జీతం ఇవ్వలేదని.. ప్రస్తుతం బంగారం కంటే విలువైన సిలిండర్ల ట్రక్కు చోరీ

Updated on: Mar 13, 2026 | 6:17 PM

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో సంచలనం సృష్టించిన ఎల్‌పీజీ సిలిండర్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. యజమాని జీతం బకాయిలు చెల్లించకపోవడంతో ప్రతీకారంగా, డ్రైవర్లు జావేద్, రితిక్ ఏకంగా 524 సిలిండర్ల లోడుతో ఉన్న ట్రక్కును అపహరించారు. వాటిని రూ.13 లక్షలకు విక్రయించారు. పోలీసులు డ్రైవర్లతో పాటు కొనుగోలుదారులను అరెస్టు చేసి సిలిండర్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు.

గ్యాస్‌ క్రైసిస్‌ ఇప్పుడు చోరీలకు దారితీస్తోంది. టమాటా ధరలు అమాంతం పెరిగినప్పుడు పొలాల్లో టమాటాలు ఎత్తుకెళ్లిన ఘటనలు చూశాం. ఇప్పుడు గ్యాస్‌ కొరత ఏర్పడటంతో, మరోవైపు ధర కూడా పెరగడంతో గ్యాస్‌ చోరీలకు పాల్పడుతున్నారు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. తన వద్ద పనిచేసే డ్రైవర్లకు జీతం ఇవ్వకుండా వేధించిన ఓ యజమానికి, ఆ డ్రైవర్లు ఊహించని షాక్ ఇచ్చారు. బకాయి ఉన్న రూ. 70 వేల కోసం ఏకంగా 524 ఎల్‌పీజీ సిలిండర్ల లోడుతో ఉన్న ట్రక్కునే అపహరించి, యజమానిని నిలువునా ముంచేశారు. ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో సంచలనం సృష్టించిన ఈ భారీ చోరీ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. వివరాల ప్రకారం మార్చి 2 నుంచి 6వ తేదీ మధ్యలో గ్యాస్ ప్లాంట్ బయట సిలిండర్ల లోడుతో నిలిపి ఉంచిన ఒక భారీ ట్రక్కు కనిపించకుడా పోయింది. దాంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన సిప్రి బజార్ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సంయుక్తంగా దర్యాప్తు చేపట్టగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ చోరీకి సూత్రధారులు మరెవరో కాదు.. ఆ ట్రక్కు యజమాని వద్ద గతంలో డ్రైవర్లుగా పనిచేసిన జావేద్, రితిక్. తమకు రావాల్సిన రూ.70 వేల జీతం బకాయిలు ఇవ్వమంటే ఇవ్వకుండా యజమాని తరచూ తిప్పించుకోవడంతో, ప్రతీకారంతో ఈ దొంగతనానికి పాల్పడ్డారు. చోరీ చేసిన ఈ 524 సిలిండర్లను సుమారు 70 కిలోమీటర్ల దూరంలోని ‘శివ గ్యాస్ ఏజెన్సీ’ యజమానికి రూ. 13 లక్షలకు విక్రయించారు. పక్కా సమాచారంతో దాడులు చేసిన పోలీసులు.. ప్రధాన నిందితులతో పాటు ఏజెన్సీ యజమానిని, మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి 379 నిండు సిలిండర్లు, 135 ఖాళీ సిలిండర్లతో పాటు రూ. 11.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అత్యంత వేగంగా కేసును ఛేదించిన పోలీస్ బృందానికి ఎస్ఎస్పీ రూ.25 వేల నగదు బహుమతిని ప్రకటించారు. జీతం ఎగ్గొట్టిన యజమానిపై ప్రతీకారం తీర్చుకోబోయి, నిందితులు ఇప్పుడు కటకటాల పాలయ్యారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలంగాణలో ఒంటిపూట బడులు – పూర్తి షెడ్యూల్ ఇదే

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ !! మీ కోసం సరికొత్త టెక్నాలజీ ప్రారంభం

ఎర్రటి ఎండను సైతం లెక్కచేయని భక్తి.. మల్లన్న దర్శనానికి పాదయాత్ర

క్షుద్రపూజల కలకలం.. శివారులో భయానక దృశ్యాలు !!

గ్యాస్‌ ఎఫెక్ట్‌.. అయోధ్యలో భక్తులకు భోజన కష్టాలు

Follow Us