కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
సౌదీ శాస్త్రవేత్తలు విద్యుత్ అవసరం లేకుండా పనిచేసే ‘NESCOD’ అనే వినూత్న శీతలీకరణ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. అమ్మోనియం నైట్రేట్ ఆధారిత ఈ వ్యవస్థ కేవలం 20 నిమిషాల్లో ఉష్ణోగ్రతను భారీగా తగ్గిస్తుంది. సౌరశక్తితో తిరిగి రీఛార్జ్ చేసుకునే ఈ పర్యావరణహిత సాంకేతికత విద్యుత్ లేని ప్రాంతాలు, తీవ్ర వేడి ఉన్న ప్రదేశాలకు పెద్ద వరంగా మారనుంది.
రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కోసం కూలర్లు, ఎయిర్ కండిషనర్లు పై ఆధారపడటం సాధారణమైంది. అయితే, విద్యుత్ వాడకం, పర్యావరణానికి వాటివల్ల కలిగే నష్టం వంటి సమస్యలున్నాయి. విద్యుత్‌తో సంబంధం లేకుండా చల్లదనాన్ని అందించే కొతంత టెక్నాలజీని సౌదీ అరేబియా శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. సౌదీలోని కింగ్ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థకు ‘నెస్కాడ్’ (NESCOD – No Electricity Sustainable Cooling On Demand) అని పేరు పెట్టారు. ఈ టెక్నాలజీ ఎండోథెర్మిక్ రసాయన ప్రక్రియ ఆధారంగా పనిచేస్తుంది. అమ్మోనియం నైట్రేట్ అనే ఒక రకమైన ఉప్పును నీటిలో కరిగించినప్పుడు, అది పరిసరాల నుంచి వేడిని గ్రహిస్తుంది. ఆ ప్రక్రియలో ఉష్ణోగ్రత గణనీయంగా పడిపోయి చల్లదనం ఏర్పడుతుంది. కేవలం 20 నిమిషాల్లోనే పరిసరాల ఉష్ణోగ్రతను 25 డిగ్రీల సెల్సియస్ నుంచి 3.6 డిగ్రీలకు తగ్గించి ఈ టెక్నాలజీ తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఈ వ్యవస్థ రెండు దశల్లో పనిచేస్తుంది. మొదటి దశలో అమ్మోనియం నైట్రేట్ నీటిలో కరిగి చల్లదనాన్ని ఇస్తుంది. రెండో దశలో, ఈ ఉప్పు నీటి మిశ్రమాన్ని సౌరశక్తి (సూర్యరశ్మి)కి గురిచేస్తారు. ఎండ వేడికి నీరు ఆవిరైపోగా, అమ్మోనియం నైట్రేట్ తిరిగి స్ఫటికాలుగా మారుతుంది. ఆ స్ఫటికాలను మళ్లీ నీటిలో కలపడం ద్వారా తిరిగి చల్లదనాన్ని పొందవచ్చు. అంటే, ఈ సిస్టమ్‌ను సౌరశక్తితో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ వ్యవస్థ చదరపు మీటరుకు 191 వాట్ల వరకు శీతలీకరణ సామర్థ్యాన్ని అందిస్తుంది. ఈ టెక్నాలజీకి మరో ప్రత్యేకత కూడా ఉంది. సౌరశక్తి ద్వారా నీరు ఆవిరయ్యే ప్రక్రియలో, ఆ ఆవిరిని సేకరించి తిరిగి స్వచ్ఛమైన నీరుగా మార్చుకోవచ్చు. ఆ నీటిలో మలినాలు 1 పీపీఎం పార్ట్స్ పర్ మిలియన్ కంటే తక్కువగా ఉంటాయని పరిశోధకులు తెలిపారు. నీటి కొరత ఉన్న పొడి ప్రాంతాలకు ఇది ఒక వరం లాంటిది. విద్యుత్ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలు, తీవ్రమైన వేడి ఉండే ప్రదేశాలు, కోల్డ్-చైన్ స్టోరేజ్ అవసరాలకు ఈ టెక్నాలజీ ఒక పర్యావరణ అనుకూల పరిష్కారంగా నిలవనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో… ఆ ఊరి నిండా పాములే! ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న గ్రామం
Aadhaar Update: ఆధార్ అప్డేట్‌పై కేంద్రం గుడ్ న్యూస్
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం
కుక్కను వెంబడిస్తూ వెళితే.. బయటపడిన 18 వేల ఏళ్ల రహస్య ప్రపంచం
