అమ్మో మళ్ళీ వచ్చిన డేంజర్ వైరస్‌.. చెన్నై కాకుల మరణాలు, మహమ్మారి భయం

Updated on: Feb 08, 2026 | 12:52 PM

చెన్నైలో కాకుల మరణాలతో బర్డ్‌ఫ్లూ కలకలం రేగింది. భోపాల్ ల్యాబ్‌లో H5N1 వైరస్ నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చనిపోయిన పక్షులను పూడ్చిపెట్టి, డిస్‌ఇన్‌ఫెక్టెంట్లు చల్లుతున్నారు. ప్రజలు చనిపోయిన పక్షులను తాకవద్దని, మాస్కులు ధరించి, చికెన్, గుడ్లను బాగా ఉడికించి తినాలని సూచించారు. H5N1 మనుషులకు సోకి మహమ్మారిగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

H5N1 వైరస్.. ఈ పేరు వింటే వెంటనే గుర్తురాకపోవచ్చు. కానీ బర్డ్‌ఫ్లూ అనగానే చనిపోయిన కోళ్లు గొయ్యి తీసి గుట్టలుగా కోళ్లను కప్పెడుతున్న దృశ్యాలు కళ్లముందు మెదులుతాయి. ఇప్పుడు తమిళనాడులో ఇదే టెన్షన్ ఉంది. ఎందుకంటే చెన్నైలో కాకులు చనిపోయి కనిపిస్తున్నాయి. మొదట్లో ఇదేంటో, ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు. ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. విషయం అధికారులకు తెలిసింది. వాళ్లు వచ్చి చనిపోయిన కాకుల్ని అక్కడక్కడా చూసి ఇన్ని చనిపోతున్నాయంటే కచ్చితంగా ఏదో జరుగుతోందని కొన్ని కాకుల్ని ప్యాక్ చేసి భోపాల్‌లోని యానిమల్ డిసీజెస్ ల్యాబ్‌‌కి పంపారు. ఆ ల్యాబ్‌లో అత్యంత ప్రమాదకర బర్డ్‌ ఫ్లూ వైరస్ ఉందని తెలిసింది. వెంటనే వాళ్లు చెన్నై అధికారులకు కాల్ చేసి ఆ విషయం చెప్పగానే చెన్నై అధికారులు షాకయ్యారు. అంతే ఒక్కసారిగా సిటీ మొత్తం కలకలం మొదలైంది. చెన్నై పురపాలక శాఖ బృందాలు యుద్ధప్రాతిపదికన పనిచేసాయి. చనిపోయిన కాకులు ఎక్కువగా కనిపించిన ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్, బలమైన డిస్‌ఇన్‌ఫెక్టెంట్లు చల్లారు. చనిపోయిన పక్షులను 8 నుంచి 10 అడుగుల లోతు గొయ్యిల్లో సున్నం వేసి పూడ్చిపెట్టారు. ప్రజలు తప్పనిసరిగా పాటించాలి అంటూ DMK ప్రభుత్వం కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఇంటి దగ్గర చనిపోయిన పక్షులు కనిపిస్తే చేతులతో తాకవద్దు. పిల్లల్ని వాటికి దూరంగా ఉంచండి. అసాధారణంగా పక్షులు చనిపోతే వెంటనే మున్సిపల్ అధికారులకు చెప్పాలి. పక్షులు ఉండే పార్కులు, బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించాలి. చికెన్, గుడ్డు తినేవారు పూర్తిగా ఉడికించి తినాలి. మాంసం శుభ్రం చేసేటప్పుడు చేతులకు గ్లవ్స్ వాడండని ఆదేశాలిచ్చింది. బర్డ్‌ ఫ్లూ కోవిడ్ తర్వాత కొత్త ప్రమాదంగా మారనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పక్షులను నాశనం చేసే ఈ వైరస్ జంతువులకూ వ్యాపిస్తోంది. కోవిడ్‌ తరహాలో మనుషులకూ సోకే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనుషుల మధ్య వ్యాప్తి పెరిగితే, కోవిడ్ కంటే పెద్ద మహమ్మారి వచ్చే ప్రమాదం ఉంది. 2003- 2025 మధ్య మనుషుల్లో దాదాపు 1,000 H5 బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. అమెరికాలో ఒకే ఒక వ్యక్తి ఈ వ్యాధితో మరణించాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లక్కీ ఇండియన్‌.. దుబాయ్ లాటరీలో రూ.49 కోట్లు