పదవీ విరమణకు ముందు రోజు పర్మినెంట్ ఉద్యోగం.. టీచర్‌కు వింత అనుభవం

Updated on: Jul 04, 2026 | 8:49 PM

జార్ఖండ్‌కు చెందిన తాత్కాలిక ఉపాధ్యాయుడు నందలాల్‌కు 20 ఏళ్ల నిరీక్షణ తర్వాత రెగ్యులర్ ఉద్యోగ నియామక పత్రం లభించింది. అయితే, అది రిటైర్మెంట్‌కు కేవలం ఒక్కరోజు ముందే రావడంతో మరుసటి రోజే పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. నియామక ప్రక్రియలో జాప్యం కారణంగా ఏర్పడిన ఈ ఘటన ప్రభుత్వ వ్యవస్థపై విమర్శలకు దారితీసింది.

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది ఆయన 20 ఏళ్ల కల. ఎట్టకేలకు ఆ కల నెరవేరి, చేతికి అపాయింట్‌మెంట్ లెటర్ వచ్చింది. కానీ, ఆ సంతోషం ఒక్కరోజు కూడా నిలవలేదు. ఎందుకంటే ఆ పోస్టింగ్ లెటర్ వచ్చింది రిటైర్మెంట్ వయసుకు సరిగ్గా ఒక్కరోజు ముందు కాబట్టి! జార్ఖండ్‌లో వెలుగుచూసిన ఈ విచిత్ర ఘటన ప్రభుత్వ నియామకాల డొల్లతనానికి అద్దం పడుతోంది. జార్ఖండ్‌లోని జమ్తారా జిల్లాకు చెందిన నందలాల్ 2006 నుంచి తాత్కాలిక టీచర్‌గా పనిచేస్తున్నారు. పర్మినెంట్ పోస్టుల కోసం 2016లో టెట్ పాసయ్యారు. పారాటీచర్లకు ప్రభుత్వం వయోపరిమితి సడలించి 50% రిజర్వేషన్ కల్పించడంతో.. 2023లో తన 57వ ఏట రెగ్యులర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. మూడేళ్ల పాటు సాగిన ఈ నియామక ప్రక్రియ ఎట్టకేలకు ముగిసి, జూన్ 29న ఆయనకు అపాయింట్‌మెంట్ లెటర్ వచ్చింది. జార్ఖండ్ నిబంధనల ప్రకారం 60 ఏళ్లకు రిటైర్ కావాలి. విడ్డూరం ఏంటంటే.. పోస్టింగ్ లెటర్ అందుకున్న మరుసటి రోజే ఆయనకు 60 ఏళ్లు నిండాయి. దీంతో రెగ్యులర్ టీచర్‌గా విధులు నిర్వర్తించే అవకాశం ఆయనకు లేకుండా పోయింది. మరోవైపు పలామూకు చెందిన నియుమ్ అన్సారీది మరీ విచిత్ర పరిస్థితి. మే 31కే ఆయనకు 60 ఏళ్లు దాటినా, ఇప్పుడు రెగ్యులర్ టీచర్‌గా పోస్టింగ్ లెటర్ రావడం గమనార్హం. ఇటీవల రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ 1042 మందికి నియామక పత్రాలు అందజేశారు. ఈ ఉదంతంపై నంద్‌లాల్ స్పందిస్తూ, “2006 నుంచి విద్యాబోధన చేస్తున్నాను. శాశ్వత ఉద్యోగం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశాను. సోమవారం నాడు నియామక పత్రం అందినా, మరుసటి రోజే పదవీ విరమణ చేయాల్సి రావడం బాధాకరం” అని ఆవేదన వ్యక్తం చేశారు. పారా టీచర్ల విషయంలో ప్రభుత్వం వయోపరిమితి సడలించినప్పటికీ, నియామక ప్రక్రియలో చోటుచేసుకున్న విపరీతమైన జాప్యం వల్లే ఈ అసాధారణ పరిస్థితి తలెత్తిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మానవత్వం చాటుకున్న టీచర్‌ విద్యార్ధిని వీపుపై మోస్తూ 6 కి.మీ.

వాషింగ్ మెషిన్‌లో పసిపిల్లలు.. ఏడిస్తే చిత్రహింసలు..! డే కేర్ సెంటర్‌‌లో దారుణం

తిరుమల శ్రీవారి తొలి దర్శన భాగ్యం ఈయనకే !

గంటల తరబడి కూర్చునే డెస్క్‌ ఉద్యోగులకు హెచ్చరిక!

ఎక్కువ రోజులు ఆరోగ్యంగా బతకాలంటే.. అవి బలంగా ఉండాల్సిందే!

Follow Us