వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం అన్ననే..

Updated on: Dec 06, 2025 | 1:13 PM

కరీంనగర్ జిల్లా రామడుగులో దారుణం చోటుచేసుకుంది. అప్పులు తీర్చడం కోసం తమ్ముడు నరేశ్, అన్న వెంకటేశ్‌ను హత్య చేశాడు. రూ. 4.14 కోట్ల బీమా సొమ్ము కోసం మానసికంగా పరిపక్వత లేని అన్నను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి చంపాడు. బీమా కంపెనీ అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణలో అసలు విషయం బయటపడింది. నరేశ్‌తో పాటు మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు.

ఇది ఓ తమ్ముడి దురాఘతం. చేసిన అప్పులు తీర్చడానికి సొంత అన్ననే అంతమొందించిన దారుణ ఘటన కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలంలో జరిగింది. మామిడి నరేశ్‌కు అప్పుల బాధలు అధికమవడంతో.. తనతోపాటు ఇంట్లోనే ఉంటున్న అవివాహితుడైన అన్న మామిడి వెంకటేశ్‌ను చంపాలని ప్లాన్‌ వేశాడు. మానసికంగా పరిపక్వత లేని అన్నను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. రెండు నెలల కిందట అన్న వెంకటేశ్‌ పేరు పైన రూ.4.14కోట్లకు బీమా పాలసీలు తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రీమియాన్ని చెల్లించాడు. అదును చూసి అన్న చాప్టర్ క్లోజ్ చేయాలని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే తనకు అప్పులు ఇచ్చిన నముండ్ల రాకేశ్‌, టిప్పర్‌ డ్రైవర్‌ ప్రదీప్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అన్న వెంకటేశ్‌ పేరిట కోట్లాది రూపాయల బీమా సొమ్ము వస్తుందని, ఆ డబ్బులతో అప్పులు చెల్లించడమే కాకుండా అదనంగా లక్షలు ఇస్తానని చెప్పాడు. ఇందుకోసం రోడ్డు ప్రమాదంలో అన్నను చంపుదామని నిర్ణయించుకున్నారు. ఒప్పందం సమయంలోనే ముగ్గురూ కలిసి ఓ వీడియో రికార్డు చేసుకున్నారు. ప్రణాళికలో భాగంగా గత నెల 29న రాత్రి 11 గంటలకు గ్రామశివారులోని పెట్రోల్‌ బంక్‌ పక్కన ఉన్న టిప్పర్‌ వద్దకు అన్న వెంకటేశ్‌ను పంపించాడు. వెనకాలే నరేశ్‌ కూడా వెళ్లాడు. టిప్పర్‌ రిపేర్‌ ఉందని చక్రం కింద జాకీ పెట్టాలని.. వెంకటేశ్‌ని కింద పడుకోబెట్టి నరేశ్‌ టిప్పర్‌ను నడుపుతూ ముందుకు కదిలించాడు. దీంతో వెంకటేశ్‌ టైర్ల కింద పడి అక్కడిక్కడే చనిపోయాడు. ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదమని పోలీసుల్ని నమ్మించాడు. బీమా సంస్థకు సంబంధించిన ప్రతినిధులకు నరేశ్‌ చెప్పే విధానంపై అనుమానం వచ్చి పోలీసుల్ని ఆశ్రయించారు. విచారణలో పోలీసులు అసలు నిగ్గు తేల్చారు. బీమా సొమ్ము కోసమే చంపానని నరేశ్‌ అంగీకరించినట్టు సీపీ తెలిపారు. ఈ మేరకు నరేశ్‌తో పాటు రాకేశ్, డ్రైవర్‌ ప్రదీప్‌లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ

SpiceJet: ఇండిగో సంక్షోభం నేపథ్యంలో స్పైస్ జెట్ అదనపు సర్వీసులు

Komati Reddy: ఏపీకి వెళ్లి మాట మార్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి

రాష్ట్రపతిభవన్ లో పుతిన్ కు విందు పై రాజకీయ వివాదం

IndiGo: ఇండిగో నిర్లక్ష్యానికి నరకం చూసిన ప్రయాణికులు

Published on: Dec 06, 2025 01:13 PM