హైదరాబాద్‌లో మరో నకిలీ డాక్టర్ గుట్టురట్టు.. అర్హతలు లేకున్నా వైద్యం
హైదరాబాద్‌లోని ఉప్పల్, బీరప్పగడ్డలో అంజలి ఫస్ట్ ఎయిడ్ & క్లినిక్ పేరుతో బానోతు శ్రీను నకిలీ డాక్టర్‌గా వ్యవహరిస్తూ అరెస్ట్ అయ్యాడు. వైద్య అర్హతలు లేకుండా చికిత్సలు, ఇంజెక్షన్లు అందిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాడు. నకిలీ ఇంజెక్షన్లతో మరణాలు సంభవించిన నేపథ్యంలో, ఇటువంటి మోసాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అర్హత కలిగిన వైద్యుల వద్దే చికిత్స తీసుకోవాలని ప్రజలకు సూచన.
టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతుందో.. అంతే వేగంగా మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. కల్తీ ఆహారంతో కొందరు ప్రజల ఆరోగ్యం దెబ్బతీస్తుంటే.. నకిలీ వైద్యులు ఏకంగా క్లినిక్‌లు పెట్టేసి అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో మరో నకిలీ డాక్టర్ గుట్టు రట్టయింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరప్పగడ్డ ప్రాంతంలో అర్హత లేని వ్యక్తి వైద్యుడిగా వ్యవహరిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. అంజలి ఫస్ట్ ఎయిడ్ & క్లినిక్ పేరుతో మెడికల్ షాప్ నిర్వహిస్తూ, ఎలాంటి వైద్య అర్హతలు లేకుండా చికిత్సలు అందిస్తున్న బానోతు శ్రీనును ఎస్ఓటీ ఉప్పల్ జోన్ టీమ్ అరెస్టు చేసింది. క్లినిక్‌కు అవసరమైన రిజిస్ట్రేషన్ లేకపోవడంతో పాటు, యూబీ డాక్టర్ సర్టిఫికెట్లు లేకుండా మందులు, ఇంజెక్షన్లు ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. దాడుల సమయంలో ప్రిస్క్రిప్షన్ బుక్స్, స్టెతోస్కోప్, బీపీ చెక్ మెషిన్, సిరింజులు, వివిధ రకాల టాబ్లెట్లు, యాంటీబయోటిక్ ఇంజెక్షన్లు, గ్లూకోజ్ నీడిల్స్, ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లు తదితర వైద్య సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలంగాణలో నకిలీ డాక్టర్ల సమస్య రోజు రోజుకీ తీవ్ర రూపం దాలుస్తోంది. ఇటీవల మేడ్చల్ మేడిపల్లిలో నకిలీ ఇంజెక్షన్ల కారణంగా ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మరువకముందే, హైదరాబాద్‌లోనే మరో ఘటన వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు వైద్య అర్హతలు లేని వారి వద్ద చికిత్సలు తీసుకోకూడదని, నిపుణులైన వైద్యుల వద్దే చికిత్స చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నకిలీ డాక్టర్లపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: