మాయమైపోతున్న మాన్‌సూన్.. రైతుల్లో టెన్షన్ టెన్షన్

Updated on: Jun 18, 2026 | 1:10 PM

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు బలహీనపడటంతో వర్షాభావం 64 శాతానికి చేరింది. పశ్చిమ జెట్ స్ట్రీమ్‌ల ప్రభావంతో వర్షమేఘాలు ఏర్పడటం లేదు. అయితే, రుతుపవనాలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు రాబోయే రోజుల్లో వర్షాలు, పిడుగులు, అధిక ఉష్ణోగ్రతల మిశ్రమ పరిస్థితులు అంచనా వేస్తున్నారు. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు ఒక్కసారిగా బలహీనపడటంతో వర్షాలు మందగించాయి. జూన్ 4 నుంచి 15 వరకు సాధారణంగా 53.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 19.2 మిల్లీమీటర్ల వాన మాత్రమే పడింది. దీనివల్ల దేశవ్యాప్తంగా వర్షాభావం ఏకంగా 64 శాతానికి చేరుకుంది. భారత వాతావరణ శాఖ విడుదల చేసిన మ్యాప్‌లో మధ్య, దక్షిణ, తూర్పు భారతదేశంలోని చాలా ప్రాంతాలు తక్కువ వర్షపాతాన్ని సూచిస్తూ పసుపు, ఎరుపు రంగుల్లో కనిపిస్తున్నాయి.జూన్ 15న ఇన్సాట్-3డీఎస్ ఉపగ్రహం తీసిన చిత్రాల్లో కూడా దట్టమైన వర్షపు మేఘాలు మాయమై, ద్వీపకల్ప, మధ్య భారతదేశ ప్రాంతాలు మేఘాలు లేకుండా దర్శనమిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం పశ్చిమ దిశ నుంచి వేగంగా వీచే వెస్టర్లీ జెట్ స్ట్రీమ్ గాలులు సాధారణ స్థానం కంటే మరింత దక్షిణానికి కదలడం. ఇది వర్షమేఘాలు ఏర్పడటానికి దోహదపడే ఈస్టర్లీ జెట్ గాలుల పనితీరును దెబ్బతీసింది. వాతావరణ నిపుణులు దీన్ని మాన్‌సూన్ విరామంగా అభివర్ణిస్తున్నారు.

Follow Us