క్యాన్సర్‌ను ఎదిరించి.. CBSE టెన్త్‌లో టాపర్‌గా నిలిచి..

Updated on: Apr 18, 2026 | 12:13 PM

ఢిల్లీకి చెందిన ఆరవ్ వత్స్ CBSE పదో తరగతిలో 96.6% మార్కులు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. లింఫోబ్లాస్టిక్ లింఫోమా అనే తీవ్ర క్యాన్సర్‌తో రెండేళ్లుగా పోరాడుతూనే, చదువును విస్మరించలేదు. ఆన్‌లైన్ తరగతులు, క్రమశిక్షణతో కూడిన అధ్యయనం, సంగీతం అతని విజయానికి దోహదపడ్డాయి. ఆరవ్ సంకల్పం, ధైర్యం ఎందరికో స్ఫూర్తిదాయకం.

ఏప్రిల్‌ 14న CBSE పదో తరగతి ఫలితాలు వెలువడ్డాయి. వేలమంది విద్యార్థులు తమ మార్కుల కోసం ఆత్రుతగా ఎదురుచూశారు. చాలామందికి అవి కేవలం మార్కులు మాత్రమే కావచ్చు, కానీ ఢిల్లీకి చెందిన ఆరవ్ వత్స్‌కి మాత్రం ఈ ఫలితాలు ఒక గొప్ప విజయం. ఇది కేవలం పరీక్షల్లో సాధించిన మార్కుల గురించి మాత్రమే కాదు, ఆ మార్కులను చేరుకోవడానికి అతను పడిన కష్టం, చూపించిన ధైర్యం గురించి. ఢిల్లీలోని మెహ్రౌలీలో నివసించే ఆరవ్ ది ఒక వైద్యుల కుటుంబం. తండ్రి అజయ్ వత్స్‌ జనరల్ ఫిజీషియన్ కాగా, తల్లి రజనీ వత్స్‌ గైనకాలజిస్ట్. అన్నయ్య బిటెక్ చదువుతున్నాడు. ఇంట్లో అందరూ డాక్టర్లు ఉన్నప్పటికీ, నయం చేయలేనంతగా అనారోగ్యం ఎదురైనప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. గత రెండేళ్లుగా ఆరవ్ లింఫోబ్లాస్టిక్ లింఫోమా అనే తీవ్ర క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నాడు. అది సాధారణంగా పిల్లల్లో వేగంగా వ్యాపిస్తుంది. దీనికి తీసుకునే చికిత్స చాలా కష్టంగా, అలసటగా ఉంటుంది. సాధారణ విద్యార్థులు తమ సమయాన్ని చదువుకే కేటాయిస్తే, ఆరవ్ మాత్రం తన సమయాన్ని చదువుకు, హాస్పిటల్ చికిత్సకు మధ్య పంచుకోవాల్సి వచ్చింది. తను హాస్పిటల్‌లో చేరినప్పుడు టీచర్లు ఆన్‌లైన్ క్లాసులు తీసుకుని, ఫోన్ ద్వారా సందేహాలను తీర్చి చదువులో వెనకబడకుండా చూశారని ఎన్ని ఇబ్బందులు ఉన్నా, రోజుకు కనీసం ఐదు నుంచి ఆరు గంటల పాటు క్రమం తప్పకుండా చదివేవాడినని చెప్పాడు. క్లిష్ట సమయాల్లో కూడా క్రమశిక్షణతో చదవడమే తనను ఈ స్థాయికి చేర్చిందని ఆరవ్ అన్నాడు. హాస్పిటల్ గదుల్లో ఉన్నప్పుడు బోర్ కొట్టకుండా గేమింగ్ కన్సోల్‌లో ఆటలు ఆడటం, పుస్తకాలు చదవడం, బొమ్మలు వేయడం చేసేవాడు. సంగీతం అతనికి ఎంతో ఊరటనిచ్చింది. యూట్యూబ్ చూస్తూ సొంతంగా గిటార్ వాయించడం నేర్చుకున్నాడు. ఈ అలవాట్లు చికిత్స సమయంలో అతనికి సాధారణ జీవితాన్ని గడుపుతున్నామనే భావనను కలిగించాయి. భవిష్యత్తులో ఆరవ్ ఆస్ట్రోఫిజిసిస్ట్ (ఖగోళ భౌతిక శాస్త్రవేత్త) కావాలని కలలు కంటున్నాడు. తనకు ఇష్టమైన ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో రీసెర్చ్ చేయాలనేది అతని లక్ష్యం. తనకు ఇంతటి ధైర్యాన్ని ఇచ్చిన తన తల్లిదండ్రులే తనకు ఆదర్శమని, వారు ఎప్పుడూ తనను ప్రోత్సహిస్తూ అండగా నిలిచారని ఆరవ్ గర్వంగా చెప్పాడు. జీవితంలో ఎప్పుడూ ఆశ కోల్పోవద్దని, ఏది జరిగినా ఒక కారణం ఉంటుందని ఆరవ్ సందేశమిస్తున్నాడు. 96.6 శాతం మార్కులు సాధించడం అంటే అది కేవలం అంకెలే కాదు, చావును సైతం ఎదిరించి పోరాడిన ఒక కుర్రాడి గెలుపు. హాస్పిటల్ కారిడార్లు, అనిశ్చితి, తీవ్రమైన నొప్పిని భరిస్తూ కూడా తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న ఆరవ్ కథ అందరికీ ఒక గొప్ప పాఠం. సంకల్పం ఉంటే అసాధ్యమైంది ఏదీ లేదని అతను నిరూపించాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోబోను చూసి అడవి పందులు పరార్.. హైటెక్‌ ప్లాన్‌ అదిరిందిగా

ఒక్కరోజు వయసున్న క్యూట్ ‘రైనో’.. నెట్టింట హల్చల్ చేస్తున్న వీడియో

ఇవి పనసకాయలా.. మామిడికాయలా.. విరగకాసిందిగా

పెట్రోల్‌ బంకుల్లో ఎయిర్‌ కూలర్లు.. అమ్మడానికి కాదండోయ్‌

పాక్‌లో ఉగ్రవాదుల హత్యలు.. మోటార్‌సైకిళ్లపై వచ్చి కాల్పులు

Loading...
Unable to load recommendations.
Follow Us