ఎల్‌నినో ఎఫెక్ట్.. ఆహార నిల్వల్లో దూసుకెళ్తున్న చైనా.. మరి భారత్ పరిస్థితేంటి?
సూపర్ ఎల్‌నినో ముప్పు నేపథ్యంలో భారత్ ఆహార భద్రతపై చర్చ మొదలైంది. 2024–25లో దేశంలో 353.96 మిలియన్ టన్నుల ఆహారధాన్యాలు ఉత్పత్తి కాగా, నిల్వ సామర్థ్యం 91.78 మిలియన్ టన్నులుగా ఉంది. చైనా ఆధునిక సాంకేతికతతో ధాన్యాన్ని భద్రపరుస్తోంది. భారత్ కూడా శాస్త్రీయ నిల్వ పద్ధతులు, తేమ నియంత్రణ, డిజిటల్ పర్యవేక్షణ, గ్రామీణ గోదాములను మెరుగుపరిస్తే రైతులకు, దేశ ఆహార భద్రతకు ప్రయోజనం చేకూరుతుంది.
సూపర్ ఎల్‌నినో ముప్పు వ్యవసాయ రంగంలో ఆందోళన పెంచుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రేపు పంట దిగుబడులు తగ్గితే మన దగ్గరున్న ధాన్యం ఎంతకాలం వస్తుంది? భారత్ ఏడాదికి ఎన్ని మిలియన్ టన్నుల ఆహారధాన్యాలను పండిస్తోంది. పండించిన ధాన్యాన్ని భద్రంగా నిల్వ చేసుకునే సామర్థ్యం ఎంత? మన దగ్గర పంట పండించడంపైనే కాదు.. పండించిన ప్రతి గింజను కాపాడుకోవడంపైనా అంతే శ్రద్ధ ఉందా? వాతావరణం ఎప్పుడు మోసం చేస్తుందో తెలియని పరిస్థితుల్లో ఆహార భద్రతకు గోదాములే కీలకం. రైతు కష్టం వృథా కాకుండా, రేపటి ఆహార అవసరాలకు ఇబ్బంది రాకుండా భారత్ ఏం చేయాలి? చైనా తన పంటను ఎలా కాపాడుకుంటోంది ? 2024–25లో భారత్ ఆహారధాన్యాల ఉత్పత్తి 353.96 మిలియన్ టన్నులకు చేరింది. దేశం వ్యవసాయ రంగంలో సాధిస్తున్న ఉత్పత్తి స్థాయికి ఈ సంఖ్య అద్దం పడుతోంది. కానీ పంట పండించడం ఎంత ముఖ్యమో.., ఆపంటను కాపాడుకోవడం అంతే ముఖ్యం. కాపాడుకున్న ధాన్యాన్ని పాడవకుండా నిల్వచేసుకోవడం అంతకంటే ముఖ్యం. భారత్‌లో ఆహారధాన్యాల నిల్వ సామర్థ్యం 91.78 మిలియన్ టన్నులు. ఏడాది మొత్తం ఉత్పత్తిని ఒకేసారి గోదాముల్లో ఉంచాల్సిన అవసరం లేకపోయినా, పంట కోతల సమయంలో వచ్చే భారీ సరఫరాను ప్రభుత్వ కొనుగోళ్లు, ప్రజా పంపిణీ వ్యవస్థ, అత్యవసర నిల్వలు, ధాన్యం రవాణా.. అన్నింటికీ తగిన సదుపాయాలు అవసరం. కాబట్టి అసలు ప్రశ్న గోదాముల సంఖ్య ఎంత అన్నది మాత్రమే కాదు.. అవసరమైన సమయంలో, అవసరమైన ప్రాంతంలో, నాణ్యత దెబ్బతినకుండా ఎంత ధాన్యాన్ని నిల్వ చేయగలుగుతున్నామన్నదే అసలు ప్రశ్న. చైనా ధాన్యాన్ని నిల్వ చేయడంలో ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తోంది. ఆ దేశంలో ధాన్యాన్ని భద్రపరిచే గోదాముల మొత్తం సామర్థ్యం 730 మిలియన్ టన్నులకు పైగా ఉంది. ఇందులో 250 మిలియన్ టన్నులకు పైగా ధాన్యాన్ని తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేసే సదుపాయాలు ఉన్నాయి. మరో 67 మిలియన్ టన్నుల ధాన్యాన్ని గోదాముల్లో ఉష్ణోగ్రత, తేమతోపాటు గాలి పరిస్థితులను నియంత్రిస్తూ నిల్వ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ధాన్యానికి పురుగులు పట్టకుండా, నాణ్యత తగ్గకుండా కాపాడుకోవచ్చు. ధాన్యం గోదాముల్లోకి చేరినప్పుడు దాని నాణ్యతను పరీక్షించడానికి కూడా చైనా టెక్నాలజీని ఉపయోగిస్తోంది. హెబే ప్రావిన్స్‌లోని కిన్హువాంగ్డావోలో ఒకప్పుడు ఒక్క ట్రక్కులోని ధాన్యం నమూనాలను సేకరించడానికి 20 నిమిషాలు పట్టేది. ఇప్పుడు స్మార్ట్ యంత్రాల సాయంతో అదే పని కేవలం రెండు నిమిషాల్లో పూర్తవుతోంది. గోదాముల్లో నిల్వ చేసిన ధాన్యం వేడెక్కకుండా ప్రత్యేక యంత్రాలతో గాలి ప్రసరణను నియంత్రిస్తున్నారు. ఒక గోదాములో 12,500 టన్నుల మొక్కజొన్నను నిల్వ చేస్తూ, ఏడాది పొడవునా ధాన్యం ఉష్ణోగ్రతను 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంచుతున్నారు. ఇలా నిల్వ చేసే విధానాలను మెరుగుపరచడంతోపాటు, చైనా ధాన్యం ఉత్పత్తిలోనూ రికార్డు సాధించింది. 2025లో ఆ దేశం 714.88 మిలియన్ టన్నుల ధాన్యాన్ని పండించింది. వరుసగా రెండో ఏడాది కూడా ఉత్పత్తి 700 మిలియన్ టన్నులు దాటింది. అంటే చైనా పెద్ద మొత్తంలో ధాన్యాన్ని పండించడమే కాకుండా, పండించిన ధాన్యం పాడవకుండా నిల్వ చేయడానికి కూడా ఆధునిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది. భారత్ కూడా తన అవసరాలకు తగినట్టుగా ఇలాంటి సాంకేతికతను ఉపయోగించి ధాన్యం నిల్వలను మరింత మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత్‌లో 8,815 కోల్డ్ స్టోరేజీ యూనిట్లు ఉన్నాయ్. వాటి మొత్తం సామర్థ్యం 402.18 లక్షల మెట్రిక్ టన్నులు.. అంటే సుమారు 40.21 మిలియన్ టన్నులు. అయితే ఈ సదుపాయాలు ప్రధానంగా పండ్లు, కూరగాయలు వంటి త్వరగా పాడయ్యే ఉత్పత్తుల కోసం మాత్రమే ఉపయోగపడతాయి. ఆహారధాన్యాలు, పప్పుధాన్యాల కోసం అనువైన గోదాములు, తేమ నియంత్రణ, కీటకాల నివారణ, ఉష్ణోగ్రత పర్యవేక్షణ, శాస్త్రీయ నిల్వ పద్ధతులు అవసరం. చైనాలో ఉన్నట్టుగా సెన్సర్లు, డిజిటల్ మానిటరింగ్, ఆటోమేటెడ్ శాంప్లింగ్ వంటి సాంకేతికతను మన అవసరాలకు అనుగుణంగా విస్తరించవచ్చు. ముఖ్యంగా రైతు పంటను నిల్వ చేసుకునే సదుపాయం గ్రామీణ ప్రాంతాల్లోనే అందుబాటులో ఉండాలి. పంట చేతికొచ్చిన వెంటనే గిట్టుబాటు ధర లేక తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి తగ్గాలి. అదే సమయంలో ప్రభుత్వ కొనుగోళ్లు, మార్కెటింగ్, రవాణా సదుపాయాలు కూడా మెరుగుపడాలి. ఎందుకంటే గోదాముల సామర్థ్యం పెరగడం ఒక్కటే రైతుకు గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇవ్వదు. కానీ పంటను భద్రంగా దాచుకునే అవకాశం రైతుకు కొంత వెసులుబాటు కల్పిస్తుంది. సూపర్ ఎల్‌నినో ప్రభావంతో పంటల దిగుబడులు తగ్గే పరిస్థితి ఎదురైతే, అందుబాటులో ఉన్న ధాన్యాన్ని సురక్షితంగా నిల్వచేయడం, అవసరమైన చోటికి సరఫరా చేయడం మరింత కీలకమవుతుంది. పంట పండించడం ఎంత ముఖ్యమో, పండించిన ధాన్యాన్ని నాణ్యతతో కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. వాతావరణం ఎలాంటి సవాళ్లు విసిరినా రైతు నష్టపోకుండా, దేశ ఆహార భద్రతకు ముప్పు రాకుండా ఉండాలంటే నిల్వ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మ కోసం 12 జ్యోతిర్లింగాలకు పరుగు.. రోజుకు 50 కి.మీ. రన్..
సముద్ర తీరానికి కొట్టుకొస్తున్న ఐఫోన్లు.. ఎగబడిన జనాలు
గుడిముందు జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు
టైప్-1 షుగర్ బాధలకు చెక్! 14 ఏళ్ల వరంగల్ కుర్రాడి జీవితమే దీనికి ఉదాహరణ!
నగరంలో పెరుగుతున్న నీటి కొరత.. భవిష్యత్తులో తప్పని ఇబ్బందులు!
