కాకతీయ వైభవానికి మరో మకుటం.. ప్రాచీన శివాలయానికి జాతీయ హోదా!

Updated on: Jul 09, 2026 | 12:36 PM

యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం సమీపంలోని పురాతన శైవాలయాన్ని కేంద్ర పురావస్తు శాఖ జాతీయ ప్రాధాన్యత కలిగిన పురావస్తు స్మారక చిహ్నంగా ప్రకటించింది. ములుగు జిల్లా పాలంపేటలో ఉన్న ఈ కాకతీయ కాలం నాటి ఆలయం సంరక్షణ, పునరుద్ధరణ బాధ్యతలను ఇకపై ఏఎస్‌ఐ చేపట్టనుంది. ఆలయ పరిసరాలను రక్షిత ప్రాంతంగా అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది.

విశ్వవిఖ్యాత యునెస్కో గుర్తింపుతో ప్రపంచ పర్యాటక పటంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రామప్ప దేవాలయం చెంతనే ఉన్న మరో అతి పురాతన శైవక్షేత్రానికి అరుదైన గౌరవం దక్కింది. శతాబ్దాల కాకతీయ శిల్పకళా వైభవానికి సాక్ష్యంగా నిలిచిన ఈ శివాలయాన్ని ‘జాతీయ ప్రాధాన్యత కలిగిన పురావస్తు స్మారక చిహ్నంగా’ గుర్తిస్తూ కేంద్ర పురావస్తు శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ములుగు జిల్లా పాలంపేటలోని సర్వే నెంబర్ 382/1/2 లో కొలువై ఉన్న ఈ పురాతన శైవాలయం, గత కొంతకాలంగా సరైన ఆదరణ లేక శిథిలావస్థకు చేరుకుంది. అయితే, ఈ చారిత్రక సంపదను కాపాడుకునేందుకు కేంద్ర పురావస్తు శాఖ ఎట్టకేలకు ముందడుగు వేసింది. 1958 నాటి ‘పురాతన కట్టడాలు, పురాతత్వ ప్రదేశాల చట్టం’ ప్రకారం ఈ ఆలయ పరిధిని జాతీయ సంపదగా ప్రకటిస్తూ తుది గెజిట్‌ను విడుదల చేసింది. కేంద్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ జనరల్ యదుబీర్ సింగ్ రావత్ ఆదేశాల మేరకు ఈ చారిత్రక నిర్ణయం వెలువడింది. ఈ ఆలయ అభివృద్ధి కోసం పురావస్తు శాఖ అధికారులు గత కొంతకాలంగా శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగానే 2026 ఫిబ్రవరి 16న ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి, ప్రజల నుండి అభ్యంతరాల స్వీకరణకు రెండు నెలల గడువు ఇచ్చారు. ఎలాంటి ఆక్షేపణలు రాకపోవడంతో ఈ ప్రక్రియ సజావుగా పూర్తయింది. ఆలయం చుట్టూ ఉన్న 0.275 ఎకరాల భూమిని రక్షిత ప్రాంతంగా ఏ.ఎస్.ఐ తన ఆధీనంలోకి తీసుకోనుంది. ఈ పరిధిలో ఎలాంటి ప్రైవేటు నిర్మాణాలు, తవ్వకాలకు అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ఇకపై ఈ ఆలయ పునరుద్ధరణ, సంరక్షణ, భద్రతా బాధ్యతలను ఏ.ఎస్.ఐ స్వయంగా పర్యవేక్షించనుంది. రామప్ప రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చే దేశ విదేశీ పర్యాటకులకు, ఈ పురాతన శైవక్షేత్రం అదనపు ఆధ్యాత్మిక అనుభూతిని పంచనుంది. శిథిలాల నుండి పూర్వ వైభవానికి చేరుకోబోతున్న ఈ ఆలయ పరిసరాలను అత్యంత ఆహ్లాదకరమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పురావస్తు శాఖ ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. కాకతీయుల నాటి భక్తి తత్వానికి, శిల్పకళా చాతుర్యానికి ఈ ఆలయ పునరుద్ధరణ సరికొత్త ఊపిరి పోయనుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చైనాలో గుడ్డు కూర ధర ఎంతో తెలుసా? సాధారణ వంటకం ఎందుకంత ఖరీదైందంటే?

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ.. దేని నుంచి తయారు చేస్తారో తెలిస్తే..

ఈ వారం OTTలో సూపర్ డూపర్ హిట్టు మూవీస్ ఇవే..

Follow Us