నిన్న నాని.. నేడు విజయ్.. ఇది సీరియస్ మ్యాటర్..!
టాలీవుడ్‌లో యంగ్ హీరోలను టార్గెట్ చేస్తూ పెయిడ్ నెగెటివ్ క్యాంపెయిన్‌లు నడుస్తున్నాయని విజయ్ దేవరకొండ, నాని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాలపై లక్షలు ఖర్చు పెట్టి నెగెటివిటీని ప్రచారం చేస్తున్నారని, ఇది పరిశ్రమకు మంచిది కాదని హెచ్చరించారు. ఈ ప్రమాదకరమైన ట్రెండ్ వెనక ఎవరున్నారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
టాలీవుడ్‌లో యంగ్ హీరోలను కొందరు కావాలనే టార్గెట్ చేస్తున్నారా? వారి సినిమాలపై లక్షలు ఖర్చు పెట్టి పెయిడ్ నెగెటివ్ క్యాంపెయిన్‌లు నడిపిస్తూ కిందకి లాగేయడానికి చూస్తున్నారా? గత కొంతకాలంగా ఈ ప్రశ్నలు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. రణబలి ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు ఈ చర్చకు మరింత ఆజ్యం పోశాయి. తనను తొక్కేయడానికి, తన సినిమాలను దెబ్బతీయడానికి కొందరు డబ్బులు ఖర్చు పెట్టి ఫేక్ నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.నిజానికి, ఇలాంటి పెయిడ్ నెగెటివిటీపై గళం విప్పింది విజయ్ దేవరకొండ ఒక్కరే కాదు. మొన్నటికి మొన్న నాని కూడా పారడైజ్ ఈవెంట్ లో ఇండస్ట్రీలో నెగెటివిటీ పెరిగిపోతోందని ఘాటుగానే స్పందించారు. సినిమాల మీద కావాలని విషం చిమ్మే కల్చర్ పెరిగిపోతోందని, ఇది ఇండస్ట్రీకే మంచిది కాదని ఆయన హెచ్చరించారు. ఇటీవల కిరణ్ అబ్బవరం, సందీప్ కిషన్ వంటి హీరోలు కూడా దీనిపై ఓపెన్ అయ్యారు. కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు, థియేటర్ల కంటే ముందే సోషల్ మీడియాలో పెయిడ్ ట్రోలర్స్ బ్యాచ్ రంగంలోకి దిగుతోంది. ఫేక్ ప్రొఫైల్స్‌తో సినిమాను, హీరోను కావాలనే డ్యామేజ్ చేసే ఈ ప్రమాదకరమైన ట్రెండ్ టాలీవుడ్‌ను పట్టి పీడిస్తోంది. స్వార్థం కోసం ఇండస్ట్రీ వ్యక్తులే ఈ కుట్రలకు తెరలేపుతున్నారా లేక బయటి వ్యక్తుల పనేనా అనేది కాలమే నిర్ణయించాలి.
