నెలలోపే ఓటీటీలో… బిగ్ స్క్రీన్‌కు భారీ గండి
ఒకప్పుడు థియేటర్ల ద్వారానే ప్రధాన ఆదాయం వచ్చేది. కానీ ఇప్పుడు ఓటీటీ రైట్స్ ముఖ్యమయ్యాయి. సినిమా విడుదలైన నెలలోపే ఓటీటీలోకి రావడంతో థియేటర్లకు ప్రేక్షకులు దూరమవుతున్నారు. బాలీవుడ్, మాలీవుడ్ పద్ధతుల నుండి టాలీవుడ్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని, నిర్మాతలు తిరిగి థియేట్రికల్ రన్ పై దృష్టి పెట్టాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.
ఒకప్పుడు సినిమా బడ్జెట్‌లో శాటిలైట్ రైట్స్ కీలక పాత్ర పోషించగా, ఆ తర్వాత ఓటీటీ వాటి స్థానాన్ని ఆక్రమించింది. అయితే ఇప్పుడు ఈ ధోరణి థియేట్రికల్ వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చిన్న, పెద్ద సినిమాలతో సంబంధం లేకుండా టాలీవుడ్ మొత్తం ఈ వాస్తవాన్ని ఎదుర్కొంటోంది. థియేట్రికల్ రెవెన్యూ సెకండ్ ఇన్కమ్‌గా మారి, ఓటీటీ, డిజిటల్ రైట్స్ మెయిన్ సోర్స్‌గా మారాయి. మేకర్స్ ముందుగా ఓటీటీ డీల్స్ క్లోజ్ చేసుకుని, ఆ తర్వాత సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో రిలీజ్ డేట్‌లను కూడా ఓటీటీ సంస్థలే నిర్ణయిస్తున్నాయి. దీనివల్ల బాక్సాఫీస్ రన్ పై ఫోకస్ తగ్గిందన్న అంచనాకు ప్రేక్షకులు వస్తున్నారు. దీనికి తోడు, సినిమాలు నెలరోజులు కూడా తిరక్కముందే ఓటీటీకి వచ్చేస్తుండడం థియేట్రికల్ రన్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. బాలీవుడ్‌లో ఎనిమిది వారాల విండో పద్ధతి పక్కాగా అమలువుతుండగా, టాలీవుడ్‌లో మాత్రం ఇది అమలుకావడం లేదు. ఇటీవలి రామ్ చరణ్ పెద్ది, మహేశ్ బాబు గుంటూరు కారం, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలు నెల తిరక్కముందే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌కు వచ్చాయి. ఇది థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య భారీగా తగ్గడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
