క్రికెట్ మ్యాచ్‌లో వివాదం.. కత్తిపోట్లతో యువకుడి మృతి

Updated on: Apr 06, 2026 | 5:23 PM

విశాఖపట్నం పెదగదిలిలో జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్ ఒక్క పరుగు విషయంలో మొదలైన వాగ్వాదం చివరికి హత్యకు దారితీసింది. డోలా అజిత్, గంటా కిషోర్ మధ్య జరిగిన ఘర్షణలో, మ్యాచ్ తర్వాత కిషోర్ కత్తితో అజిత్‌ను పొడిచి చంపాడు. తీవ్ర రక్తస్రావంతో అజిత్ మృతి చెందగా, పోలీసులు నిందితుడు కిషోర్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

సరదాగా సాగాల్సిన క్రికెట్ మ్యాచ్ ఓ యువకుడి ప్రాణం తీసింది. కేవలం ఒక్క పరుగు విషయంలో మొదలైన చిన్నపాటి వాగ్వాదం.. చివరకు కక్షగా మారి హత్యకు దారితీసింది. విశాఖ ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెదగదిలి ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం సెలవు దినం కావడంతో స్థానిక యువకులు మూడు జట్లుగా విడిపోయి క్రికెట్ సిరీస్ ఆడాలని నిర్ణయించుకున్నారు. వినాయక నగర్, చాకలిపేట జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా, డోలా అజిత్ అలియాస్ పెద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ సమయంలో ఒక్క పరుగు విషయంలో ఆటగాళ్ల మధ్య చిన్న వివాదం తలెత్తింది. అంపైర్ చిరంజీవి జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అయితే, మ్యాచ్‌తో సంబంధం లేని గంటా కిషోర్ అలియాస్ బాక్సర్ కిషోర్ అనే యువకుడు అనవసరంగా తలదూర్చి అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. దీనిని అజిత్ ప్రశ్నించడంతో కిషోర్ పగ పెంచుకున్నాడు. మ్యాచ్ ముగిసి అందరూ ఇళ్లకు వెళ్ళిపోయిన తర్వాత, సాయంత్రం 6:30 గంటల సమయంలో కిషోర్ పథకం ప్రకారం కత్తితో పెదగదిలికి వచ్చాడు. అక్కడ అజిత్‌తో మళ్ళీ గొడవ పెట్టుకుని, తన వెంట తెచ్చుకున్న కత్తితో అజిత్ ఛాతిలో బలంగా పొడిచాడు. అడ్డుకోబోయిన నాగు అనే మరో యువకుడు కూడా గాయపడ్డాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అజిత్ ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు కిషోర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వృత్తిరీత్యా ఈవెంట్ ఫోటోగ్రాఫర్ అయిన కిషోర్, క్షణికావేశంలో చేసిన ఈ దాడితో అజిత్ కుటుంబంలో తీరని విషాదం నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Weather Update: తెలుగు రాష్ట్రాలకు పొంచివున్న తుఫాను ముప్పు

Gold Price Today: తగ్గిన బంగారం ధర.. ఇవాళ ధర ఎంతంటే ??

చీమలే ఆహారంగా.. శత్రుదేశంలో అమెరికా పైలట్‌ దుస్థితి

మీర్రా దొంగలంటే.. స్టేషన్ ముందు షాపునే కొల్లగొట్టేశారు

Follow Us