిగి, అదే రోజు నిందితుడిని అరెస్ట్ చేశారు. అదృష్టవశాత్తూ అతడి భార్య, పిల్లలకు ఎలాంటి గాయాలు కాలేదని.. కానీ ఆ భారీ యంత్రం దాడి కారణంగా ఇంటి పునాదులు, ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు. నిందితుడైన ఎరిక్ పై పోలీసులు అత్యంత తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ముగ్గురు వ్యక్తుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం, విపత్తుకు కారణం కావడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం వంటి ఆరోపణలపై కేసులు పెట్టారు. ప్రస్తుతం అతడిని బట్లర్ కౌంటీ జైలులో ఉంచారు. ఈయనకు బెయిల్ మంజూరు చేయాలంటే 10,000 డాలర్ల పూచీకత్తు చెల్లించాల్సి ఉంటుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐఫోన్ కావాలన్న ప్రియురాలు.. మైనర్ ఏం చోరీ చేసాడంటే..
ఎవరెస్ట్‌పై అద్భుతం..ఆరు రోజులు ఆహారం, ఆక్సిజన్ లేకున్నా బతికాడు!
బాస్ అంటే ఇతడే.. కంటతడి పెట్టిస్తున్న ఘటన!