Hanuman Ansh: త్రివిక్రమ్ తీసుకొస్తున్నారు సరే తెలుగు ఆడియన్స్ ఎంతవరకు ఆదరిస్తారు?

Updated on: Sep 13, 2026 | 5:23 PM

కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ.150 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు సాధించిన ఆధ్యాత్మిక చిత్రం ‘హనుమాన్‌ అంశ్‌’ ఇప్పుడు తెలుగులోకి వస్తోంది. నీమ్‌ కరోలి బాబా జీవితం, సందేశం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తన ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్‌పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సెప్టెంబర్‌ 18న విడుదల కానున్న ఈ సినిమా తెలుగులోనూ అదే విజయాన్ని అందుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.

“పురాణాలు అంటే గతం కాదు.. మన వర్తమానానికి దారి చూపే దిక్సూచి” అని బలంగా నమ్మే దర్శకుడు మన టాలీవుడ్‌లో ఒక్కరే ఉన్నారు. ఆయనే త్రివిక్రమ్‌ శ్రీనివాస్. మాటల్లో వేదాంతం, చేతల్లో సనాతన ధర్మం పట్ల అపారమైన గౌరవం చూపిస్తుంటారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. సాధారణంగా స్టార్ హీరోలతో వందల కోట్ల భారీ బడ్జెట్ సినిమాలు చేసే త్రివిక్రమ్.. హఠాత్తుగా ఎలాంటి స్టార్ కాస్ట్ లేని, కేవలం రెండు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఒక చిన్న సినిమాను సమర్పించడానికి ఎందుకు ముందుకొచ్చారు? తన సొంత బ్యానర్ ‘ఫార్చూన్ ఫోర్ సినిమాస్’ తరఫున ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకుల ముందుకు ఎందుకు తీసుకొస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే.. మనం ఒక అద్భుతాన్ని అర్థం చేసుకోవాలి. కేవలం రెండు కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుని.. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 150 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి, యావత్ భారతీయ సినీ రంగాన్ని షాక్‌కు గురిచేసిన అద్భుత చిత్రం.. ‘హనుమాన్ అంశ్’. సెప్టెంబరు 18న ఈ అద్భుతం తెలుగు తెరపై కూడా ఆవిష్కృతం కాబోతోంది. ఈ సినిమాను మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ తెలుగు ప్రజల కోసం తీసుకువస్తున్నారు. సినిమాలు అంటే 500 కోట్లు పెట్టాలి.. విజువల్ ఎఫెక్ట్స్ ఉండాలి.. పాన్ ఇండియా మార్కెటింగ్ గిమ్మిక్కులు చేయాలి అనుకుంటున్న ఈ రోజుల్లో, కేవలం భక్తి, నిజాయితీ, బలమైన కంటెంట్‌తో ఈ సినిమా దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రభంజనం సృష్టించింది? అసలు దీని వెనుక ఉన్న కథేంటి? రండి, డీటెయిల్డ్‌గా విశ్లేషిద్దాం. గత నాలుగైదేళ్లుగా ఇండియన్ సినిమా చూస్తున్న ఒకే ఒక్క ట్రెండ్.. ‘పాన్ ఇండియా’. 200 కోట్లు బడ్జెట్, మరో 50 కోట్లు ప్రమోషన్లు. ముంబై, హైదరాబాద్, చెన్నై, కొచ్చి అంటూ విమానాల్లో తిరుగుతూ ఈవెంట్లు చేయడం. తీరా థియేటర్లలోకి వస్తే.. బలమైన కథ లేక మొదటి సోమవారానికే థియేటర్లు ఖాళీ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ‘హనుమాన్ అంశ్’ దీనికి పూర్తి వ్యతిరేకమైన దారిలో నడిచింది. ఈ చిత్ర దర్శకుడు విశాల్ చతుర్వేది, ప్రధాన పాత్ర పోషించిన శోభినవ్ సత్య.. ఇద్దరి దగ్గరా స్టార్ ఇమేజ్ లేదు. సినిమా తీయడానికి వాళ్ల దగ్గరున్న మొత్తం జస్ట్ 2 కోట్ల రూపాయలు. ఇప్పటి కాలంలో ఒక పెద్ద సినిమా పాట చిత్రీకరణకు కూడా ఈ బడ్జెట్ సరిపోదు. అలాంటి పరిస్థితుల్లో, కనీసం టీవీలలో యాడ్స్ ఇవ్వడానికి, మెట్రో నగరాల్లో పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టడానికి కూడా వీరి దగ్గర నయాపైసా మిగల్లేదు. ఈ సమయంలో వారు తీసుకున్న ఒకే ఒక్క అస్త్రం.. “కథపై నమ్మకం, తాము కొలిచే దైవంపై భక్తి”. అదే పాన్ ఇండియా అనేది మార్కెటింగ్ వల్ల రాదు, ప్రేక్షకుల హృదయాల్లోంచి పుడుతుందనే సత్యాన్ని ఈ సినిమా మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. సినిమా పూర్తయింది.. సెన్సార్ అయిపోయింది.. మరి జనం థియేటర్లకు ఎలా రావాలి? పబ్లిసిటీ ఎలా చేయాలి? ఇక్కడే విశాల్ చతుర్వేది అండ్ అతని చిత్ర బృందం ప్రపంచ సినీ చరిత్రలోనే ఎవరూ చేయని ఒక వినూత్న ఆలోచన చేశారు. అదే.. ‘భండారా’ అంటే సామూహిక అన్నదానం. సాధారణంగా నిర్మాతలు ప్రమోషన్ల కోసం పబ్లిక్ రిలేషన్స్ ఏజెన్సీలకు, మీడియా ఛానెళ్లకు కోట్లు ఇస్తారు. కానీ ఈ చిత్ర బృందం.. తమ ప్రమోషన్ బడ్జెట్‌ను పేదలకు, భక్తులకు భోజనాలు పెట్టడానికి ఉపయోగించింది. 8 ప్రముఖ ప్రాంతాల్లో భారీ ఎత్తున సామూహిక అన్నదానాలు నిర్వహించింది. కడుపు నిండా భోజనం పెట్టి, చివర్లో చేతులు జోడించి.. “మేము నీమ్ కరోలి బాబా జీవితాన్ని, ఆయన సందేశాన్ని ఒక సినిమాగా మలిచాం. మీకు వీలైతే థియేటర్‌కు వచ్చి చూడండి” అని ఒకే ఒక్క విజ్ఞప్తి చేశారు. అన్నం పెట్టిన చేతిని జనం మరచిపోతారా? ఆ వినయం, ఆ సంస్కారం ప్రజల మనసులను తాకింది. మొదటి రోజు బాబా భక్తులు థియేటర్లకు వెళ్లారు. సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. బయటకు వచ్చి మైకులు పట్టుకుని కాకపోయినా.. తమ వాట్సాప్ గ్రూపుల్లో, కాలనీల్లో, ఊళ్లలో ఒక్కటే మాట చెప్పారు: “ఇది కేవలం సినిమా కాదు.. ఒక పవిత్రమైన అనుభూతి!” అని.ఈ ‘మౌత్ టాక్’ ఎంత వేగంగా పాకిందంటే.. మొదటి రోజు కొన్ని లక్షలతో మొదలైన వసూళ్లు.. రెండో రోజు రెట్టింపయ్యాయి. మొదటి వారం పూర్తయ్యేసరికి దేశవ్యాప్తంగా స్క్రీన్ల సంఖ్య పెంచాల్సి వచ్చింది. ఇంతకీ ఈ సినిమా వెనుక ఉన్న ఆ దివ్య శక్తి ఎవరు? ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆకర్షిస్తున్న ‘నీమ్ కరోలి బాబా’ ఎవరు?!!! 1900 నుంచి 1973 మధ్య జీవించిన లక్ష్మీ నారాయణ్ శర్మ అనే సాధారణ వ్యక్తి.! కాలక్రమంలో హనుమంతుడి పరమ భక్తుడిగా, సాక్షాత్తూ హనుమాన్ స్వరూపంగా భక్తులందరితో పూజలందుకుని ‘నీమ్ కరోలి బాబా’గా ప్రసిద్ది చెందారు. ఆయన్నే ‘మహరాజ్‌జీ’ అని కూడా అంటారు. ఆయన ఎప్పుడూ పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్పలేదు, క్లిష్టమైన యోగాసనాలు నేర్పలేదు. ఆయన చెప్పిన సిద్ధాంతం మూడే మూడు మాటలు: “సబ్‌సే ప్రేమ్ కరో, సబ్‌కో భోజన్ కరావో, భగవాన్ కా నామ్ లో” అంటే అందరినీ ప్రేమించు, అందరికీ అన్నం పెట్టు, దేవుడిని స్మరించు.. బాబా ఆధ్యాత్మిక శక్తి ఎంతటిదంటే.. ఆపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్.. కెరీర్ ప్రారంభంలో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ దగ్గర ఉన్న ‘కైంచి ధామ్’ ఆశ్రమానికి వచ్చి అంతఃశాంతి పొందారు.ఫేస్‌బుక్ తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పుడు, స్టీవ్ జాబ్స్ ఇచ్చిన సలహాతో మార్క్ జుకర్‌బర్గ్ నేరుగా ఈ ఆశ్రమానికి వచ్చి బాబా ఆశీస్సులు కోరారు. మన భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సమయంలో, అనుష్క శర్మతో కలిసి కైంచి ధామ్ సందర్శించిన తర్వాతే మళ్లీ తన అసలైన ఆటతీరును ప్రదర్శించాడనే విషయం అందరికీ తెలిసిందే. సాధారణ భక్తుల నుంచి గ్లోబల్ టెక్ ఐకాన్స్ వరకు అందర్నీ ప్రభావితం చేసిన ఆ మహనీయుడి జీవితం, ఆయన చేసిన లీలలు, ఎదుర్కొన్న పరీక్షలను దర్శకుడు విశాల్ చతుర్వేది వెండితెరపైకి అత్యంత సహజంగా తెచ్చారు. అదే ‘హనుమాన్ అంశ్’ విజయ రహస్యం. ఒక సినిమా విజయాన్ని సంఖ్యలతో కొలిస్తే.. ‘హనుమాన్ అంశ్’ సృష్టించిన రికార్డులు కనీవినీ ఎరుగనివి. కేవలం 2 కోట్ల పెట్టుబడి.. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 150 కోట్లకు పైగా గ్రాస్! అంటే దాదాపు 70 రెట్లకు పైగా లాభం. ఇటీవలి కాలంలో ‘ది కశ్మీర్ ఫైల్స్’, ‘కాంతార’, ‘కార్తికేయ 2’ తర్వాత అత్యధిక రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ సాధించిన అరుదైన చిత్రంగా ఇది నిలిచింది. సినిమా చూసిన రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు, బాలీవుడ్ ప్రముఖులు సైతం ఆశ్చర్యపోయారు. “ఆడంబరాలు లేని ఆధ్యాత్మిక ప్రయాణం ఇది.. ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం ఇది” అంటూ ట్విట్టర్‌లో పోస్టులు పెట్టారు. దీంతో మల్టీప్లెక్స్‌లు సైతం పెద్ద పెద్ద చిత్రాల షోలను తగ్గించి, ఈ చిన్న సినిమాకు స్క్రీన్లు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు సరిగ్గా ఇదే సంచలనం మన తెలుగు గడ్డపై అడుగుపెట్టబోతోంది. తెలుగు ప్రేక్షకులకు భక్తి, పురాణాలు, ఆధ్యాత్మికత అంటే ప్రత్యేకమైన అభిమానం. కొన్నేళ్ల క్రితం ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ల నుంచి నిన్నటి ‘కాంతార’, ‘హను-మాన్’ వరకు మంచి భక్తిరస చిత్రాలను తెలుగు వారు ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుని ఆదరించారు. ఈ పల్స్ పట్టుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ అద్భుతమైన కథను తెలుగు ప్రేక్షకుల వరకు చేర్చాలని నిర్ణయించుకున్నారు. ఫార్చూన్ ఫోర్ సినిమాస్ ఈ చిత్రాన్ని సెప్టెంబరు 18న థియేటర్లలో విడుదల చేస్తోంది.డబ్బు, గ్రాఫిక్స్, అరుపులు మాత్రమే సినిమా కాదు.. మనసును హత్తుకునే ఆధ్యాత్మిక శక్తి ఉంటే ప్రేక్షకుడు బ్రహ్మరథం పడతాడని నిరూపించిన చిత్రం ‘హనుమాన్ అంశ్’. మరి నార్త్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ డివైన్ బ్లాక్‌బస్టర్.. సెప్టెంబరు 18న తెలుగులో ఎలాంటి చరిత్ర సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏమిటి? బాబా మహిమల గురించి మీకేమైనా తెలుసా? కామెంట్ రూపంలో తెలియజేయండి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏఐతో మానవాళికి పెను ప్రమాదం.. పదేళ్లలో పదిశాతం జన నష్టం?

2027లో ఏం జరగబోతోంది? బాబా వంగ జోస్యం తెలిస్తే వణికిపోవాల్సిందేనా?

ఒక్క నది లేదు.. చుక్క వర్షం పడదు.. అయినా నిత్యం 3.7 కోట్ల మందికి మంచినీరు.. ఎలా?

వైష్ణవితో నిజంగానే లవ్ ఉందా ? అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ

Loading...
Unable to load recommendations.
Follow Us