ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
లండన్ బ్లాక్ క్యాబ్ డ్రైవర్ల కోసం నిర్వహించే 'ది నాలెడ్జ్' పరీక్ష ప్రపంచంలోనే అత్యంత కఠినమైనదని పేరుపొందింది. లండన్‌లోని వేల వీధులు, మలుపులు, చారిత్రక కట్టడాలు కంఠస్థం చేయాలి. 3-4 ఏళ్ల కఠోర సాధనతో మెదడులోని హిప్పోక్యాంపస్ పరిమాణం పెరుగుతుందని, అల్జీమర్స్ వంటి సమస్యలు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇదొక వృత్తి మాత్రమే కాదు, అత్యున్నత హోదా!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత కష్టతరమైన ఉద్యోగ పరీక్షల గురించి మాట్లాడేటప్పుడు మన దేశంలోని సివిల్ సర్వీసెస్ కూడా చర్చకు వస్తుంది. అయితే, లండన్ నగరంలో ఒక సాధారణ ట్యాక్సీ డ్రైవర్‌గా లైసెన్స్ సంపాదించడం కూడా దాదాపు అంతటి క్లిష్టమైన ప్రక్రియే. దీనిని ‘ద నాలెడ్జ్’ అని పిలుస్తారు. ఈ పరీక్షలో విజయం సాధించాలంటే డ్రైవర్లు లండన్ నగరంలోని సుమారు 25,000 వీధులను, లక్షలాది మలుపులను మరియు వేల సంఖ్యలో చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాల పేర్లు, వాటి వివరాలు బాగా గుర్తుంచుకోవాల్సిందే. కేవలం వీధులు మాత్రమే కాదు, ఏ మలుపులో ఏ హోటల్ ఉంది, ఏ షార్ట్‌కట్ ద్వారా వెళ్తే ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది అనే విషయాలపై పూర్తి అవగాహన ఉండాలి. దీనికోసం అభ్యర్థులు సగటున 3 నుండి 4 సంవత్సరాల పాటు శ్రమించాల్సి ఉంటుంది. లండన్ మహా నగరం నిన్న మొన్నటిది కాదు.. రోమన్ సామ్రాజ్య కాలం కంటే ముందు నుంచే దీనికి సుదీర్ఘ చరిత్ర ఉంది. వేల ఏళ్లుగా విస్తరిస్తూ వచ్చిన ఈ మహానగరంలో ప్రస్తుతం 25,000 పైగా వీధులు, లక్షలాది ప్రాంతాలు ఒకదానికొకటి అల్లుకుపోయి ఒక చిక్కుముడిలా ఉంటాయి. ఈ ట్రాఫిక్ మాయాజాలాన్ని చేధించడానికి సరిగ్గా 160 ఏళ్ల క్రితమే, అంటే 1865లో బ్రిటీష్ ప్రభుత్వం ‘ద నాలెడ్జ్’ అనే కఠినమైన పరీక్షా విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి గల్లీ, ప్రతి చారిత్రక కట్టడం, ఆసుపత్రులు, హోటళ్లు, చివరికి పార్కుల్లో ఉండే విగ్రహాల వరకు అన్నింటినీ కంఠస్థం చేయాలి. గూగుల్ మ్యాప్స్ అందుబాటులో ఉన్నా, లండన్ ‘బ్లాక్ క్యాబ్’ డ్రైవర్లు వాటిని వాడరు. ఎందుకంటే వారి జ్ఞాపకశక్తి మ్యాప్స్ కంటే వేగంగా పనిచేస్తుంది. ఈ పరీక్షలో అడిగే ప్రశ్నలు ఎంత కఠినంగా ఉంటాయంటే.. అభ్యర్థి సగటున 12 సార్లు ఇంటర్వ్యూలకు హాజరైన తర్వాతే లైసెన్స్ సంపాదించగలడు. అందుకే లండన్ వీధుల్లో ట్యాక్సీ నడపడం అనేది ఒక వృత్తి మాత్రమే కాదు, అదొక అత్యున్నత హోదా! లండన్ వీధుల్లో ట్యాక్సీ నడిపే డ్రైవర్లు కేవలం దారులను బాగా గుర్తించుకోవడం ద్వారా తమ మెదడు పనితీరును పెంచుకుంటున్నారని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. సాధారణంగా మన మెదడులో ‘హిప్పోక్యాంపస్’ అనే భాగం ఉంటుంది. ఇది మనం చూసిన ప్రాంతాలను, నేర్చుకున్న విషయాలను స్వల్పకాలిక జ్ఞాపకాల నుండి దీర్ఘకాలిక జ్ఞాపకాలుగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. లండన్ డ్రైవర్లు రోజూ వేలాది వీధులు, మలుపులు, భౌగోళిక ప్రాంతాలను గుర్తుపెట్టుకుని ప్రయాణించడం వల్ల, వీరి మెదడులోని హిప్పోక్యాంపస్ పరిమాణం సాధారణ వ్యక్తుల కంటే పెద్దదిగా మారుతుందని లండన్ వర్సిటీ పరిశోధనలో తేలింది. దీనివల్ల వయసు పెరిగే కొద్దీ వచ్చే అల్జీమర్స్, మతిమరపు వంటి సమస్యల బెడద కూడా వీరికి చాలా తక్కువ అని ఆ పరిశోధనలో రుజువైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold & Silver Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంత పెరిగిందంటే
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
