పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
25 ఏళ్ల క్రితం తీసుకున్న అప్పును తీర్చేందుకు కేరళకు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ వేల కిలోమీటర్లు ప్రయాణించి జగిత్యాల జిల్లా ధర్మపురికి చేరుకున్నారు. సౌదీలో కలిసి పనిచేసిన మిత్రుడు లచ్చన్నను గూగుల్ సాయంతో వెతికి, ఆయన కుటుంబానికి రూ.25 వేల నగదు అందజేశారు. అప్పు ఇచ్చిన విషయమే మరిచిపోయిన లచ్చన్నను ఈ ఘటన భావోద్వేగానికి గురిచేయగా, ఇస్మాయిల్ నిజాయితీ అందరినీ కదిలించింది.
మాట ఇస్తే ప్రాణం పోయినా నిలబెట్టుకునే మనుషులు ఇంకా ఉన్నారని నిరూపించింది ఈ ఘటన. 25 ఏళ్ల క్రితం తీసుకున్న అప్పును తిరిగి చెల్లించేందుకు, కేరళకు చెందిన ఓ వ్యక్తి వేల కిలోమీటర్లు ప్రయాణించి జగిత్యాల జిల్లా ధర్మపురికి రావడం స్థానికంగా అందరినీ ఆశ్చర్యానికి, తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన మహ్మద్ ఇస్మాయిల్, ధర్మపురికి చెందిన ఎడ్ల లచ్చన్న సుమారు 25 ఏళ్ల క్రితం సౌదీ అరేబియాలో కలిసి పనిచేశారు. ఆ సమయంలో లచ్చన్న వద్ద ఇస్మాయిల్ కొంత నగదు అప్పుగా తీసుకున్నారు. స్వదేశానికి వచ్చాక అనివార్య కారణాల వల్ల ఇద్దరి మధ్య పరిచయాలు తెగిపోయాయి. ఏళ్లు గడిచినా ఇస్మాయిల్ మాత్రం ఆ అప్పును మరిచిపోలేదు. లచ్చన్న ఫోన్ నెంబర్, పూర్తి అడ్రస్ లేకపోయినా.. కేవలం ‘ధర్మపురి’ అనే ఒకే ఒక్క ఆధారంతో గూగుల్‌లో వెతుక్కుంటూ గురువారం లచ్చన్న ఇంటిని చేరుకున్నారు. ప్రస్తుతం లచ్చన్న మళ్లీ గల్ఫ్‌లోనే ఉండటంతో, ఇస్మాయిల్ ఆయన కుటుంబ సభ్యులను కలిసి రూ. 25 వేల నగదును అందజేశారు. అనంతరం లచ్చన్నకు ఫోన్ చేయగా, తాను ఇచ్చిన అప్పునే మరచిపోయిన లచ్చన్న.. ఇన్నేళ్ల తర్వాత మిత్రుడి గొంతు వినగానే గుర్తుపట్టి భావోద్వేగానికి లోనయ్యారు. ఇన్నేళ్ల నాటి రుణభారం ఇప్పటికి తీరిందని ఇస్మాయిల్ కన్నీరు పెట్టుకున్నారు. చిన్న చిన్న అప్పులకే ముఖం చాటేసే ఈ రోజుల్లో, పాతికేళ్ల తర్వాత వెతుక్కుంటూ వచ్చి మరీ అప్పు తీర్చిన ఇస్మాయిల్ నిజాయితీ, స్నేహబంధాన్ని చూసి ధర్మపురి ప్రజలు ముగ్ధులవుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
